⦿ రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే
⦿ రంగంలోకి సుమారు లక్ష మంది సిబ్బంది
⦿ 75 ప్రశ్నలతో సులభమైన ప్రశ్నావళి రెడీ
⦿ ఏ రోజు డేటా ఆ రోజే ఆన్‌లైన్‌లోకి
⦿ జిల్లా స్థాయిలో కలెక్టర్ల పర్యవేక్షణ
⦿ నెలాఖరు వరకు సాగనున్న సర్వే
⦿ ఇంట్లో ఒక్కరున్నా డేటా ఇవ్వొచ్చు
⦿ గత ఎన్నికల వేళ సర్వేపై కాంగ్రెస్ హామీ
⦿ సామాజిక సాధికారతే లక్ష్యంగా సర్వే
⦿ హర్షం వ్యక్తం చేస్తున్న బీసీ సంఘాలు
హైదరాబాద్, స్వేచ్ఛ: Caste Census Survey: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఇంటింటి సర్వేకు రంగం సిద్ధమైంది. సుమారు 85 వేల మంది ఎన్యుమరేటర్లు, 10 వేల మంది సూపర్‌వైజర్లు నేటి నుంచి ఈ ఇంటింటి సర్వేలో పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఇంటింటి సర్వేతో కులగణనను చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే 2011 జనాభా లెక్కలకు అనుగుణంగానే సర్వే రూట్ మ్యాప్‌ను సర్కారు ఇప్పటికే రెడీ చేయటంతో బాటు సిబ్బందిని, అధికారులను నియమించింది. నేటి నుంచి నెలాఖరు వరకు నిరంతరాయంగా ఈ ప్రక్రియ కొనసాగనున్నది. సర్వే అనంతరం ఇంటింటికీ స్టిక్కర్అంటించి, సేకరించిన సమాచారాన్ని ఏరోజుకారోజు వివరాలను ఆన్‌లైన్ చేయనున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఈ సర్వేను పర్యవేక్షిస్తారు.
పక్కాగా లెక్క..
ప్రతి ఇంటిలోని కుటుంబ సభ్యులను సర్వే చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆయా ప్రాంతాలలోని జనాభాను బట్టి అక్కడ సిబ్బందిని నియమించారు. ఎన్యూమరేటర్ రోజువారీగా తనకిచ్చిన షెడ్యూల్ ప్రకారం సర్వే పూర్తయ్యే వరకు పనిచేస్తారు. నేటి నుంచి జరిగే ఈ సర్వేలో ప్రతి కుటుంబ యజమానిని నేరుగా ఎన్యుమరేటర్ కలిసి వివరాలు సేకరిస్తారు. యజమాని లేకుంటే తగిన ఆధారాలు చెప్పే ఏ కుటుంబ సభ్యుడున్నా సరిపోతుంది. ఇలా సేకరించిన సమాచారం మొత్తం ఈ నెల చివరి నాటికి ఆన్‌లైన్‌లో అప్లోడ్చేస్తారు. సర్వేలో భాగంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల, విద్య, ఉపాధి వంటి అంశాలను సేకరించనున్నారు. వివరాల సేకరణ అనంతరం సంబంధిత ఇళ్లకు స్టిక్కర్లు అంటించనున్నారు. ఏ రోజు.. ఏ గ్రామంలో.. ఏ వార్డులో.. ఏ సమయంలో.. సర్వే చేయపట్టనున్నారనే సమాచారాన్ని ముందే ఆయా ప్రాంతాల్లోని వారికి చాటింపు, మైకుల్లో ప్రచారం ద్వారా తెలియజేస్తారు. సర్వేలో భాగంగా ఎలాంటి ఫొటోలు, గుర్తింపు పత్రాలు స్వీకరించరు.
సర్వే నిర్వహణ ఇలా
ఈ సర్వే కోసం 7 పేజీలతో రూపొందించిన ప్రశ్నావళిలో మొత్తం రెండు భాగాలలో 75 ప్రశ్నలు ఉంటాయి. వీటి నుంచి సమాచారం సేకరిస్తారు. ఇందులో 56 ప్రధాన ప్రశ్నలు ఉండగా, మరో 19 అనుబంధ ప్రశ్నలు. పార్టు-1లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలుంటాయి. అంటే సాధారణ, విద్య, ఉద్యోగ, ఉపాధి, భూములు, రిజర్వేషన్ ప్రయోజనాలు, వలసలు, రాజకీయ సమాచారం సేకరిస్తారు. అలాగే పార్టు-2లో కుటుంబ వివరాలను సేకరిస్తారు. ఇందులో మొత్తం 17 ప్రశ్నల్లో 7 ప్రధాన ప్రశ్నలు ఉండగా, మిగిలినవి అనుబంధ ప్రశ్నలు. భూమి వివరాలు సేకరించే క్రమంలో ధరణి పట్టా నెంబరు, భూముల వివరాలు మెట్ట, తరి, పడావు వంటి భూమి రకం, ఎకరాలు గుంటల రూపంలో ఎన్యుమరేటర్‌కు చెప్పాలి.
