Accident : ఆ జంట వివాహం సింహాచల క్షేత్రంలో వైభవంగా జరిగింది.పెళ్లికొడుకు ఇంట విందులో అందరూ ఉత్సాహంగా గడిపారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, స్నేహితులు నూతన దంపతులను ఆశీర్వదించారు. కానీ ఆ ఆనందం ఎన్నో రోజులు లేదు. పెళ్లైన 4 రోజులకే ఆ జంటను విధి వెంటాడింది. ఓ ట్రాక్టర్ మృత్యుశకటంలా దూసుకొచ్చింది. వారి బైక్ ను ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదం కొత్త జంటను బలి తీసుకుంది. వధువు, వరుడు కాళ్ల పారాణి ఆరక ముందు కానరాని లోకాలు కలిసి వెళ్లిపోయారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని బెల్లుపడ కాలనీ చెందిన గవలపు వేణు ఓ వస్త్రదుకాణంలో పనిచేస్తున్నాడు. ఈ యువకుడికి ఒడిశాలోని బ్రహ్మపురకు చెందిన సుభద్రతో వివాహం జరిగింది. సింహాచల క్షేత్రంలో ఈ నెల 10న వివాహ వేడుకను వైభవంగా నిర్వహించారు. ఈ నెల 12న వరుడు ఇంట విందు కార్యక్రమం సరదా సరదాగా సాగింది.
పెళ్లి వేడుకలు ముగియడంతో ఇచ్ఛాపురం నుంచి అత్తవారింటికి ఒడిశాకు బైక్ పై నవ దంపతులు వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. గొళంత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బైక్ ను ట్రాక్టర్ బలంగా ఢీకొనడంతో సుభద్ర అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన వేణును ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు.
బ్రహ్మపురలో అల్లుడు, కుమార్తె కోసం ఎదురు చూస్తున్న వధువు కుటుంబ సభ్యులు ఈ వార్త తెలిసి షాక్ కు గురయ్యారు. శోకసంద్రంలో మునిగిపోయారు. విధి రాతను తలచుకుని విలపిస్తున్నారు. వేణు తండ్రి రామారావు గతంలోనే చనిపోయారు. అన్నయ్య, అక్క, అమ్మతో కలిసి అతడు ఉంటున్నాడు. వరుడు మృతితో అతని కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. ఆ జంట పెళ్లైన 4 రోజులకే ప్రాణాలు కోల్పోవడంతో ఆత్మీయులు, స్నేహితులు ఆవేదన చెందుతున్నారు.