EPAPER

Das ka Dhamki: ‘దాస్ కా ధమ్కీ’ రివ్యూ.. మాస్ హిట్టా? ఫట్టా?

Das ka Dhamki: ‘దాస్ కా ధమ్కీ’ రివ్యూ.. మాస్ హిట్టా? ఫట్టా?
Das ka Dhamki review

Das ka Dhamki: ‘ఫలక్‌నుమా దాస్’తో నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ గుర్తింపు తెచ్చుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకునేందుకు ‘దాస్ కా ధమ్కీ’తో ఉగాది కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశ్వక్ సేన్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాను ఆయన తండ్రి కరాటే రాజు నిర్మించారు. ‘పాగల్’ తర్వాత విశ్వక్ సేన్‌తో నివేదా పేతురాజ్ జోడీ కట్టింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనడంతో మంచి హైప్ క్రియేట్ అయింది. ప్రమోషన్స్‌తో భారీ అంచనాలు అందుకుంది.


నటీనటులు : విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, తరుణ్ భాస్కర్, అక్షరా గౌడ, ‘హైపర్’ ఆది, ‘రంగస్థలం’ మహేష్, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు
కథ : ప్రసన్నకుమార్ బెజవాడ
ఛాయాగ్రహణం : దినేష్ కె బాబు
సంగీతం : లియోన్ జేమ్స్
నిర్మాత : కరాటే రాజు
స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : విశ్వక్ సేన్
విడుదల తేదీ: మార్చి 22, 2022

కథ: కృష్ణదాస్ (విశ్వక్ సేన్) ఓ అనాథ. అనాథ ఆశ్రమంలో తన స్నేహితులైన ఆది(హైపర్ ఆది), మహేశ్(రంగస్థలం మహేశ్)తో కలిసి ఓ స్టార్ హోటల్‌లో వెయిటర్‌గా పని చేస్తుంటాడు. ఒక రోజు హోటల్‌కు వచ్చిన కీర్తి(నివేదా పేతురాజ్)తో ప్రేమలో పడతాడు. వెయిటర్ అనే విషయం దాచి ఆమెను తన ప్రేమలో పడేస్తాడు. ఆమెతో తానొక పెద్ద ఫార్మా కంపెనీకి సీఈవో అని చెబుతాడు. ఓ రోజు కృష్ణదాస్ వెయిటర్ అనే నిజం కీర్తికి తెలుస్తుంది. అప్పటి వరకు ఆమె కోసం చేసిన పనుల కారణంగా ఉద్యోగం పోతుంది. మరో వైపు అద్దె కట్టకపోవడంతో ఇంట్లో నుంచి కూడా గెంటేస్తే.. రోడ్డు మీదకు వస్తున్న సమయంలో సిద్ధార్థ్ మల్హోత్రా (రావు రమేష్) వస్తాడు. తన అన్నయ్య కుమారుడు సంజయ్ రుద్ర (విశ్వక్ సేన్) క్యాన్సర్ చికిత్సకు ఓ డ్రగ్ కనిపెట్టాడని, రీసెర్చ్ మధ్యలో చనిపోయాడని చెబుతాడు. అతడిలా నటించమని చెబుతాడు. సంజయ్ రుద్ర ఇంటికి వెళ్లిన కృష్ణదాస్ షాక్ అవుతాడు. ఎందుకంటే… ఆ సంజయ్ రుద్ర ఎవరో కాదు, ఫార్మా కంపెనీ సీఈవో! అతడి స్థానంలోకి కృష్ణదాస్ వెళ్లిన తర్వాత ఏమైంది? కథ ఎన్ని మలుపులు తిరిగింది? అందరికీ ధమ్కీ ఇచ్చే దాస్‌కే ఊహించని ధమ్కీ ఇచ్చిందెవరు? అతను వాటిని ఎలా తిప్పి కొట్టాడు? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ:
విశ్వక్ సేన్ తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తూ, తనే నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమా కథ పరంగా కొత్తగా లేకపోవడం నిరాశ పరిచే అంశం. స్టార్ హోటల్ వెయిటర్‌ను గుడ్డిగా నమ్మి చదువుకున్న అమ్మాయి ప్రేమించడం ఏమిటో అర్థం కాదు. ఫస్టాఫ్‌లో వచ్చే లవ్ ట్రాక్ సిల్లీగా అనిపిస్తూ చికాకు తెప్పిస్తుంది. అయితే హైపర్ ఆది, రంగస్థలం మహేశ్ కొంత నవ్వించే ప్రయత్నం చేయడంతో ఫస్టాఫ్ అంతా సోసోగా సాగుతుంది. రూమ్ రెంట్ కట్టమని ఓనర్ వస్తే, అతడికి హైపర్ ఆది మెసేజ్ పెడతాడు. ‘హాయ్! మీరు ఎలా ఉన్నారు? మీ రెంట్ ఎనిమిది వేలు వచ్చాయి’ అని! నిజంగా బ్యాంక్ అకౌంటులో డబ్బులు పడ్డాయని ఓనర్ వెళ్ళిపోతాడు. బ్యాంకు మెసేజ్‌కు, పర్సనల్ నంబర్ నుంచి వచ్చిన మెసేజ్‌కు తేడా తెలియని వ్యక్తులు ఈ రోజుల్లో ఉన్నారా? అనిపిస్తుంది. లాజిక్కులు చూడకుండా సినిమా చూస్తే అలాంటి సీన్లకు కూడా నవ్వుకోవచ్చు. ఇక సెకెండాఫ్‌లో అసలు కథ ప్రారంభమవుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆడియెన్స్‌కు కిక్ ఇచ్చేలా ఉంది. దాంతో అసలు కథ ఇప్పుడే మొదలు కాబోతోందనే భావన కలుగుతుంది. అక్కడ నుండి సినిమా మరో లెవల్‌కు వెళ్ళింది. ముఖ్యంగా విశ్వక్ సేన్‌కు సంబంధించిన రెండు పాత్రలు తెర మీద ఢీ అంటే ఢీ అంటూ తలపడే సన్నివేశాలు ఆసక్తిరేకెత్తించాయి. ఫస్టాఫ్‌కు భిన్నంగా సెకెండాఫ్ జోరుగా సాగిపోతుంది. ఎత్తుకు పైఎత్తులు వేసి కృష్ణదాస్ విజయం సాధించాక.. కథ ముగిసిందని అనుకునే సమయంలో మరో ట్విస్ట్‌తో ‘ధమ్కీ -2’కు లీడ్ ఇస్తూ సినిమాను ముగించారు.

