Hospital (Telangana News): నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకి.. అనేది పాత మాట. ఇప్పుడు ఆసుపత్రులన్నీ మార్చేస్తాం.. మంచి వైద్యం, వసతులు కల్పించాం అనేది సర్కారు మాట. మరి, నిజమేనా? నిజంగానే తెలంగాణలో ప్రభుత్వాసుపత్రుల తలరాత మారిందా? అంటే డౌటే. అప్పుడప్పుడు, అక్కడక్కడ జరిగే కొన్ని దారుణ ఘటనలు మళ్లీ సరకారు దవాఖానాలంటేనే భయం గొలిపేలా ఉంటున్నాయి. తాజాగా, నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో అలాంటి ఘటనే జరిగింది.
నిజామాబాద్ ఆసుపత్రిలో ఓ రోగిని నేలపై ఊడ్చుకుంటూ వెళ్తున్నారు అతని తల్లిదండ్రులు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను, మెయిన్ మీడియాను షేక్ చేస్తోంది. స్ట్రెచ్చర్/ వీల్‌ఛైర్ లేకపోవడంతో ఆ రోగిని కాళ్లుపట్టుకుని ఈడ్చుకెళ్లారని అంటున్నారు. వీడియోలో ఆ దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. మార్చి 31న జరిగిన ఈ ఘటన.. లేటెస్ట్‌గా వైరల్ అవుతోంది. సర్కారు నిర్లక్ష్యం, ప్రభుత్వాసుపత్రుల్లో దారుణ పరిస్థితులపై అంతా భగ్గుమంటున్నారు.
అయితే, హాస్పిటల్ సూపరింటెండెంట్ వాదన మరోలా ఉంది. సిబ్బంది వీల్‌ఛైర్ తెచ్చేలోగా.. లిఫ్ట్ వచ్చిందని వాళ్లే హడావుడిగా అలా లాక్కువెళ్లారని చెబుతున్నారు. పేషెంట్ రెండో అంతస్తుకు వెళ్లాక అతడిని వీల్‌ఛైర్‌లోనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారని.. తిరిగి వీల్‌ఛైర్‌లోనే సిబ్బంది ఆ పేషెంట్‌ను కిందకు తీసుకొచ్చారని చెబుతున్నారు. ఆస్పత్రిపై దుష్ప్రచారాలు చేసే వారిపై చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు ఆ సూపరింటెండెంట్.
మరోవైపు, ఇలా మీడియాలో ఈ న్యూస్ వచ్చిందో లేదో.. అలా వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల ట్వీటర్‌లో స్పందించారు. కనీసం స్టెచ్చర్ కూడా లేని దౌర్భాగ్యపు ఆసుపత్రులు ఉన్నాయంటూ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు.
ఎవరి వాదన ఎలా ఉన్నా.. అసలేం జరిగిందనేది హాస్పిటల్ సీసీకెమెరా ఫూటేజ్ బయటపెడితే కానీ తెలీదు. అందాక ఎవరి గోల వారిదే.