IPL-2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 16వ సీజన్.. ఆరంభ మ్యాచ్‌లోనే గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 50 బంతుల్లో 92 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లంతా అంతంత మాత్రంగానే ఆడారు.
ఇక గుజరాత్ టైటాన్స్ 179 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో ఛేధించింది. 5 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ మరోసారి అదరగొట్టాడు. 36 బంతుల్లో 63 పరుగులతో రాణించాడు. వృద్ధిమాన్ సాహో 16, విజయ్ శంకర్ 21, సాయి సుదర్శన్ 22 పరుగులు చేశారు. మ్యాన్ ఆఫ్ ధి మ్యాచ్ అవార్డ్‌ను రషీద్ దక్కించుకున్నాడు.
ఇక మ్యాచ్‌కు ముందు ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో ప్రముఖ హీరోయిన్లు రష్మిక మందన్న(Rashmika Mandanna), తమన్నా(Tamannaah)లు ఫుల్ హంగామా చేశారు. లేటెస్ట్ సాంగ్స్‌కు డ్యాన్సులతో స్టేడియాన్ని హోరెత్తించారు. ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు.
పుష్పతో పాన్ ఇండియా వైజ్ క్రేజ్ సంపాదించిన రష్మిక.. ఆ సినిమాలోని ‘సామీ సామీ’, ‘శ్రీవల్లి’ తదితర పాటలకు డ్యాన్స్ చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకూ హుషారైన స్టెప్పులేసి జోష్ నింపారు.
రష్మికతో పాటు ఎనర్జిటిక్ డ్యాన్సర్, హీరోయిన్ తమన్నా సైతం డ్యాన్స్‌తో అదరగొట్టారు. ‘పుష్ప’లోని ‘ఊ.. అంటావా మావా.. ఊ ఊ.. అంటావా’ ఐటమ్ సాంగ్‌కు తమన్నా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. హిందీ మూవీ ‘ఎనిమీ’లోని ‘టమ్ టమ్’ పాటకు తమన్నా స్టెప్పులు అదుర్స్.
రష్మిక, తమన్నాల డ్యాన్సులతో పాటు సింగర్ అర్జిత్‌సింగ్ తన పాటలతో ఆడియన్స్‌ను అలరించారు. అలా, మోదీ స్టేడియంలో ఐపీఎల్ 2023 అట్టహాసంగా ప్రారంభమైంది. అసలు సిసలు క్రికెట్ మజా స్టార్ట్ అయిపోయింది.