EPAPER

Rangamarthanda : ‘రంగమార్తాండ’ మూవీ రివ్యూ..!

Rangamarthanda : ‘రంగమార్తాండ’ మూవీ రివ్యూ..!

Rangamarthanda : టాలీవుడ్ డైరెక్టర్లలో క్రియేటివ్‌ జీనియస్‌గా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా ‘నక్షత్రం’(2017) బాక్సాఫీస్‌ వద్ద పరాజయం పాలైంది. కృష్ణ‌వంశీ అన‌గానే ‘గులాబి’,‘నిన్నే పెళ్లాడ‌తా’ వంటి విజయవంతమైన సినిమాలు గుర్తొస్తాయి.సింధూరం, అంతఃపురం, ఖ‌డ్గం త‌దిత‌ర చిత్రాలతో క్లాసిక్ సినిమాల ద‌ర్శ‌కుడిగా పేరు సంపాదించుకున్నాడు.మ‌ధ్య‌లో ఫామ్ కోల్పోయినా… ఆయ‌న‌కున్న క్రేజ్ మాత్రం త‌గ్గ‌లేదు. కొంచెం విరామం త‌ర్వాత ఆయ‌న దర్శకత్వం వహించిన సినిమా ‘రంగ‌మార్తాండ‌’. మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ సినిమాకు తెలుగు రీమేక్‌ ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేసింది.దానికి తోడు ప్రమోషన్స్‌లో భాగంగా సినీ ప్రముఖులు,సామాజిక కార్యకర్తలతోపాటు మీడియాకు కూడా పలుమార్లు ప్రీమియర్స్‌ వేడయంతో ‘రంగమార్తాండ’కు బజ్‌ ఏర్పడింది. కృష్ణ‌వంశీ సినిమాల్లోనే గుర్తుండిపోయే పాత్ర‌లు పోషించి పుర‌స్కారాలు అందుకున్న ప్ర‌కాష్ రాజ్ ఇందులో కీల‌క పాత్ర పోషించారు.బ్ర‌హ్మానందం త‌న న‌ట‌న‌లోని కొత్త కోణాన్ని ఆవిష్క‌రిస్తూ ఈ సినిమా చేశారు. భారీ అంచనాల మధ్య ఉగాది సందర్భంగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…


కథ:
రాఘవరావు(ప్రకాశ్‌ రాజ్‌) ఓ రంగస్థల కళాకారుడు. తన నటనతో ప్రేక్షకుల అభిమానంతోపాటు ఎన్నో కీర్తిప్రతిష్టతలను సాధిస్తాడు. ఆయన ప్రతిభకు మెచ్చి ‘రంగమార్తాండ’బిరుదును ప్రదానం చేస్తారు అభిమానులు.అయితే ఆ సత్కార సభలోనే తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించి అందరికి షాకిస్తాడు.అంతేకాదు తన ఆస్తులను పిల్లలకు పంచిస్తాడు.కొడుకు రంగారావు(ఆదర్శ్‌), కోడలు గీత(అనసూయ)లకు ఇష్టపడి కట్టుకున్న ఇంటిని, అమ్మాయి శ్రీ(శివాత్మిక రాజశేఖర్‌)కు తాను ఫిక్స్డ్‌ డిపాజిట్‌ చేసుకున్న సొమ్మును అప్పగిస్తాడు. ప్రేమించిన వ్యక్తి(రాహుల్‌ సిప్లిగంజ్‌)తో కూతురు పెళ్లి కూడా చేస్తాడు.ఇలా బాధ్యతలన్నింటినీ తీర్చుకున్న రాఘవరావు శేష జీవితాన్ని భార్య(రమ్యకృష్ణ)తో ఆనందంగా గడపాలనుకుంటాడు. అయితే అక్క‌డి నుంచి ఆయ‌న జీవితంలో కొత్త అంకం మొద‌ల‌వుతుంది. ఆ అంకంలో ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? రంగ‌స్థ‌లంపై పోషించిన ప్ర‌తిపాత్ర‌నప ర‌క్తి క‌ట్టించిన రాఘ‌వ‌రావుకు నిజ జీవితం ఎలాంటి పాత్ర‌ను ఇచ్చింది? మ‌రి జీవిత నాట‌కంలో గెలిచాడా లేదా? రాఘవరావు అనుకున్నట్లుగా శేష జీవితం ఆనందంగా సాగిందా? తను ఇష్టపడి కట్టుకున్న ఇంటి నుంచే ఆయన ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చింది? పిల్లలే తన సర్వస్వం అనుకున్న రాఘవరావు దంపతులకు జీవితం ఎలాంటి పాఠం నేర్పించింది? భర్తే సర్వస్వం అనుకొని నమ్ముకున్న భార్యకు, చిన్నప్పటి నుంచి కష్టసుఖాల్లో తోడుగా ఉన్న ప్రాణ స్నేహితుడు చక్రపాణి(బ్రహ్మానందం)కి ఎలాంటి న్యాయం చేశాడు? చివరికి అతని నిజజీవితం ఎలా ముగిసింది? అనేదే తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
మారాఠీలో వచ్చిన ‘నటసామ్రాట్‌’కి తెలుగు రీమేక్‌గా ‘రంగమార్తాండ’ తెరకెక్కింది. అసలు ఇలాంటి కథను ముట్టుకోవడమే పెద్ద సాహసం. ఆ చిత్రంలో కథ, కథనం కంటే నటన చాలా బలంగా ఉంటుంది. అలాంటి కథను రీమేక్‌ చేయడం అంటే కత్తిమీద సాములాంటిదే. కానీ ఈ విషయంలో కృష్ణవంశీ వందశాతం విజయం సాధించారు. ‘నటసామ్రాట్‌’ సోల్‌ మిస్‌ అవ్వకుండా తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా మార్పులు చేసి మెప్పించారు. తెలుగు నాటకాలు, పద్యాలతో ప్రతి సన్నివేశాన్ని చాలా భావోద్వేకంగా రాసుకున్నారు. కథ ప్రారంభం కాస్త నెమ్మదిగా అనిపించినా.. రాఘవరావు రంగస్థలం నాటకాలకు రిటైర్మెంట్‌ ప్రకటించి జీవితం అనే నాటకంలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ప్రతి సీన్‌ చాలా ఎమోషనల్‌గా, ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ఇంటర్వెల్‌ ముందు వచ్చే సన్నివేశం అయితే కంటతడి పెట్టిస్తుంది. భార్యను ప్రేమగా ‘రాజుగారు’అని పిలుస్తూ సేవలు చేసే దృశ్యాలు హృదయాలను ఆకట్టుకుంటాయి.‘ఆనందం.. రెండు విషాదాల మధ్య విరామం’ అంటూ ఇంటర్వెల్‌ బోర్డు పడడంతో ప్రేక్షకులు బరువెక్కిన హృదయాలతో సీట్ల నుంచి లేస్తారు.ఇక సెకండాఫ్‌లో వచ్చే ప్రతి సన్నివేశం హృదయాలను హత్తుకుంటుంది.


