Chandrababu: “ఇల్లు మీది.. స్టిక్కర్ సైకోది.. మీ ఇంటిపై ఆయన పెత్తనమేంది? జగన్ సమాజానికి క్యాన్సర్ లాంటివాడు. జగన్ మీ బిడ్డ కాదు.. క్యాన్సర్ గడ్డ. ఇచ్చేది పది.. గుంజేది వంద. జగనే నమ్మకం కాదు.. జగనే రాష్ట్రానికి దరిద్రం. బెదిరిస్తే తోకలు కట్ చేస్తా. రౌడీయిజాన్ని తుంగలో తొక్కేస్తాం”.. ఇలా పంచ్ డైలాగులతో పవర్‌ఫుల్‌గా సాగింది టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం. విజయవాడ తూర్పు, పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల మీదుగా చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఏపీలో సైకో పాలనకు ప్రజలు చరమగీతం పాడకపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని.. జగన్ పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు.
ఇంటి యజమాని అనుమతి లేకుండానే ఇంటింటికీ స్టిక్కర్లు అతికించడం ఏంటని నిలదీశారు. ఇల్లు మీది.. స్టిక్కర్ సైకోది.. మీ ఇంటిపై ఆయన పెత్తనమేంది? అని ప్రశ్నించారు. ఏ పార్టీ అయినా ఇంటిపై పోస్టర్లు, స్టిక్కర్లు వేయాలంటే ఆ ఇంటి యజమాని అనుమతి తీసుకోవడం తప్పనిసరి అన్నారు. జగన్ చేస్తున్న పని అనైతికం, చట్టవ్యతిరేకమన్నారు చంద్రబాబు.
జగన్ మీ బిడ్డ కాదు.. క్యాన్సర్ గడ్డ. జగన్ సమాజానికి క్యాన్సర్ లాంటివాడు. క్యాన్సర్ గడ్డను తొలగించుకోకపోతే శరీరమంతా వ్యాపిస్తుంది.. అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. ఐదేళ్లుగా జగన్ చేసిన మంచి పని ఏంటని ప్రశ్నించారు. ధరలు పెరిగాయి.. కరెంటు ఛార్జీలు పెంచారు.. ఓ చేతికి పది ఇచ్చి.. మరో చేతి నుంచి వంద గుంజుతున్నారంటూ ఆరోపించారు. జగన్ చెబుతున్నట్టు ప్రజలకు ఆయనేమీ నమ్మకం కాదని.. రాష్ట్రానికి పట్టిన దరిద్రమంటూ మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు.