పొట్టలో ఏమాత్రం గడబిడ వచ్చినా ఏ పనీ చేయలేము. ఏదో ఇబ్బందిగా ఉంటుంది. పొట్టలో ఉండే పెద్ద పేగు, చిన్న పేగు ఆరోగ్యంగా ఉంటేనే మీరు ఏ ఆహారాన్ని అయినా జీర్ణం చేసుకోగలరు. అయితే కొన్ని రకాల విషపూరిత అలవాట్లు మీ పేగుల ఆరోగ్యాన్ని, పొట్టలోని మంచి బ్యాక్టీరియా సమతుల్యతను దెబ్బతీస్తుంది. కాబట్టి అలాంటి అలవాట్లు మీకు ఉంటే వెంటనే మానేయాల్సిన అవసరం ఉంది.
కొంతమంది రోజువారీ దినచర్యను పాటించరు. రాత్రి నచ్చిన సమయంలో నిద్ర పోతారు. ప్రతిరోజు ఒకే సమయానికి నిద్ర లేవడం, ఒకే సమయానికి నిద్రపోవడం అనేది ఎంతో ముఖ్యం. కానీ అలా చేసే వారి సంఖ్య చాలా తక్కువ. ఎప్పుడైతే మీరు ఇలా ప్రతిరోజూ నిద్రా సమయాలను కచ్చితంగా పాటించకపోతే మీ జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. కొంతమంది రాత్రి భోజనం మానేయడం, అర్ధరాత్రి పూట తినడం, రాత్రిపూట భారీ ఆహారాలను తినడం వంటివి చేస్తూ ఉంటారు. ఇవి పొట్టలో అసౌకర్యాన్ని, అజీర్ణాన్ని కలిగిస్తాయి. అలాగే యాసిడ్ రిఫ్లెక్స్ కు కారణం అవుతాయి.
మిడ్ నైట్ క్రేవింగ్స్ వద్దు
కొంతమందికి మిడ్ నైట్ క్రేవింగ్స్ ఉంటాయి. అంటే అర్ధరాత్రి ఏదైనా తినాలనిపిస్తుంది. ఇది వారి ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మరి కొంతమంది అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా ఉంటారు. ఇది వారి జీర్ణ హార్మోన్ల ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది. అలాగే గట్ బ్యాక్టీరియా సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీనివల్ల పొట్ట అసౌకర్యంగా ఉంటుంది. నిద్ర సరిగా పట్టకపోయినా, ఒత్తిడి పెరిగిపోతుంది. ఇది కూడా పొట్ట ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. కాబట్టి అర్ధరాత్రి వరకు లేచి ఉండడం లేదా అర్ధరాత్రి పూట ఆహారాలను తినడం వంటి అలవాట్లను మానేయాలి.
ప్రతిరోజూ ఒకే సమయానికి తినడం అలవాటు చేసుకోవాలి. ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సమయానికి భోజనం చేయకపోవడం, ఆహారం లేకుండా ఎక్కువ గంటల పాటు ఉండడం వంటివి జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి. ఇది పొట్ట ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలకు కారణం అవుతుంది. అలాగే పొట్ట లైనింగ్‌ను దెబ్బతీస్తుంది. దీనివల్ల మీరు ఆరోగ్యంగా ఉండలేరు.
బ్రేక్‌ఫాస్ట్ ఎంతో ముఖ్యం
చాలామంది బ్రేక్‌ఫాస్ట్ తినడానికి ప్రాధాన్యత ఇవ్వరు. మనం ఒక రోజులో తినే ఆహారంలో బ్రేక్ ఫాస్ట్ అతి ముఖ్యమైనది. మీరు రాత్రి భోజనం తినకపోయినా ఫర్వాలేదు కానీ ఉదయం బ్రేక్ ఫాస్ట్ మాత్రం ఖచ్చితంగా తినండి. ఒక రాత్రంతా ఉపవాసం చేశాక మీ జీవక్రియను ప్రారంభించడానికి, శరీరానికి శక్తి అవసరం పడుతుంది. ఆ శక్తి అల్పాహారమే అందిస్తుంది. అలా అని ఏది పడితే అది బ్రేక్ ఫాస్ట్ లో తినకూడదు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. ముఖ్యంగా ప్రోటీన్ నిండిన ఆహారాన్ని తినాలి. సమతుల్యతను కాపాడుతుంది.
ఆహారంలో తగినంత ఫైబర్ ఉండేలా చూసుకోవాలి కానీ చాలామంది ఫైబర్ ఉన్న ఆహారాన్ని తినేందుకు ప్రయత్నించడం లేదు. దీనివల్ల పేగులు, వెన్నెముక కూడా దెబ్బతింటాయి. పండ్లు, కూరగాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి వాటిని తినేందుకు ప్రయత్నించండి. ఇది జీర్ణ వ్యవస్థను కాపాడుతుంది. పొట్టలోని మంచి బ్యాక్టీరియాకు రక్షణగా ఉంటుంది. మలబద్ధకం, పొట్ట ఉబ్బరం అంటే సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.
ఒత్తిడితో సమస్య
దీర్ఘకాలిక ఒత్తిడి బారిన పడుతున్నవారు వెంటనే ఆ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాల్సిన అవసరం ఉంది. ఇది కూడా పొట్ట ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. మీరు ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో కార్టిసాల్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇది గట్ బ్యాక్టీరియాను అతలాకుతలం చేస్తుంది. పొట్టలో తిమ్మిరిగా అనిపించడం, ఉబ్బరంగా అనిపించడం వంటి లక్షణాలకు దారితీస్తుంది. కాబట్టి ఒత్తిడిని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది.
చక్కెరతో నిండిన ఆహారాలు లేదా అధిక ప్రాసెస్ చేసిన ఆహారాలు తినకపోవడం మంచిది. తీపి నిండిన పదార్థాలు అధికంగా తింటే పొట్టలో గందరగోళం సృష్టించిన వారు అవుతారు. ఏ ఆహారంలో అయితే ఫైబర్ తక్కువగా ఉండే ఆహారం.. మీ పొట్టకు ఇబ్బందిని కలిగిస్తుంది.
తగినంత నీరు తాగకపోవడం వల్ల కూడా ఎన్నో సమస్యలు వస్తాయి. ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి నీరు ముఖ్యమైనది. ఇది పోషకాలను సమర్థవంతంగా గ్రహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ప్రతిరోజూ నీరు తాగడం వల్ల జీర్ణాశయంలో ఆహారం సజావుగా జీర్ణం అవుతుంది. పొట్ట ఉబ్బరం, జీవన సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు 8 గ్లాసులకు తగ్గకుండా నీటిని తాగేందుకు ప్రయత్నించండి.