AI:- ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) అనేది ఏదో ఒకరోజు మానవ మేధస్సును మించిపోతుందని చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ మరికొందరు మాత్రం ఏఐ వల్ల మనుషులకు జరుగుతున్న లాభాలకంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని విమర్శిస్తున్నారు. శాస్త్రవేత్తలు ఈ రెండూ నిజమే అని ఒప్పుకుంటున్నారు. తాజాగా ఏఐ వల్ల మనుషులకు ఏర్పడే నష్టం గురించి బయటపెట్టారు.
స్మార్ట్ ఫోన్లలో ఉండే ఏఐ ద్వారా మనుషుల మధ్య దూరాలు పెరుగుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మనుషులు తమను తాము బయటపెట్టుకునే విధానం, ఇతరుల మెసేజ్‌లను చూసే కోణం లాంటివి మారుతాయని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న టెక్ కంపెనీలు అన్ని ఏఐ వల్ల కలిగే లాభాలను చూసి దానిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సన్నాహాలు చేస్తున్నారు. కానీ దీని వల్ల సామాజికంగా జరిగే నష్టాలు మర్చిపోతున్నారని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ప్రస్తుతం దాదాపు చాలావరకు ఉద్యోగాలలో మనుషుల మధ్య సాన్నిహిత్య సంబంధాలు ఏర్పడాల్సిన అవసరం ఉంటుంది. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఫ్రెండ్లీగా పనిచేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు చాలావరకు ఉద్యోగులు ఏఐను మెసేజ్‌లకు రిప్లైలు ఇవ్వడానికి ఉపయోగిస్తున్నారు. అలాంటి రిప్లైలు ఉద్యోగుల మధ్య స్నేహాన్ని చంపేస్తుందని శాస్త్రవేత్తలు గమనించారు. దీని వల్ల అవతల వ్యక్తి కూడా నిరుత్సాహంగా ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.
ఏఐ ద్వారా ఇచ్చే స్మార్ట్ రిప్లైలు మెసేజ్‌లు తొందరగా పంపడానికి ఉపయోగపడతాయి అన్న కోణంలో మాత్రమే కొందరు ఉద్యోగులు ఆలోచిస్తున్నారు. కానీ దీనివల్ల వారు ఇతర ఉద్యోగులకు దూరమవుతున్నారని మాత్రం ఆలోచించలేకపోతున్నారు. మనం సొంతంగా టైప్ చేసే మెసేజ్‌లకు, ఏఐ నుండి జెనరేట్ అయ్యే మెసేజ్‌లకు చాలా తేడా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని వల్ల మెసేజ్‌లలోని ఒరిజినల్ ఫ్లేవర్ పోతుందని చెప్తున్నారు.
ఒకవేళ అవతల వ్యక్తి ఏఐను ఉపయోగించి రిప్లైలు ఇస్తున్నారన్న అనుమానం వచ్చినా కూడా వారిపై ఒక నెగిటివ్ అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీన్ని బట్టి వారు ఎమోషనల్‌గా ఆలోచించలేకపోతున్నారనే నిర్ధారణకు వచ్చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా మరెన్నో విధాలుగా ఏఐ అనేది మనుషుల మధ్య సంబంధాలను దెబ్బతీస్తోందని శాస్త్రవేత్తలు అన్నారు. అందుకే ఏఐను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడం మాత్రమే మంచిదని వారు సలహా ఇస్తున్నారు.