నటీనటుల విశ్లేషణ:
కృష్ణదాస్, సంజయ్‌ రుద్ర పాత్రల మధ్య వైవిధ్యాన్ని విశ్వక్‌సేన్‌ చక్కగా చూపించాడు. పాజిటివ్ పాత్రలే కాదు… నెగెటివ్ పాత్రలూ చేసి మెప్పించగలనని నిరూపించుకున్నాడు. ఈ సినిమాతో విశ్వక్ సేన్ నటుడిగా మరింత పరిపక్వత సాధించినట్లు కనిపిస్తాడు. ఈ సినిమాలో విశ్వక్ వన్ మ్యాన్ షో చూపించాడు. ఇక నివేదా పేతురాజ్ నటన కంటే అందంగా కనిపించడానికే ఎక్కువ ఆసక్తి చూపించింది. రావు రమేష్‌ది చాలా సాదాసీదా పాత్ర. ఆయనలోని నటుడికి పని చెప్పేది కాదు. ఇక హైపర్‌ ఆది, మహేష్‌ కనిపించినంత సేపూ నవ్వించే ప్రయత్నం చేశారు. అందులో కొన్ని ఎపిసోడ్లు పేలగా.. మరికొన్ని తుస్సుమన్నాయి. ముఖ్యంగా ‘హ్యాపీడేస్‌’లోని టైసన్‌ పాత్ర తరహాలో మహేష్‌ చెప్పిన డైలాగ్‌లు, తరుణ్‌ భాస్కర్‌తో ఆయన ఆడుకునే ఎపిసోడ్‌ నవ్వులు పూయించాయి. అజయ్, అక్షరా గౌడ, పృథ్వీరాజ్, రజత… తదితరులకు పెద్దగా నటించే అవకాశం లభించలేదు. వాళ్ళవి రెగ్యులర్ రోల్స్. డైలాగులు పెద్దగా లేకపోయినా తల్లి పాత్రలో రోహిణి ఆకట్టుకున్నారు. నార్త్ బ్యూటీ ప్రణతి రాయ్ ప్రకాశ్ తొలిసారి తెలుగు సినిమాలో ఐటమ్ సాంగ్‌లో మెరిసింది.

సాంకేతిక విశ్లేషణ:
నటుడిగా మంచి మార్కులు అందుకున్న విశ్వక్ సేన్.. దర్శకుడిగా తడబడినట్లు కనిపించింది. ఓపక్క ద్విపాత్రాభినయం చేస్తూ, మరోపక్క నిర్మాణ వ్యవహారాలను చూస్తూ.. ఇంకోవైపు దర్శతక్వం చేయడం సామాన్యమైన విషయం కాదు. నిజంగా విశ్వక్ కాన్ఫిడెన్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అయితే ప్రీరిలీజ్ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్లు విశ్వక్ సేన్ డైరెక్షన్‌ను పక్కన పెట్టి, పూర్తిగా నటనపై దృష్టిని కేంద్రీకరిస్తే అతనిలోని విలక్షణ నటుడు బయట పడే అవకాశం ఉంది. లియోన్ జేమ్స్ సంగీతం, దినేష్ సినిమాటోగ్రఫీ మూవీకి ప్రధాన బలం అని చెప్పొచ్చు. ఇలాంటి కథకు వేరే నిర్మాత అయితే ఏ మాత్రం న్యాయం చేకూర్చలేడు. కొడుకు విశ్వక్ సేన్ కోసం కరాటే రాజు రిస్క్ తీసుకున్నారనే చెప్పాలి. దీన్ని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేశారు కాబట్టి.. కమర్షియల్‌గా సక్సెస్ అవ్వొచ్చు.

ప్రేక్షకులకు ‘ధమ్కీ’ ఇచ్చిన విశ్వక్ సేన్

రేటింగ్: 2.25/5

-బిల్లా గంగాధర్

Related News

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Big Stories

×