Vizag : విశాఖ ఉక్కు కర్మాగారంలో డీజీఎం అనుమానాస్పదంగా మృతి చెందిన కేసులో మిస్టరీ వీడలేదు. ప్రొడక్షన్, ప్లానింగ్ అండ్ మానటరింగ్ విభాగంలో పనిచేస్తున్న డీజీఎం అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటనపై స్టీల్‌ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన మరణానికి కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్మాగారంలోని ఈడీ.. పీపీఎం విభాగం కార్యాలయంలో పనిచేస్తున్న డీజీఎం టీవీవీ ప్రసాద్ జనరల్ షిఫ్ట్ విధులకు హాజరై.. కార్యాలయం మూడో అంతస్తులోని తన గదిలోకి వెళ్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను సిబ్బంది తొలుత ప్రథమ చికిత్స కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత అక్కడ నుంచి స్టీల్ ప్లాంట్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ప్రసాద్ వయస్సు 50 ఏళ్లు. 1995లో ఉక్కు కార్మాగారంలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా జాయిన్ అయ్యారు. అంచెలంచెలుగా ఎదిగి.. డీజీఎం స్థాయికి చేరుకున్నారు. స్టీల్ ప్లాంట్ మరో డీజీఎం సహదేవ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆయన మరణంపై మిస్టరీ మాత్రం వీడలేదు.
ఒకవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్రం ప్రయత్నిస్తోంది. కార్మిక ఉద్యోగ సంఘాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. చాలాకాలంగా ఉద్యమం చేస్తున్నాయి. కేంద్రం మాత్రం వెనక్కి తగ్గేదిలేదంటూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందడుగే వేస్తోంది. ఇలాంటి సమయంలో స్టీల్ ప్లాంట్ లో కీలకం విభాగంలో పనిచేసే డీజీఎం అనుమానాస్పదంగా మృతి చెందడంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.