WTC Final : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఫైనల్లోకి ఇప్పటికే ఆస్ట్రేలియా దూసుకెళ్లింది. ఇక ఫైనల్ చేరే రెండో జట్టుపై ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో టీమిండియా ముందున్నా .. శ్రీలంక జట్టు పోటీలో ఉండటంతో సమీకరణాలు ఆసక్తి రేపుతున్నాయి.
ఫైనల్ లో ఆసీస్..
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన రోహిత్ సేన WTC ఫైనల్ రేసులో ముందుకెళ్లింది. అయితే అనూహ్యంగా మూడో టెస్టులో ఓడిపోవడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. భారత్ పై మూడో టెస్టులో విజయంతో ఆస్ట్రేలియా నేరుగా ఫైనల్ కు చేరుకుంది. మరో ఫైనల్ బెర్తు కోసం భారత్, శ్రీలంక జట్లు పోటీ పడుతున్నాయి. భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగే నాలుగో టెస్టు, న్యూజిలాండ్- శ్రీలంక మధ్య జరిగే రెండు టెస్టుల సిరీస్ పై ఇప్పుడు సర్వాత్రా ఆసక్తి నెలకొంది.
భారత్ అవకాశాలేంటి..?
ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టెస్టులో భారత్ విజయం సాధిస్తే.. శ్రీలంక,న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌తో సంబంధం లేకుండా నేరుగా WTC ఫైనల్ కు చేరుకుంటుంది. ఒకవేళ భారత్, ఆసీస్ మధ్య జరిగే నాలుగో టెస్టు డ్రా అయితే కివీస్-శ్రీలంక సిరీస్ ఫలితంపై సమీకరణాలు ఆధారపడి ఉంటాయి. న్యూజిలాండ్‌పై శ్రీలంక 2-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే భారత్ ఆశలు గల్లంతవుతాయి. కానీ కివీస్‌పై 1-0 తేడాతో శ్రీలంక గెలిచినా భారత్ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టెస్టులోనూ భారత్ ఓటమిపాలై, న్యూజిలాండ్‌పై సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే శ్రీలంక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. అద్భుతం జరిగితే తప్పితే స్వదేశంలో న్యూజిలాండ్ ను ఓడించడం శ్రీలంకకు అంత ఈజీ కాదు. అందుకే ఆస్ట్రేలియాపై నాలుగో టెస్టులో ఎలాంటి ఫలితం వచ్చినా భారత్ కే WTC ఫైనల్ అవకాశాలుంటాయి.
అహ్మదాబాద్ వేదికగా మార్చి 9 నుంచి భారత్, ఆసీస్ మధ్య నాలుగో టెస్టు ప్రారంభమవుతుంది.మార్చి 9 నుంచే న్యూజిలాండ్, శ్రీలంక రెండు టెస్టుల సిరీస్ మొదలవుతుంది. జూన్ 7-11 మధ్య లండన్ ఓవల్ మైదానంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతుంది.