EPAPER
Kirrak Couples Episode 1

Columbia disaster : కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ ఎందుకు కూలింది?.. ప్రమాదానికి కారణమిదేనా..?

Columbia disaster : కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ ఎందుకు కూలింది?.. ప్రమాదానికి కారణమిదేనా..?

Columbia disaster : 2003 ఫిబ్రవరి 1 అంతరిక్షయాన చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రమాదం జరిగిన రోజు. కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షం నుంచి తిరిగి భూమికి చేరుకునే క్రమంలో గాలిలోనే కాలిపోయింది. ఈ ప్రమాదంలో భారత్‌కు చెందిన కల్పనా చావ్లాతో సహా ఏడుగురు ఆస్ట్రోనాట్స్ ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన జరిగి 20 ఏళ్లు అయ్యింది.


ఏం జరిగింది?
15 రోజులపాటు అంతరిక్షంలో గడిపాక 2003 ఫిబ్రవరి 1న కొలంబియా స్పేస్ క్రాఫ్ట్‌లో మళ్లీ భూమికి పయనమైంది కల్పనా చావ్లా బృందం. కొలంబియా స్పేస్ క్రాఫ్ట్.. భూమి వాతావరణంలోకి ప్రవేశించే వరకు ప్రయాణం బాగానే సాగింది. కానీ ఆ తర్వాత కొలంబియా స్పేస్ క్రాఫ్ట్‌ నుంచి అబ్‌నార్మల్ రీడింగ్స్ నాసా మిషన్ కంట్రోల్ రూమ్‌కు వచ్చాయి. స్పేస్ క్రాప్ట్ ఎడమ రెక్కలో ఉండే టెంపరేచర్ సెన్సార్ల నుంచి సమాచార ప్రసారం నిలిచి పోయింది. స్పేస్ క్రాఫ్ట్ టైర్ల ప్రెషర్‌కు సంబంధించిన డేటా కనిపించలేదు. దీంతో కొలంబియా స్పేస్ క్రాఫ్ట్‌ సిబ్బందితో కమ్యూనికేట్ అయ్యేందుకు ప్రయత్నించింది మిషన్ కంట్రోల్ రూమ్. అయితే కొద్ది సెకన్లకే కొలంబియాతో పూర్తి సంబంధాలు తెగిపోయాయి. ఎంత ప్రయత్నించినా తిరిగి కమ్యూనికేట్ కాలేక పోయారు. చివరకు కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ కుప్పకూలింది.

శకలాలు.. చెల్లాచెదురు
ఆకాశంలో కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ ముక్కలుగా విడిపోవడాన్ని చూశామని కొందరు ప్రజలు చెప్పారు. టెక్సాస్, లూసియానా, ఆర్కాన్సా రాష్ట్రాలలో కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ శకలాలు పడ్డాయి. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్‌లో ల్యాండ్ కావాల్సిన కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ ఇలా అర్ధంతరంగా కూలి పోయింది. కొలంబియా స్పేస్ క్రాఫ్ట్‌లో 40 శాతం శకలాలను మాత్రమే నాసా సేకరించగలిగింది.


ప్రమాదానికి కారణం ఇదే..
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడానికి చేపట్టిన మిషన్ కోసం 2003 జనవరి 16న అంతరిక్షంలోకి వెళ్లింది కొలంబియా స్పేస్ క్రాఫ్ట్. ఫ్లోరిడాలోని కేప్ కనేవరల్ నుంచి నింగిలోకి దూసుకు పోయేటప్పుడు స్పేస్ క్రాఫ్ట్‌కు చిన్న ప్రమాదం జరిగింది. వాతావరణంలోని ఒత్తిడి, ఘర్షణ వల్ల ఇంధన ట్యాంక్‌కు సమస్యలు తలెత్తకుండా దానిపై ఫోమ్ ఇన్సులేషన్‌ అప్లై చేసింది నాసా. రాకెట్ లాంచ్ చేసేటప్పుడు ఫ్యూయల్ ట్యాంక్ చుట్టూ ఉండే ఫోమ్ ఇన్సులేషన్‌లో కొంత భాగం ఊడిపోయింది. ఒక సూటు కేసు సైజులో ఉన్న ఆ ముక్క.. స్పేస్ షటిల్ ఎడమ రెక్కను డ్యామేజ్‌ చేసింది. దీంతో అత్యంత వేడి నుంచి రెక్కలను కాపాడే హీట్ రెసిస్టెంట్ టైల్స్‌లో చిన్న పగుళ్లు ఏర్పడ్డాయి. చిన్న రంధ్రం కూడా పడింది. దీంతో అంతరిక్షంలోకి వెళ్లేటప్పుడు అంతా బాగానే ఉన్నా తిరిగి భూమిపైకి వచ్చేటప్పుడు ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తేలింది.

