Parkinson’s disease : కొన్ని మానసిక వ్యాధులను గుర్తించడానికి, వాటికి చికిత్సను అందించడానికి అభివృద్ధి చెందిన టెక్నాలజీ సైతం ఏ మాత్రం సాయం చేయలేకపోతోంది. ప్రస్తుతం సమాధానం లేని ఎన్నో వ్యాధులు మనిషి మెదడుకు సంబంధించనవే. అందులో ఒకటి పార్కిన్సన్స్. అయితే పార్కిన్సన్స్ అనేది ఇప్పటివరకు ఎక్కువగా వృద్ధులలోనే కనిపించేది. కానీ పలు కారణాల వల్ల అది యువతను కూడా అటాక్ చేస్తుందని, ఆ కారణాలు ఏంటో శాస్త్రవేత్తలు బయటపెట్టారు.
వయసు పైబడుతున్నకొద్దీ మనుషుల్లో కొన్ని మానసిక వ్యాధులు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో పార్కిన్సన్స్ ఒకటి. ఇప్పటివరకు ఇది ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన వారిలోనే కనిపించింది. కానీ ఇది యువతను కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ముఖ్యంగా వారి పరిసరాలను బట్టి ఇది అటాక్ అవుతుందని వారు తెలిపారు. వరల్డ్ పార్కిన్సన్స్ డే కారణంగా ఈ వ్యాధి గురించి శాస్త్రవేత్తలు మరికొన్ని విషయాలు బయటపెట్టారు.
పార్కిన్సన్స్ అనేది ఒక న్యూరోజెనరేటివ్ వ్యాధి. ఇది మెల్లగా మనిషి జీవితాన్నే మార్చేస్తుంది. 50 ఏళ్ల లోపు ఉన్నవారిలో పార్కిన్సన్స్ సమస్య కనిపిస్తే దానిని యంగ్ ఆన్‌సెట్ పార్కిన్సన్స్ డిసీస్ అని అంటారు. 50 ఏళ్ల పైబడిన వారిలో కంటే అంతకంటే తక్కువ వయసు ఉన్నవారిలో ఈ సమస్యను వెంటనే కనుక్కోవడం కష్టమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతే కాకుండా ఈ వ్యాధి బయటపడేలోపే వారి మానసిక స్థితిపై ప్రభావం చూపించడం కూడా మొదలవుతుందని అన్నారు.
ఇప్పటివరకు అసలు పార్కిన్సన్స్ అనేది ఎందుకు వస్తుందో చెప్పే సరైన ఆధారాలు లేవు. కానీ అది ఒక్క కారణం వల్ల రాదని, పలు సమస్యల కలిస్తేనే పార్కిన్సన్స్ వ్యాధికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో జీన్స్ ముఖ్య ప్రాత పోషిస్తాయని చెప్తున్నారు. కానీ యువత మాత్రం వారి పరిసరాలు గురించి, వారు జీవించే పర్యావరణం గురించి జాగ్రత్తలు వహించాలని, అవి కూడా పార్కిన్సన్స్‌కు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు.
గాలి కాలుష్యానికి తిరగడం కూడా పార్కిన్సన్స్‌కు దారితీసే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది తెలియకుండానే మెదడులో ఒత్తిడికి కారణమవుతుందని తెలిపారు. మెదడుకు ఒత్తిడి కలగడం వల్ల అది న్యూరాన్స్‌ను దెబ్బతీస్తుందని, ఆపై పార్కిన్సన్స్‌కు దారితీసే అవకాశం ఉందని అన్నారు. అంతే కాకుండా ఎరువుల వాతావరణంలో ఉండడం కూడా ప్రమాదకరమే అని చెప్తున్నారు. పార్కిన్సన్స్‌ను ముందే కనిపెట్టడానికి సరైన టెస్టులు, దీనిని నయం చేయడానికి సరైన చికిత్స లేకపోవడం వల్ల ఇది రాకముందే జాగ్రత్తపడాలని శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు.