BRS BJP: నిజామాబాద్ జిల్లాలో ఫ్లెక్సీల యుద్ధం జరుగుతోంది. పసుపు బోర్డు.. ఎన్నికల హామీల విషయంలో ఇరువర్గాలు పోటా పోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పిన పసుపు బోర్డు ఏమైందంటూ.. రైతుల పేరిట పసుపు రంగులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. నిజామాబాద్‌తో పాటు డిచ్‌పల్లిలో అర్ధరాత్రి ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
పసుపు బోర్డు ఏర్పాటుపై పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్ ఎంపీలు.. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రిని అడిగిన ప్రశ్నలకు ఆ శాఖ సహాయ మంత్రి అనుప్రియపాటిల్ ఈ నెల 29న సమాధానం ఇచ్చారు. నిజామాబాద్‌లో ఎలాంటి పసుపు బోర్డు ఏర్పాటు ప్రతిపాదనలేదని ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన తర్వాత ఈ పోస్టర్లు, బోర్డులు వెలువడంతో జిల్లా వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు అని ఫ్లెక్సీలో ఒకే ఒక క్యాప్షన్ పెట్టి ఉండడం అన్ని పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇది జరిగిన మరుసటి రోజే పోటీకి మరో వర్గం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ఫ్లెక్సీల్లో ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, రెండు పడక గదుల ఇళ్లు, ఉచిత ఎరువులకు సంంబధించి వ్యంగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌తో పాటు నిజామాబాద్ నగరంలో పసుపు రంగు ఫ్లెక్సీలు పెట్టిన ప్రతి చోటా ఈరోజు పోటాపోటీ ఫ్లెక్సీలు ఉంచారు.
ఫ్లెక్సీల ఏర్పాటుపై ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి సమాధానాన్ని బీఆర్‌ఎస్ ఎంపీలు సరిగా అర్థం చేసుకోలేదన్నారు. స్పైస్ బోర్డు ఒక్కో పంటకు ఏర్పాటు చేయడంలేదని అన్ని పంటలకు కలిపి పనిచేస్తుందని తెలిపారు. బీఆర్‌ఎస్ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి, ఎన్‌ఆర్‌ఐ సెల్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రైతు రుణమాఫీ ఏమైందని ఎంపీ అర్వింద్ ప్రశ్నించారు.