Mangli : సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగిందని ఆదివారం వార్తలు వచ్చాయి. ఈ న్యూస్ ను ఆమె ఖండించింది. కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన ఓ కార్యక్రమంలో తనపై దాడి జరిగిందని కొన్ని సోషల్ మీడియా గ్రూపులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడింది.
ఈ ఘటనపై మంగ్లీ ఓ నోట్ విడుదల చేసింది. తనపై దాడి జరిగిందని కొన్ని సోషల్ మీడియా గ్రూపులు ప్రచారం చేసిన తప్పుడు వార్తలను పూర్తిగా ఖండిస్తున్నానని మంగ్లీ ఆ నోట్ లో పేర్కొంది. ఫోటోలు, వీడియోలు చూస్తే ఆ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని తెలుస్తోందని, తన ఉత్తమ ఈవెంట్లలో ఇది ఒకటి తెలిపింది. కన్నడ ప్రజలు తనపై చూపించిన ప్రేమ అపారమైనది వివరించింది. ఈ కార్యక్రమ నిర్వహకులు తనను చాలా బాగా చూసుకున్నారని పేర్కొంది. ఈ విషయం మాటలలో వర్ణించలేనిదని తెలిపింది. తన ప్రతిష్టను తగ్గించేందుకు కారుపై దాడి జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. తప్పుడు ప్రచారాన్ని తాను ఖండిస్తున్నానని స్పష్టం చేసింది. మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని నోట్ లో మంగ్లీ పేర్కొంది.
కొన్ని రోజుల క్రితం చిక్కబళ్లాపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మంగ్లీకి ఓ చేదు అనుభవం ఎదురైంది. కన్నడలో మాట్లాడాలని మంగ్లీని యాంకర్ కోరారు. కానీ మంగ్లీ తన ప్రసంగాన్ని తెలుగులోనే కొనసాగించింది. తర్వాత యాంకర్ బలవంతం చేయడంతో కన్నడలో ఒకటి రెండు మాటలు మాట్లాడింది మంగ్లీ. ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో… కన్నడిగులు మంగ్లీ తీరుపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మంగ్లీ కారుపై దాడి జరిగిందని వార్తలు రావడం కలకలం రేపింది. అయితే తనపై దాడి జరగలేదని మంగ్లీనే స్వయంగా చెప్పడంతో ఈ వివాదం ముగిసింది.