తమ ఇల్లు ఆనందంతో, సంపదతో, భోగభాగ్యాలతో నిండి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇంట్లో సానుకూల శక్తులు ఉండాలని, నెగటివ్ ఎనర్జీ బయటికి పోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తారు. మీ ఇల్లు ఆనందంతో నిండి ఉండాలంటే ప్రతిరోజూ ఆరు మంత్రాలను కచ్చితంగా జపించడం అలవాటుగా మార్చుకోండి. ఉదయం, సాయంత్రం ఈ ఆరుమంత్రాలను జపించడం ద్వారా మీ ఇంటికి ఆనందాన్ని, సంపదను ఆహ్వానించవచ్చు. నెగిటివ్ ఎనర్జీని తొలగించవచ్చు. ఆ ఆరు మంత్రాలు ఇక్కడ ఇచ్చాము. వీటిని ప్రతిరోజూ పఠించేందకు ప్రయత్నించండి.
ఓం
‘ఓం’ అని జపించేందుకు సందర్భం, సమయం అవసరం లేదు. వీలైనప్పుడల్లా కూడా ఈ ఓం శబ్దాన్ని జపిస్తూ ఉండండి. ఇది విశ్వంలోనే ఆదిమ శబ్దంగా చెప్పుకుంటారు. జీవమంతా ఉనికిలోకి వచ్చిన కంపనం ఓం శబ్దంలోనే నిండి ఉందని అంటారు. ‘ఓం’ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల మీరు అని అంతర్గత శక్తి కూడా పెరుగుతుంది. మీ శరీరం, మనస్సు తేలిక పడతాయి. ప్రతిరోజూ 108 సార్లు ఓం మంత్రాన్ని జపించేందుకు ప్రయత్నించండి. మీ మెదడును కేంద్రీకరించి ఏకాగ్రతతో ఈ ఓం మంత్రాన్ని జపిస్తే మీలో అంతర్గత శక్తి మేల్కొన్నట్టు అనిపిస్తుంది. మీ ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీ ఇంట్లో సానుకూలత, ప్రశాంతత, ఆనందం కనిపిస్తుంది.
గణేష్ మంత్రం
వక్రతుండ మహాకాయ
సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవా
సర్వకార్యేషు సర్వదా
చాలా సరళమైన పదాలతో కూడిన వినాయక మంత్రం ఇది. ఈ మంత్రానికి అర్థం… శక్తివంతమైన శరీరం, కోటి సూర్యుల వలే ప్రకాశవంతమైన గణేష్ని ప్రార్థిస్తున్నాను, నా మార్గం నుండి అన్ని అడ్డంకులు తొలగించి, నేను చేసే ప్రతి పనిలో విజయం సాధించేలా ఆశీర్వదించమని ఆ గణేషుడిని వేడుకుంటున్నాను అని అర్థం. ప్రతిరోజూ ఈ గణేష్ మంత్రాన్ని జపించడం వల్ల మీకు పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. డబ్బు, సంపద, సమృద్ధిని ఆ లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. మీరు అనుకున్న పనులు నెరవేరితే కచ్చితంగా సంపద చేకూరుతుంది. ప్రతిరోజూ 20 సార్లు ఈ మంత్రాన్ని జపించేందుకు ప్రయత్నించండి. మీలోని, మీ ఇంట్లోని ప్రతికూలతలు తొలగిపోతాయి.
లక్ష్మీదేవి మంత్రం
ఓం శ్రీ మహాలక్ష్మ్యై చ విద్మహే
విష్ణు పత్న్యై చ ధీమహి
తన్నో లక్ష్మీ ప్రచోదయాత్
లక్ష్మీదేవి సులభమైన మంత్రాలలో ఇది ఒకటి. ఆమె భక్తులకు సంపద, శ్రేయస్సును అందించే అధిదేవత. ఈ లక్ష్మీదేవి మంత్రాన్ని ప్రతిరోజూ ఉదయం జపించడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆమె ఆశీర్వాదం భక్తులకు లభిస్తుంది. ఉదయం లేచాక ఇంటిని శుభ్రం చేసి స్నానాదులు చేసి లక్ష్మీదేవి పటం ముందు కూర్చొని ఈ మంత్రాన్ని హృదయపూర్వకంగా జపించాలి.
ఓం గం గణపతయే నమః
గణపతిని ఆరాధించే మంత్రం ఇది. కొత్త పనిని ప్రారంభించేటప్పుడు కచ్చితంగా ఈ మంత్రాన్ని జపించాలి. ఇది శక్తిని ఆకర్షించడంలో సహాయపడుతుంది. మీ మార్గంలోని అడ్డంకులను తొలగించేందుకు సహకరిస్తుంది. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా భక్తులు గణేశుడు శక్తిని, జ్ఞానాన్ని పొందగలుగుతారు.
హ్రీం శ్రీం
ఓం హ్రీం శ్రీం లక్ష్మీ భ్యో నమః… ఇది లక్ష్మీదేవి మంత్రం. ఇది ఎంతో శక్తివంతమైన మంత్రంగా చెప్పుకుంటారు. మీ ఇంటికి సమృద్ధిగా సంపద వచ్చేందుకు ఆ లక్ష్మీదేవిని ఈ మంత్రంతో పూజిస్తే ఎంతో మంచిది. దీన్ని బీజమంత్రంగా కూడా పిలుస్తారు. మీకు విజయాన్ని మీ ఇంటికి రక్షణను అందించేందుకు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ప్రతిరోజు 108 సార్లు ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది.
కుబేర మంత్రం
ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమహ
ఐశ్వర్యం సంపదకు అది దేవుడు కుబేరుడు. అతని కోసం ప్రతి రోజు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. కుబేరుడు నుంచి డబ్బులు ఆకర్షించేందుకు ఈ మంత్రం ఎంతో సహాయపడుతుంది. ఆర్థిక భారాలు, రుణాలు తొలగించేందుకు కూడా సహాయపడుతుంది. మీ డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోతే ఈ కుబేర మంత్రాన్ని ప్రతిరోజూ జపించడం వల్ల ఆ అప్పును మీరు రాబట్టుకోగలరు.