Management System in META:ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా.. మరికొందరు ఉద్యోగుల్ని తొలగించబోతోందా? ఆ సంస్థ అధిపతి మార్క్ జుకర్‌బర్గ్ మాటలు చూస్తుంటే… అలాగే అనిపిస్తోంది. కంపెనీలోని మేనేజర్ వ్యవస్థపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన.. ఈసారి వారిపైనే వేటు వేయబోతున్నామనే సంకేతాలు ఇచ్చారని… అంతర్జాతీయ మీడియా అంటోంది. దాంతో… ఈసారి ఎంత మంది ఉద్యోగాలు ఊడిపోతాయోనన్న చర్చ జరుగుతోంది.
ఈ మధ్యే 11 వేల మంది ఉద్యోగుల్ని తీసేసింది… మెటా. ఇప్పుడు మరికొందరికి లేఆఫ్‌లు ఇవ్వాలని జుకర్‌బర్గ్ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంస్థ ఉద్యోగులతో సమావేశం సందర్భంగా… వివిధ స్థాయిల్లో మేనేజర్లపై మేనేజర్లు ఉండటాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించినట్లు చెబుతున్నారు. దాంతో మధ్య స్థాయి మేనేజర్లపై వేటు వేసేందుకు జుకర్‌బర్గ్ సిద్ధమవుతున్నారని… అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఉద్యోగుల్ని మేనేజ్ చేసే మేనేజర్లు, వారిని నియంత్రించే మరికొందరు మేనేజర్లు, ఆ మేనేజర్లను మేనేజ్ చేసే మేనేజర్లు.. ఇలా ఇన్ని స్థాయిల్లో మేనేజిమెంట్ వ్యవస్థ అవసరం అని అనుకోవడం లేదని… జుకర్‌బర్గ్ వ్యాఖ్యానించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అసలు అంతమంది మేనేజర్ల నియామకాలను ఎలా జరిపారని ఆయన ప్రశ్నించినట్లు తెలిపింది. దాంతో… ఏ క్షణమైనా మెటా మేనేజర్లకు పింక్ స్లిప్పులు అందడం ఖాయమని అంటున్నాయి. మెటాలో మధ్య స్థాయి వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చే యోచనలో జుకర్‌బర్గ్ ఉన్నారని కథనాలు రాస్తున్నాయి. ఆర్థిక మాంద్యం భయంతో ఇటీవలే 11 వేల మంది సిబ్బందిని కంపెనీ నుంచి తొలగించింది…. మెటా. ఈ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించడం… కంపెనీ 18 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి. తాజాగా, సంస్థలో మేనేజ్‌మెంట్ స్థాయిలో ఎన్నో లేయర్లు ఉండటం వల్ల… ఖర్చు వృథా అని భావిస్తోంది. అందుకే… భవిష్యత్తులో మెటాలో మరిన్ని కోతలు తప్పవనే చర్చ జరుగుతోంది.