EPAPER
Kirrak Couples Episode 1

BRS: కేసీఆర్‌కు కిరికిరి!.. ఎన్నికల ముందు ఏంటిది?

BRS: కేసీఆర్‌కు కిరికిరి!.. ఎన్నికల ముందు ఏంటిది?
kcr

BRS: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. చాలా నియోజకవర్గాల్లో వర్గపోరు బీఆర్ఎస్‌ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మరి వీటిని ఎలా చక్కదిద్దుతారు? 18 మంది ఎమ్మెల్సీలకు.. వేరే జిల్లాల ఇంచార్జ్ లుగా నియమించడానికి కారణమేంటి? బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది? అంతర్గత కలహాలకు చెక్ ఎలా?


నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు జరుపుతూ.. త్వరలోనే ప్లీనరీ కూడా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమాలను మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చూసుకునేందుకు జిల్లాల వారీగా ఇంఛార్జ్ లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. అయితే ఎమ్మెల్సీలకు, సీనియర్లకు పూర్తి బాధ్యతలు అప్పగించడం.. నేతల్లో కొత్త సందేహాలకు, చర్చకు తెరతీసింది.

పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం మొత్తం 18 మంది ఎమ్మెల్సీలకు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. వీరిలో చాలా మంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి పావులు కదుపుతున్నారు. స్టేషన్​ ఘన్‌పూర్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిల మధ్య వార్​ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టికెట్​ తమదంటే తమదని చెప్పుకుంటున్నారు. రాజయ్య, కడియం శ్రీహరిలు పరోక్షంగా ఒకరిపై ఒకరు నిత్యం మాటల తూటాలు పేల్చుకుంటూనే ఉన్నారు. పార్టీ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయాయి. ఒకరిని ఒకరు పలుకరించుకోలేని స్థాయిలో వైరం పెరిగింది. ఈ సారి కడియం శ్రీహరికి టికెట్​ రాకపోతే ఎంతటి నిర్ణయానికైనా వెనుకాడేది లేదని ఆయన అనుచరులు బాహాటంగానే చెబుతున్నారు. ఇదే సమయంలో కడియంని నల్లగొండ జిల్లా పార్టీ కార్యక్రమాల ఇంచార్జ్ గా నియమించడం..చర్చనీయాంశంగా మారింది.


జనగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిది ఏకఛత్రాధిపత్యం నడుస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో మాజీ టీపీసీసీ చీఫ్​ పొన్నాల లక్ష్మయ్య పై ఈజీగా గెలుపొందిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వచ్చే ఎన్నికల్లోనూ టికెట్​ తనకే వస్తుందని, తానే గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. కాని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​ రెడ్డి ఈ స్థానంపై టికెట్ తనకే వస్తుందన గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కాని పోచంపల్లి శ్రీనివాస్​ రెడ్డిని వికారాబాద్ ఇంచార్జ్ గా నియమించింది బీఆర్ఎస్ అధిష్టానం.

వరంగల్ తూర్పు నియోజకవర్గంపై కన్నేశారు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే నరేందర్ గట్టి లీడర్. కేటీఆర్ ఆశీస్సులు పుష్కలం. దీంతో.. సారయ్యను కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంఛార్జ్ గా నియమించారు.

ఇక, ఎమ్మెల్సీ ఎల్ రమణ. టీడీపీ గూటి నుంచి గులాబీ శిబిరంలో చేరిన వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఈసారి ఎల్.రమణ జగిత్యాల టికెట్ రేసులో ఉన్నారు. గతంలో ఇక్కడ గెలిచిన అనుభవం ఉంది. కాని సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇప్పటికే రెండు సార్లు గెలిచారు. దీంతో ఎల్.రమణను రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ గా నియమించింది బీఆర్ఎస్ అధిష్టానం.

పెద్దపల్లి నియోజకవర్గంలోనూ అధిపత్య పోరు నడుస్తోంది. ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ మధ్య విభేదాలు ఉన్నాయ్. ఈసారి టికెట్ పక్కగా తనకే వస్తుందనే యోచనలో ఉన్నారు భాను ప్రసాదరావు. అయితే ఆయనను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంఛార్జ్ గా నియమించారు.

కల్వకుర్తి నియోజకవర్గంలోనూ సేమ్ సీన్. కసిరెడ్డి నారాయణ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మధ్య వార్ నడుస్తోంది. ఈ సారి టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు నారాయణరెడ్డి. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ ఉండటంతో… నారాయణరెడ్డిని మహబూబ్ నగర్,నారాయణ పేట జిల్లాల ఇంచార్జ్‌గా నియమించింది బీఆర్ఎస్ అధిష్టానం.

వికారాబాద్ జిల్లా తాండూరులో వర్గపోరు అంతా ఇంత కాదు. ఎప్పటి నుంచో పట్నం మహేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి ఉప్పునిప్పుగా ఉన్నారు. ఎన్నికల తర్వాత రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరడంతో మహేందర్ రెడ్డికి నియోజకవర్గంలో ప్రాధాన్యత తగ్గింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుఫున పోటీ చేసిన మహేందర్ రెడ్డి ఈసారి కూడా టికెట్ ఆశిస్తున్నారు. కాని బీఆరెఎస్ అధిష్టానం ఆయనను.. నాగర్ కర్నూల్ జిల్లా ఇంఛార్జ్‌గా నియమించింది.

నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం బీఆర్ఎస్ లో విభేదాలు ఉన్నాయ్. టికెట్ కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఈసారి టికెట్ ఆశిస్తున్నారు. కాని ఇప్పటికే అక్కడ సీనియర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని పోటీ చేయించాలని బాజిరెడ్డి గోవర్ధన్ భావిస్తున్నారు.

నాగార్జున సాగర్ లో బీఆర్ఎస్ నుంచి టికెట్ కోసం ఇద్దరు నేతలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ట్టింగ్ ఎమ్మెల్యేగా నోముల భగత్ కొనసాగుతున్నారు. తండ్రి చనిపోవడంతో… ఉప ఎన్నికల్లో గెలిచారు. ఉప ఎన్నికల్లోనే కోటిరెడ్డి టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించారు. కాని సెంటిమెంట్ దృష్టిలో పెట్టుకుని నోముల భగత్ కు టికెట్ ఇచ్చారు కేసీఆర్. కాని వచ్చే ఎన్నికల్లో తనదే టికెట్ అంటున్నారు కోటిరెడ్డి. దీంతో ఆయన్ని జనగామ జిల్లా ఇంఛార్జ్ గా నియమించింది బీఆర్ఎస్.

పెద్దపల్లి జిల్లా ఇంఛార్జ్‌గా ఉన్న ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి లేదా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్ ఇంఛార్జ్ గా ఉన్న దాసోజు శ్రవణ్ వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ లేదా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఖమ్మం జిల్లా ఇంచార్జ్‌గా ఉన్న ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నారు. మరోవైపు మెదక్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుమారుడు మైనంపల్లి రోహిత్ పావులు కదుపుతున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం వున్నప్పటికి కేవలం రాష్ట్ర కమిటీకి మాత్రమే పరిమితం అయింది. తాజాగా బిఆర్ఎస్ విద్యార్థి విభాగం అసెంబ్లీ నియోజకవర్గ కమిటీలు, జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం కమిటీలను నియమించడం ద్వారా వారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఉపయోగపడతారని బిఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు నియామకం కాని అనుబంధ కమిటీలపై ఫోకస్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి టిక్కెట్ ఖాయమనే సంకేతాలు అధిష్టానం ఇవ్వడంతో గత ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన BRS విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టి అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేశారు.

18 మంది ఎమ్మెల్సీలకు ఎందుకు జిల్లా ఇంచార్జ్‌ పదవులు ఇచ్చారన్నది చర్చనీయాంశంగా మారింది. అసంతృప్తిని చల్లబరించేందుకే ఇలా చేశారా? ఒకవేళ పరాయి జిల్లాలో తమకు అప్పగించిన కార్యక్రమాలను సక్సెస్‌ఫుల్‌గా చేస్తే.. టికెట్ ఇచ్చే యోచనలో ఉన్నారా? ఇప్పటికి ఇవి ప్రశ్నలే. వచ్చే ఎన్నికల్లో దాదాపు సిట్టింగ్‌లకే టికెట్లిస్తామని.. బీఆర్‌ఎస్‌ అధిష్టానం స్పష్టం చేసింది. కాని కొందరికి టికెట్లు దక్కకపోవచ్చని ఆ పార్టీ సీనియర్ నేత బి.వినోద్ చెప్పడాన్ని కేడర్ గుర్తుచేస్తోంది.

మరోవైపు పార్టీ కార్యక్రమాల కోసం ఇంఛార్జ్ బాధ్యతలు ఇవ్వవడంతో 18 మంది ఎమ్మెల్సీలకు అగ్ని పరీక్షగా మారింది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కీలక బాధ్యతలు అప్పగించడంతో ఆ బాధ్యతలు సరిగా నిర్వహించకపోతే అధినేత ఆగ్రహానికి గురికాక తప్పదా అన్న ఆందోళన పలువురు సీనియర్ల లో నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పెద్ద టాస్క్ గానే భావిస్తున్నారనే చర్చ బీఆర్‌ఎస్‌లో జరుగుతోంది. మరో వైపు వీరిని ఈ బాధ్యతలకు మాత్రమే పరిమితం చేసి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకపోవచ్చు అనే చర్చ సైతం గులాబీ శిబిరంలో జరుగుతోంది.

Related News

Real Estate Fraud: బూదాటి పాపం పండింది..! లెక్కలతో సహా ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్

Venkat Reddy: ఆ ప్యాలెస్ లోపెద్ద తిమింగలమే ఉంది

YS Jagan: జగన్‌ను లైట్ తీసుకున్న.. కొడాలి నానీ, వంశీ

Black Units Into Action: రంగంలోకి బ్లాక్ యూనిట్.. వణికిపోతున్న ఇజ్రాయెల్

Israel vs Hezbollah War: హిజ్బుల్లా డేంజరస్ ఆపరేషన్‌ ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటి?

Kolikapudi Srinivasa Rao: ఇవేం పనులు.. పార్టీ నుండి కొలికపూడి సస్పెండ్..?

Balineni vs YV Subba Reddy: బావ.. నీ బండారం బయట పెడతా.. వైవీకి బాలినేని వార్నింగ్

Big Stories

×