Tamilanadu: తమిళనాడులో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. చెన్నై మెరీనా బీచ్‌లో శ్రామికుల విగ్రహం వద్ద గవర్నర్ ఆర్ఎన్.రవి జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. ఆ తర్వాత సైనికుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ రవికి సీఎం స్టాలిన్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. వీరిద్దరూ ఒకే వేదికపై ఆశీనులయ్యారు.
అయితే కొంతకాలంగా గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం స్టాలిన్‌కు మధ్య వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నెల 9న శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా మంత్రివర్గం రూపొందించిన ప్రసంగ పాఠంలో మార్పులు చేసిన కొన్ని పేరాలను చదవకుండా గవర్నర్ వదిలేశారు. గవర్నర్ వైఖరిని ఖండిస్తూ సీఎం స్టాలిన్ తీర్మానం చేయగా… గవర్నర్ సభ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించారు.
ఆ తర్వాత రాజ్‌భవన్‌లో జరిగిన సంక్రాంతి వేడుకలకు కూడా సీఎం స్టాలిన్‌తో పాటు మంత్రులు, డీఎంకే కూటమి ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఈక్రమంలో సీఎం స్టాలిన్ రిపబ్లిక్ డే వేడుకలకు హాజరై గవర్నర్ ఆర్ఎన్ రవికి స్వాగతం పలకడం ప్రధాన్యత సంతరించుకుంది.