సాగు విస్తీర్ణం వివరాలు అనగా నీటి పారుదల వనరు, కౌలు భూమి సాగు వివరాలు చెప్పాలి. విద్యా, ఉద్యోగ పరంగా రిజర్వేషన్ విధానంతో ప్రయోజనం పొందినా, గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన పథకాలు, ఆ వివరాలు నమోదు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రాలు పొందారా? అనేవి పొందుపర్చుతారు. సర్వేలో భాగంగా ప్రస్తుతం చేసే పని, ఉద్యోగం, వృత్తి, ఉపాధి సమాచారాన్ని సిబ్బందికి ఇవ్వాలి. వార్షికాదాయం, ఒకవేళ వ్యాపారులైతే వార్షిక టర్నోవర్ తెలియజేయాలి. కులవృత్తులయితే ఆ వృత్తి కొనసాగిస్తున్నారా? లేదా? అని రాయాలి. కుల వృత్తితో కలిగిన వ్యాధి (ఉంటేనే) చెప్పాలి. ఆదాయ పన్ను చెల్లింపుదారులా? అవునా, కాదా చెప్పాలి. బ్యాంకు ఖాతా ఉందా, లేదా తెలియజేయాలి.
నాటి సర్వేలోని ప్రశ్నలే..
2014 ఆగస్టు-19న నాటి కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ద్వారా రాష్ట్రంలోని కోటి గృహాలు, 3.68 కోట్ల జనాభాకు సంబంధించి ఆర్థిక సామాజిక వివరాలన్నీ సేకరించింది. పదేళ్ల కిత్రం నిర్వహించిన నాటి సర్వేలో 8 అంశాలకు సంబంధించి 94 ప్రశ్నలకు సమాధానాలు సేకరించారు. అప్పటితో పోలిస్తే కులగణన సర్వేలో దాదాపు 90శాతం ప్రశ్నలు మళ్లీ పునరావృతం అయ్యాయి. కుటుంబసభ్యుల అనారోగ్య వివరాలు అందులో ఉండగా.. ఇప్పుడు కులాలకు సంబంధించిన ప్రశ్నలు అదనంగా ఉన్నాయి. గతంలో ఆధార్ వివరాల నమోదు తప్పనిసరి చేయగా.. ఇప్పుడు ఆప్షనల్‌గా ఉంచారు. దీంతో ఈ సర్వేతో ఎలాంటి ప్రమాదం లేదని, ఈ సర్వే విషయంలో విపక్షాలు చేస్తున్న సర్వే గురించి అనవసరంగా భయపడొద్దని బీసీ సంఘాల నేతలు సూచిస్తున్నారు.
ఏకమైన కుల సంఘాలు…
బీసీ కులగణన నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణలోని బీసీ కుల సంఘాలన్నీ ఏకమయ్యాయి. కులగణన పక్కాగా పారదర్శకంగా జరిగేలా చూడడానికి తమ వంతుగా గణన జరిగేంత కాలం నిరంతర నిఘా వేసి ఉంచాలనే నిర్ణయానికి వచ్చాయి. ఈ మేరకు కులసంఘాల నాయకులు ఏర్పాట్లు చేసుకున్నారు. అంతే కాకుండా బీసీ కులగణన వల్ల కలిగే ప్రయోజనాలు, కులగణనలో భాగస్వాములు కావలసిన ఆవశ్యకత గురించి బీసీలకు అవగాహన కలిగిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే గ్రామ, మండల, జిల్లా స్థాయిలో సమావేశాలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో బీసీ విద్యావంతులు, కుల సంఘాల ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహిస్తూ అవగాహనను కలిగిస్తున్నారు.
Also Read: Rahul In HYD : తెలంగాణ కుల సర్వే దేశానికి ఓ దిక్సూచీ.. రాహుల్ ఆసక్తికర కామెంట్లు..
నెలాఖరుకు పూర్తి..
నేడు ప్రారంభమయ్యే ఈ సర్వేను ఈనెల 30వ తేదీలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్‌వైజర్‌ను ప్రభుత్వం నియమించింది. సర్వే జరిగే ప్రతి గ్రామంలో ముందుగా డప్పు చాటింపు వేయించాలని, సర్వే నిర్వహించే సమయంలో కలెక్టర్‌లు క్షేత్రస్థాయిలో తిరిగి తనిఖీలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇటు గ్రేటర్ పరిధిలో 21 వేల మంది ఎన్యుమరేటర్‌లను ప్రభుత్వం వినియోగించుకుంటుంది.