Weather Report: తెలుగు రాష్ట్రాల్లో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ ప్రాంతంలో ఎండలు బెంబేలెత్తిస్తుంటే..మరో ఏరియాలో మాత్రం వానలు పడుతున్నాయి. నిన్నటి వరకు ఏపీ, తెలంగాణలో ఎండలు కాకపుట్టించాయి. రికార్డు స్థాయిలో 41డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఎండల దాటికి ప్రజలు అల్లాడిపోయారు. భయటికి రావాలంటేనే భయపడిపోయారు.
ఐతే శుక్రవారం ఒక్కసారిగా తెలంగాణలో వాతావరణంలో మార్పు కనిపించింది. గురువారం రాత్రి మెదక్ జిల్లాలో రాళ్లవాన పడింది. శుక్రవారం తెల్లవారు జూము నుంచే హైద్రాబాద్‌లో పలు చోట్ల వానలు పడ్డాయి. నిన్నటి వరకు నిప్పులు చిమ్మిన ఆకాశం.. ఒక్కసారిగా మేఘావృతం అయింది. ఎండ వేడిమికి అల్లాడిన నగర వాసులకు వాన చినుకులతో కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం పడుతుందని చెప్పారు. ఈ నెల 16వ తేదీ వరకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు.
తెలంగాణలో ఇలా ఉంటే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. నిప్పుల కుంపటిలా మారిన ఎండతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఉక్కపోత చంపేస్తుంది. శుక్రవారం 7 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 168 మండలాల్లో వడగాల్పులు ఉన్నాయి. శనివారం 106 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.