India – Canada : కెనడా – భారత్ మధ్య దౌత్య ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రమౌతున్నాయి. ఇప్పటికే.. భారత్ పై అనేక అసత్య ఆరోపణలు చేస్తున్న కెనడా, ఇప్పుడు ఏకంగా భారత హోం మంత్రి అమిత్ షా పై తీవ్ర ఆరోపణలు చేసింది. కెనడాలోని సిక్కు వేర్పాటువాదులను ఆ దేశంలో అంతం చేసేందుకు జరుగుతున్న కుట్రల వెనుక భారత హోం మంత్రి అమిత్ షా ఉన్నారంటూ వ్యాఖ్యానించింది. కెనడా డిప్యూటీ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ డేవిడ్ మారిసన్.. ఆ దేశ పార్లమెంటరీ ప్యానల్ ముందు ఈ వ్యాఖ్యలు చేశారు.
దీనిపై ఆగ్రహించిన భారత్.. కెనడా హైకమిషన్ పిలిపించి నిరసన తెలిపింది. కెనడా నేతల విమర్శలపై సమన్లు జారీ చేసిన భారత విదేశాంగ శాఖ.. ఇలాంటి నిరాధార ఆరోపణల వల్ల ఇరుదేశాల దౌత్య సంబంధాలకు ప్రమాదమని హెచ్చరించింది. ఇలాంటి తప్పుడు విధానాలు ఇరు దేశాలకు మంచిది కాదని నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రముఖ ఆంగ్ల పత్రిక రాయిటర్స్ రిపోర్ట్ కెనడాలోని సిక్కువేర్పాటువాదులపై కుట్రలో యూనియన్ మినిస్టర్ అమీత్ షా ఉన్నారంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. దీన్ని ఆధారంగా చేసుకుని.. కెనడా రాజకీయ నేతలు, నాయకులు.. ఇష్టారీతిన కామెంట్లు చేస్తున్నారు. వీటిపై భారత్ అనేక రకాలుగా నిరసనలు తెలుపుతోంది.
భారత్ – కెనడా సంబంధాలు కొన్ని నెలలుగా తీవ్ర ఒడిదొడుకులకు గురవుతున్నాయి. త్వరలోనే అక్కడ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. కెనడాలో స్థిరపడిన సిక్కుల ఓట్లు పొందేందుకు భారత్ తో నిత్యం ఘర్షణ పెట్టుకుంటోంది. అమిత్ షా పై కెనడా ప్రభుత్వ ఆరోపణలపై స్పందించిన అమెరికా.. ఆ వ్యాఖ్యలను పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. ఆ ఆరోపణల గురించి కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగిస్తామని ప్రకటించింది.
Also Read : కెనడాలో హిందూ దేవాలయంపై దాడి, ప్రధాని మోడీ తీవ్ర ఆగ్రహం!
గత ఏడాది జూన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను హతలో భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన తర్వాత భారత్ – కెనడా మధ్య దౌత్య సంబంధాలు బాగా క్షీణించాయి. గత నెలలో.. నిజ్జర్ హత్యపై దర్యాప్తులో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందంటూ తీవ్ర ఆరోపణలకు దిగిన వేళ… భారత్ ఆదేశంలోని భారత హై కమిషనర్ సంజయ్ వర్మను వెనక్కి పిలిపించింది. దాంతో పాటే ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించింది.