Amith Sha : తెలంగాణలో అధికారంలోకి రావాలన్న పట్టుదలతో బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల్లో సత్తా చాటి. .కారు స్పీడ్ కు బ్రేకులు వేసింది. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో భారీ సీట్లు సాధించి కాషాయ పార్టీ బలాన్ని నిరూపించింది. ఆ తర్వాత చాలా మంది ఇతర పార్టీల నేతలు కాషాయ కండువాలు కప్పుకున్నారు. అయితే మునుగోడు ఉపఎన్నిక బీజేపీకి షాకిచ్చింది. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడంతో బీజేపీలో చేరికలు తగ్గిపోయాయి. మునుగోడు ఉపఎన్నిక తర్వాత పెద్దగా పేరున్న నేతలెవరూ కాషాయ తీర్థం పుచ్చుకోలేదు.
గతేడాది నుంచి తెలంగాణలో బీజేపీ అగ్ర నేతలు వరుస పర్యటనలు చేస్తున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించి బీజేపీని గెలుపించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. తెలంగాణ పర్యటనల్లో మోదీ చేసిన ప్రసంగాలు కాషాయ శ్రేణుల్లో ఊపునిచ్చాయి.
తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ లో పర్యటించారు. తిరుగు ప్రయాణంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో షెడ్యూల్ టైమ్ ప్రకారం ఇక్కడ నుంచి వెళ్లలేకపోయారు. దీంతో కొంత సమయం హైదరాబాద్ ఉండిపోయారు. ఈ సమయంలో రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌తో సమావేశమయ్యారు.
తెలంగాణలో రాజకీయాలపై సుదీర్ఘంగా అమిత్ షా చర్చించారు. ఈ భేటీలో బండి సంజయ్.. అమిత్ షాకు ఒక నోట్ అందించారని తెలుస్తోంది. ఈ నోట్‌పై లోతైన చర్చ జరిగిందని సమాచారం. తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలకు చెప్పారంట. నేతలు మరింత కలిసికట్టుగా పనిచేస్తే అధికారం తథ్యమని స్పష్టం చేశారని తెలుస్తోంది. రాష్ట్ర నేతల పనితీరుకు కితాబు ఇచ్చిన అమిత్ షా.. చేరికలపై దృష్టి పెట్టాలని సూచించారని సమాచారం. ఇలా అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణలో ఎన్నికలకు మరో 9 నెలల సమయం మాత్రమే ఉంది. చాలా నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన అభ్యర్థులు లేరు. ఆ పార్టీ 20-30 స్థానాల్లో మాత్రమే గట్టి పోటీ ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బలమైన నేతల లేకపోవడం కాషాయ పార్టీకి మైనస్ మారింది. అందుకే ఈ లోపాన్ని గుర్తించిన అధిష్టానం చేరికలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర నేతలను ఆదేశించింది. బలమైన నేతలను పార్టీలో చేర్చుకోవాలనేది అమిత్ షా వ్యూహం. మరి బీజేపీలోకి వచ్చే నేతలెవరు..?
FOR MORE UPDATES PLEASE FOLLOW : https://bigtvlive.com/telangana