రాజుగారి కోడి పులావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు
చికెన్ – ముప్పావు కిలో
ఉల్లిపాయ – ఒకటి
బాస్మతి బియ్యం – రెండు కప్పులు
పచ్చిమిర్చి – ఆరు
కొత్తిమీర తరుగు – మూడు స్పూన్లు
పుదీనా – పావు కప్పు
పెరుగు – మూడు స్పూన్లు
గరం మసాలా – అర స్పూను
కారం – ఒక స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు స్పూన్లు
పసుపు – అర స్పూన్
బిర్యానీ ఆకులు – రెండు
దాల్చిన చెక్క – చిన్న ముక్క
యాలకులు – నాలుగు
లవంగాలు – నాలుగు
నూనె – సరిపడినంత
నెయ్యి – రెండు స్పూన్లు
జీడిపప్పులు – గుప్పెడు
రాజు గారి కోడి పులావ్ రెసిపీ
1. చికెన్ శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనెను వేసి ఉల్లిపాయలను ముక్కలను వేసి వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
3. ఆ ఉల్లిపాయ మిశ్రమాన్ని మిక్సీలో వేయాలి.
4. పచ్చిమిర్చిని కూడా వేసి శుభ్రంగా పేస్టులా చేసుకోవాలి.
5. బాస్మతి బియ్యాన్ని అరగంట పాటు ముందే నానబెట్టుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద పులావ్ వండేందుకు పెద్ద పాత్రను పెట్టాలి.
7. అందులో నెయ్యి, నూనె వేయాలి.
8. వాటిలో యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యాని ఆకులు వేసి వేయించాలి.
9. అలాగే జీడిపప్పులను కూడా వేయాలి.
10. సన్నగా నిలువుగా తరిగిన గుప్పెడు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి.
11. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి.
12. ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి.
13. ఈ మిశ్రమంలో గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలపాలి.
14. ఆ తర్వాత చికెన్ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి.
15. ఆ తర్వాత పెరుగు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
16. ఇందులో నాలుగు గ్లాసుల వేడి నీళ్లు పోసుకోవాలి.
17. ఇది ఉడుకుతున్న సమయంలో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి కలుపుకోవాలి.
18. పైన మూత పెట్టి మంటను తగ్గించాలి.
19. బియ్యం ఉడికేవరకు అలా చిన్న మంట మీద ఉడికించాలి.
20. పైన కొత్తిమీరను చల్లుకోవాలి. అంతే టేస్టీ రాజు గారి కోడిపులావ్ రెడీ అయినట్టే. ఒకసారి దీన్ని చేసి చూడండి. మీకు నచ్చడం ఖాయం.
సాధారణ పులావ్కు, రాజు గారి కోడి పులావుకు మధ్య తేడా ఉంటుంది. అలాగే బిర్యానీతో పోలిస్తే రాజు గారి కోడి పులావ్ రెసిపీ కూడా భిన్నంగా ఉంటుంది. కానీ చాలామంది బిర్యాని లాగే దీన్ని కూడా వండేస్తూ ఉంటారు. ఉల్లిపాయ వేయించి పచ్చిమిర్చిని కలిపి పేస్టులా చేసుకుని వాడడం వల్ల పులావ్కు ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఇది రాజు గారి కోడి పులావ్ ను ప్రత్యేకంగా నిలుపుతుంది. ఇందులో చికెన్ ముక్కలను మీరు వండే పాత్రను బట్టి చికెన్ పీసులు చిన్నవా లేదా పెద్దవా అనేది నిర్ణయించుకోవాలి. పెద్ద పీసులు ఉడకాలంటే కాస్త పెద్ద గిన్నెలో ఉడికించాల్సి రావచ్చు. రాజు గారి కోడి పులావ్ ఒకసారి చేసుకుని తినండి. మీ అందరికీ నచ్చడం ఖాయం.