YS Vjayamma : వైఎస్ జగన్ – షర్మిళ మధ్య ఆస్తుల వివాదం రోజుకొక మలుపు తిరుగుతున్న తరుణంలో.. ఆ ఘటనల్ని మరిపించేలా టీడీపీ సోషల్ మీడియా విడుదల చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో.. వైఎస్ విజయమ్మపై జగన్ హత్యాయత్నం చేశాడా.? అంటూ అనుమానాలు రేకెత్తించేలా ప్రచారం చేశారు. ఈ వార్తలపై విజయమ్మ స్పందించారు. ఇలాంటి వార్తలు తనకు ఆందోళన కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన విజయమ్మ.. పాత వీడియో బయటకు తీసి ఇలాంటి తప్పుడు ప్రచారం చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసిన వైఎస్ విజయమ్మ.. వైఎస్ జగన్ పై వ్యక్తం చేస్తున్న అనుమానాల్ని కొట్టిపారేశారు. రాజకీయాల్లో ఇది సరైన విధానం కాదు అంటూ వ్యాఖ్యానించారు.
కుటుంబం అన్నాక చిన్నచిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు అన్న విజయమ్మ.. అంత మాత్రాన తల్లికి కొడుకు, కొడుకుకు తల్లి ఒకరికొకరు కాకుండా పోతారా అని అన్నారు. అలానే.. అన్నా చెల్లిళ్లు సైతం వేరవరని, అంతా ఒకే కుటుంబమని అన్నారు. ఇలాంటి ప్రచారాల్ని ప్రతిపక్ష పార్టీలు, ఇతర సోషల్ మీడియా సంస్థలు మానుకోవాలని హితవు పలికిన విజయమ్మ.. మరోసారి ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తే.. పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు.
ఇటీవల ఇదే విషయంపై రెండు లేఖల్ని విడుదల చేసిన విజయమ్మ.. అవి నకిలీ లేఖలు అంటూ ప్రచారం జరుగుతుండడంతో మరోసారి వీడియోను విడుదల చేశారు. నకిలీ లేఖలు రాయాల్సిన అవసరం తనకు లేదని, తన కొడుకు గురించి రాసిన లేఖలు తనవేనని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఇలాంటి వైఖరిని ఖండిస్తున్నట్లు చెప్పిన వైఎస్ విజయమ్మ.. మీకు దమ్ము, ధైర్యం ఉంటే డైరెక్ట్ గా నా కొడుకుతో రాజకీయ పోరాటం చేయండి అంటూ సవాళు విసిరారు.
కాగా… గతంలో ఒంగోలులో ఓ ఫంక్షన్ కు వెళ్లి వస్తున్న క్రమంలో వైస్ విజయమ్మ కారు రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. అప్పటి ఘటనకు తాలుకూ వీడియోను తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసిన టీడీపీ సోషల్ మీడియా.. ఇందులో కుట్ర కోణం ఉందంటూ వ్యాఖ్యానించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలంటూ డిమాండ్ చేసింది. దాంతో.. ఆ వార్తలు వైరల్ గా మారాయి. వాటిపై స్పందించిన వైఎస్ విజయమ్మ.. అలాంటి ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. తాను.. అమెరికాలోని తన మనుమడి దగ్గరకు వెళితే, జగన్ కి భయపడి విదేశాలకు వెళ్లినట్లు జరిగిన ప్రచారాన్ని ఖండించిన విజయమ్మ.. దానిని నీతిమాలిన చర్యగా అభివర్ణించారు.