Earthquakes:– సముద్రంలో నీళ్లు అనేవి ఎక్కువ ఇంకిపోవు, ఎండిపోవు. అలాంటివి జరిగినా చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరుగుతాయి. సముద్రం లోతుల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయని నిపుణులు అంటుంటారు. అందుకే దాని లోతులో ఎక్కువగా స్టడీ చేయడం కష్టమని కూడా చెప్తుంటారు. అయితే అలాంటి ఒక మిస్టరీ ఒకటి అమెరికాలోని సముద్రం నుండి బయటపడింది. దాని గురించి చెప్తూ శాస్త్రవేత్తలు ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు.
అమెరికాలోని ఒరెగాన్ అనే స్టేట్‌లోని సముద్రం లోతుల్లో లీక్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే ఒక పెద్ద రంధ్రాన్ని వారు గుర్తించారు. దీని వల్ల ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు రానున్నాయని వారు అంచనా వేస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా దీని వల్ల భారీ భూకంపం పెసిఫిక్ నార్త్‌వెస్ట్‌ను అల్లకల్లోలం చేయనుందని వారు భావిస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతం పలుమార్లు భూకంపం దాటికి గురయ్యిందని, సముద్రం లోతుల్లో బయటపడిన ఈ రంధ్రం కూడా భారీ భూకంపానికి సంకేతాన్ని ఇస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
మామూలుగా సముద్రం లోతుల్లో ఉండే రంధ్రాలను ‘పయాథియాస్ ఒయాసిస్’ అంటారు. సముద్రంలోని నీరు చాలా స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఇలాంటి ఏర్పడతాయని శాస్త్రవేత్తలు అనుమానించినా.. అసలు ఇవి ఎందుకు ఏర్పడతాయి అని చెప్పడానికి ప్రత్యేకమైన ఆధారాలు ఏమీ లేవు. సముద్రం లోతుల్లో ఏర్పడిన ఇలాంటి రంధ్రాలపైన చమురు లాగా ఏర్పడుతుంది. ఆ చమురు అనేది పోయిన తర్వాత జరిగే ప్రమాదం గురించి ఎవరూ అంచనా వేయలేరని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఇదివరకు సముద్ర రంధ్రాల్లో నుండి నీటి బుడగలు రావడం శాస్త్రవేత్తలు గమనించారు. ఈ బుడగలు ఎందుకు వస్తున్నాయో కనుక్కోవడం కోసం వారు ఒక రోబోను నీటిలోకి పంపించారు. సముద్రంలోని వేడి వల్ల మాత్రమే అవి ఏర్పడుతున్నాయని నిర్ధారణకు వచ్చారు. వారు చూసినవి మిథేన్ బుడగలే అయినా కూడా చాలా ఎక్కువ మోతాదులో అవి బయటికి రావడాన్ని గమనించారు. అయితే ఇలాంటివి వారు ముందెన్నడూ చూడలేదని, వారికి తెలిసినంత వరకు ఇలాంటిది ఎప్పుడూ జరగలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
సముద్రం లోతుల్లోని రంధ్రం నుండి వచ్చే నీరు వెచ్చగా ఉందని శాస్త్రవేత్తలు గమనించారు. ఇది నేరుగా సముద్రంలోని భూభాగం నుండి వస్తున్నట్టుగా వారు అంచనా వేస్తున్నారు. దీనికి, భూకంపాలకు సంబంధం ఏంటంటే.. సముద్రంలో ఉండే ప్రెజర్ ఎప్పటికప్పుడు బయటికి విడుదల అవ్వాలి. అలా జరగనప్పుడు ఆ ప్రెజర్ అంతా ఒకేసారి బయటికి అనుకోకుండా వచ్చేస్తుంది. ఈ రంధ్రం వల్ల సముద్రంలో ప్రెజర్ ఎక్కువవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకే భూకంపం వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.