ప్రమాదం జరిగిందిలా..
అంతరిక్షం నుంచి అమిత వేగంతో భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు రకరకాల వాయువులతో స్పేస్ క్రాఫ్ట్‌కు కలిగే ఘర్షణ వల్ల విపరీతమైన వేడి పుట్టుకొస్తుంది. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు 1,300, 1,400 సెల్సియస్ డిగ్రీలు ఉంటుంది. అంత వేడిని తట్టుకునేలా స్పేస్ క్రాఫ్ట్‌ను డిజైన్ చేస్తారు. అందులో హీట్ రెసిస్టెంట్ టైల్స్‌దే కీలక పాత్ర. 1,650 డిగ్రీల వరకు వేడిని తట్టుకునేలా వాటిని డిజైన్ చేసింది నాసా. లాంచింగ్ అప్పుడు జరిగిన ప్రమాదం వల్ల హీట్ రెసిస్టెంట్ టైల్స్‌లో తలెత్తిన పగుళ్లు కారణంగా వాతావరణంలోని వేడిని, ఘర్షణను తట్టుకోలేక పోయింది కొలంబియా స్పేస్ క్రాఫ్ట్. అంతరిక్షం నుంచి బయలుదేరిన తర్వాత భూవాతావరణంలోకి ప్రవేశించగానే అత్యంత వేడిగా ఉండే వాయువులు, ఎడమ రెక్కలోని చిన్న రంధ్రం గుండా స్పేస్‌ క్రాఫ్ట్‌లోకి ప్రవేశించాయి. ఫలితంగా కొలంబియా స్పేస్ క్రాఫ్ట్‌లోని కీలక వ్యవస్థలు పని చేయకుండా పోయాయి. చివరకు స్పేస్ క్రాఫ్ట్ కుప్పకూలింది.

ముందే తెలుసా?
ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఫోమ్ ఇన్సులేషన్ ఊడిపడటాన్ని ముందుగానే గుర్తించినట్లు విచారణలో తేలింది. కానీ అంతకు ముందు ప్రయోగాల్లో కొన్నిసార్లు ఇలాగే జరగడం, కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ సురక్షితంగా కిందకు రావడం వల్ల సిబ్బంది ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. కొలంబియాకు జరిగిన ప్రమాదంపై ఏర్పాటు చేసిన కొలంబియా యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ ప్రమాదం జరిగిన తీరుపై నివేదిక వెల్లడించింది. ఫోమ్ ఇన్సులేషన్ నుంచి ఇతర భద్రతా లోపాలను నాసా పట్టించుకోలేదని ఈ రిపోర్ట్‌ పేర్కొంది. 1981లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ విజయవంతంగా 27 సార్లు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చింది. కానీ 28వ ప్రయాణాన్ని పూర్తి చేయడంలో విఫలమైంది.

కల్పనా చావ్లా ఎవరు?
1962 మార్చి 17న హర్యానాలో కల్పనా చావ్లా జన్మించారు. ఆమె 1982లో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. 1984లో టెక్సాస్ యూనివర్సిటీ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ సాధించారు. అందులోనే డాక్టరేట్ పూర్తి చేసిన కల్పనా చావ్లా అమెరికా సిటిజెన్‌గా మారారు. కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ పరిశోధకురాలిగా 1988లో నాసాలో చేరారు. ఫ్లూయిడ్ డైనమిక్స్ ద్వారా విమానాలు, అంతరిక్ష వాహనాలపై వాతావరణంలోని వాయువులు చూపే ప్రభావాన్ని తెలుసుకుంటారు. నాసా అంతరిక్షయానానికి సంబంధించి స్పేస్ క్రాఫ్ట్స్‌లో మిషన్ స్పెషలిస్ట్‌గా పని చేసే అవకాశాన్ని 1994లో దక్కించుకున్నారు కల్పనా చావ్లా.

తొలిసారి అంతరిక్షంలోకి ఇలా..
కల్పనా చావ్లా తొలిసారి 1997లో అంతరిక్షంలోకి వెళ్లారు. 1997 నవంబర్ 19న కొలంబియా స్పేష్ క్రాఫ్ట్‌లో ప్రయాణించారు. అలా అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయురాలిగా చరిత్రను సృష్టించారు. తొలి మిషన్‌లో 15 రోజుల పాటు అంతరిక్షంలోనే ఉన్నారు. 2001లో రెండోసారి నాసా స్పేస్ మిషన్‌కు ఆమె సెలెక్ట్ అయ్యారు. కానీ కొన్ని సాంకేతిక కారణాలు, స్పేస్ క్రాఫ్ట్ ఇంజిన్‌లోని లోపాల వల్ల దాదాపు రెండేళ్లపాటు వాయిదా పడింది ఆ మిషన్. చివరకు 2003 జనవరి 16న ఆమె రెండోసారి అంతరిక్షంలోకి చేరుకున్నారు. ఆమెకు అదే చివరి స్పేస్ మిషన్ అయ్యింది.

Tags

Related News

Kolikapudi Srinivasa Rao: ఇవేం పనులు.. పార్టీ నుండి కొలికపూడి సస్పెండ్..?

Balineni vs YV Subba Reddy: బావ.. నీ బండారం బయట పెడతా.. వైవీకి బాలినేని వార్నింగ్

Big Shock To KCR: కేటీఆర్‌కి మాజీ BRS ఎమ్మెల్యేలు షాక్.. కారణం ఇదేనా?

Death of Nasralla: 80 టన్నుల బాంబులతో.. నస్రల్లాను ఎలా చంపారంటే..!

Vijayasai Reddy to Join in TDP: టీడీపీలోకి విజయసాయిరెడ్డి? బాంబు పేల్చిన అచ్చెన్న..

Israeli airstrikes on Beirut: లెబనాన్ రాజధాని బీరుట్‌పై బాంబుల వర్షం.. వంతెనల కిందే ఆకలి బతుకులు

President Draupadi Murmu : రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. ఈ మార్గాల్లో వెళ్తే అంతే సంగతులు

Big Stories

×