కూతురు దగ్గరకు వెళ్లిన రాఘవరావు దంపతులకు ఎదురైన అవమానాలు.. స్నేహితుడు చక్రి జీవితంలో చోటు చేసుకున్న విషాదాలతో సెకండాఫ్‌ మొత్తం ఎమోషనల్‌గా సాగుతుంది. ఆస్పత్రిలో ఉన్న చక్రి ‘ముక్తిని ఇవ్వరా’ అంటూ స్నేహితుడిని వేడుకోవడం… ‘మన ఇంటికి మనం వెళ్లిపోదామయ్యా..’ అంటూ రాఘవరావు భార్య అడగడం.. ఇవన్నీ గుండెను బరువెక్కిస్తాయి. క్లైమాక్స్‌ సీన్‌ చూసి భారమైన మనసుతో, బరువెక్కిన గుండెతో ప్రేక్షకుడు బయటకు వస్తాడు. భార్యభర్తల అనుబంధం, స్నేహబంధాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉంది. ప్ర‌కాశ్‌రాజ్, ర‌మ్య‌కృష్ణ క‌లిసి రోడ్డు ప‌క్క‌న నిద్రపోయే స‌న్నివేశాలు మ‌న‌సుల్ని బ‌రువెక్కిస్తాయి. రాఘ‌వ‌రావు స‌న్నిహితుడు చ‌క్ర‌పాణి జీవితం కూడా క‌థ‌కు కీల‌కం. ఆస్ప‌త్రిలో ప్ర‌కాశ్‌రాజ్ – బ్ర‌హ్మానందం మ‌ధ్య స‌న్నివేశాలు సినిమాకు ఆయువుప‌ట్టుగా నిలిచాయి. నాట‌క‌రంగం నేప‌థ్యంలో సాగే అమ్మానాన్న‌ల క‌థ ఇది.

విశ్రాంత జీవితాన్ని గ‌డుపుతున్న క‌న్న‌వాళ్ల‌ను ఎలా చూసుకోవాలో, వాళ్ల‌తో ఎలా మెల‌గాలో నేటి తరం పిల్లలకు చెప్పే క‌థ‌. మొత్తంగా నేటి జీవితాలను ప్ర‌తిబింబిస్తూ మ‌న‌సులను త‌డిచేసే ఓ హృద్య‌మైన క‌థ‌. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం తెర‌పై క‌నిపించిన కొద్దిసేప‌టికే… వాళ్ల జీవితాల‌తో మ‌మేక‌మ‌వుతూనే, ప్రేక్ష‌కులు ఎవ‌రి జీవితాల్లోని సంఘ‌ట‌న‌లను వాళ్లు త‌మ త‌మ మ‌నోఫ‌ల‌కంపై ఆవిష్క‌రించుకుంటూ భావోద్వేగాల ప్ర‌యాణం చేస్తారు. థియేట‌ర్ నుంచి బ‌య‌టికొచ్చాక కూడా ఆ పాత్ర‌లు వెంటాడుతూ వ‌స్తుంటాయి. ఇంటికొచ్చాక అమ్మానాన్నల కాళ్లపై పడిపోవాలనిపిస్తుంది. అంత ప్ర‌భావం చూపిస్తుందీ చిత్రం.

నటీనటుల విశ్లేషణ:
‘రంగమార్తాండ’గా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌ను తీసుకోవడం ఈ సినిమాకు ప్రధాన బలం. పూర్తిగా నవరసాలూ పండించగల ప్రకాష్ రాజ్ చాలా రోజుల తర్వాత ఒక బలమైన పాత్రలో జీవించారు. త‌న‌కున్న అనుభ‌వంతో రంగమార్తాండ రాఘవరావు పాత్ర‌ను ర‌క్తిక‌ట్టించారు. ప‌ద్యాలు, ఆంగ్ల సంభాష‌ణ‌లు, అచ్చ తెలుగు మాట‌లను చెబుతూ ఆ పాత్ర‌కి మ‌రింత వ‌న్నె తీసుకొచ్చాడు. ప్ర‌కాశ్‌రాజ్ త‌ప్ప మ‌రొక‌రు చేయ‌లేర‌నిపించేలా ఉంటుంది రాఘ‌వ‌రావు పాత్ర‌.ఇక బ్రహ్మానందం, రమ్యకృష్ణ కూడా ఈ సినిమాకు మూల స్తంభాలు. బ్ర‌హ్మానందంలోని కొత్త కోణం ఇందులో క‌నిపిస్తుంది. ఇప్పటి వరకూ హాస్య బ్రహ్మగానే కనిపించిన బ్రహ్మానందం.. ఇందులో హృద‌యాలను బ‌రువెక్కించేలా న‌టించి ప్రేక్ష‌కుల్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తారు. ర‌మ్య‌కృష్ణ ఎక్కువ సంభాష‌ణ‌లు లేకుండా… క‌ళ్ల‌తోనే భావోద్వేగాలు ప‌లికించి తన పాత్రకు న్యాయం చేసింది. రాజుగారూ అంటూ ఆమెను ప్ర‌కాశ్‌రాజ్ సంబోధించ‌డం, వాళ్లిద్ద‌రి మ‌ధ్య అన్యోన్య‌తను చూస్తే స‌గ‌టు ప్రేక్ష‌కుడికి వాళ్ల త‌ల్లిదండ్రులు గుర్తుకురాక మాన‌రు.ఇక శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్‌, అన‌సూయ‌, ఆద‌ర్శ్, అలీ రెజా నేటిత‌రం పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. ఆయా పాత్ర‌ల‌పై బ‌ల‌మైన ప్ర‌భావ‌మే చూపించారు.

సాంకేతిక విశ్లేషణ:
సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ఇళ‌య‌రాజా సంగీతం సినిమాకు ప్ర‌ధాన బ‌లం. పాట‌లు, నేప‌థ్య సంగీతం క‌థ‌లో భాగంగా సాగుతాయి. ఎలాంటి రణగొణ ధ్వనుల లేకుండా.. చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించారు. పాటలు కూడా సినిమాలో భాగంగా సాగుతాయి. కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. ఆకెళ్ల శివ‌ప్ర‌సాద్ మాట‌లు సినిమాకు మ‌రో హైలైట్‌. నాట‌కం, జీవితం, సినిమాల‌పై ఎంతో అవ‌గాహ‌న ఉంటే త‌ప్ప అలాంటి మాట‌లు రాయ‌లేరు. సినిమా ఆరంభంలో ల‌క్ష్మీభూపాల్ ర‌చ‌న‌లో చిరంజీవి చెప్పిన షాయిరీ ఆక‌ట్టుకుంటుంది. దర్శ‌కుడు కృష్ణ‌వంశీ మేకింగ్‌లో ఆయ‌న ప‌ట్టును, అనుభ‌వాన్ని రంగ‌రించి మ‌రో గుర్తుండిపోయే చిత్రాన్ని తెర‌కెక్కించారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

నటీనటులు: ప్రకాష్ రాజ్‌, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక, అనసూయ, రాహుల్‌ సిప్లిగంజ్‌, ఆద‌ర్శ్‌, భ‌ద్రం, వేణు, అలీ రెజా, స‌త్యానంద్ తదితరులు
నిర్మాత‌లు : కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి
మాటలు: ఆకెళ్ల శివ‌ప్ర‌సాద్‌
ద‌ర్శ‌క‌త్వం : కృష్ణవంశీ
సంగీతం: ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: రాజ్‌ కె.నల్లి
విడుదల తేది: మార్చి 22, 2023

చివరగా.. ‘రంగమార్తాండ’ ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన జీవిత చిత్రం

రేటింగ్: 3.75/5

-బిల్లా గంగాధర్

Related News

Bhanumathi: ఉన్నతంగా బ్రతికిన భానుమతి.. చరమాంకంలో దీనస్థితికి చేరుకోవడానికి కారణం..?

Samantha : ఫైనల్‌గా కెమెరా ముందుకు వచ్చిన సామ్… ‘కల…’ అంటూ ఎమోషనల్ పోస్ట్

Ruksana Bano: ప్రముఖ సింగర్ మృతి.. షాకింగ్‌లో ఫ్యాన్స్.. విషం ఇచ్చి హత్య!

Bollywood Actress : ఇక బాలీవుడ్ ఖాళీ… టాలీవుడ్‌పై కన్నెసిన జాన్వీ బెస్ట్ ఫ్రెండ్..

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Telugu Actress: ఎన్టీఆర్, ఏఎన్నార్ లనే ఢీ కొట్టిన నటి.. కానీ చనిపోతే మాత్రం.. !

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Big Stories

×