YCP Leaders: పాపం అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి అనే తీరులో వైసీపీ దుందుడుకు చర్యలు ఉన్నాయంటూ టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇటీవల రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా, అక్కడ వైసీపీ నేతలు వాలిపోయి, ప్రభుత్వంపై తెగ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈసారి వైసీపీ చేసిన తొందరపాటు చర్యతో, అడ్డంగా దొరికిపోయిందని టీడీపీ విమర్శిస్తోంది. అక్కడ జరిగింది కేవలం దాడి, కానీ వైసీపీ అధికారిక ట్విట్టర్ లో ఏకంగా అత్యాచారం అంటూ పోస్ట్ చేయడంతో అసలు విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు, ఇప్పుడు చిన్నగా సైలెంట్ అయిపోతున్నారని స్థానికుల టాక్.
అసలేం జరిగిందంటే..
తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెంలో పదోతరగతి విద్యార్థినిని ఇద్దరు దుండగులు అత్యాచారం చేశారంటూ, అది కూడా ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారని నిన్న సాయంత్రం వైసీపీ తన అధికారిక ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది. అప్పటికే ఈ కేసుకు సంబంధించి, అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. దర్యాప్తు వేగవంతం చేశారు. తెల్లారిందో కాలేదో వైసీపీ నేతలు ఒక్కొకరుగా ఆ బాలిక గల తిరుపతి రుయా వైద్యశాల వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనకు ప్రభుత్వం భాధ్యత వహించాలి. సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ కూడా చేశారు. ఓ వైపు పోలీసుల దర్యాప్తు సాగుతోంది, మరోవైపు వైసీపీ నేతలు అత్యాచారం జరిగిందంటూ విస్తృత ప్రచారం చేసేస్తున్నారు.
బొక్క బోర్లా పడ్డ వైసీపీ..
ఇలా అత్యాచారం జరిగిందని వైసీపీ ప్రకటనల జోరు సాగిస్తుండగా, అప్పుడే అసలు విషయం తెలిసింది వైసీపీ నేతలకు. ఏకంగా బాలిక తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. తన బిడ్డ కేవలం దాడికి యత్నించారని చెప్పిందని, రాజకీయ స్వార్థం కోసం తమ కుటుంబాన్ని వాడుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అలాగే ఇలా అబద్ధపు ప్రచారం చేస్తున్న వారిని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అంతేకాదు సదరు బాలిక కూడా జరిగిన అసలు విషయాన్ని పోలీసులకు తెలిపింది. వ్యక్తిగత కారణాలతో దాడి జరిగిందని, అత్యాచారం అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని పోలీసులు కూడా ధ్రువీకరించారు. ఎస్పీ సుబ్బారాయుడు ఘటనపై స్పందిస్తూ.. పాప మైనర్ కావడంతో విచారణ కోసం వైద్యశాలకు తరలించామని, తాము గానీ, పాప తల్లిదండ్రులు చెప్పకుండానే లేనిపోని వార్తలు ఎలా రాస్తారంటూ ప్రశ్నించారు. దాడికి పాల్పడ్డ వారు ఇప్పటికే తమ అదుపులో ఉన్నారని, పాపపై కేవలం దాడి జరిగిందంటూ ప్రకటించారు.
తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెంలో దారుణం
పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఇద్దరు దుండగులు అత్యాచారం
పాఠశాల నుంచి ఇంటికి ఒంటరిగా వెళ్తున్న సమయంలో అడ్డగించి ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం
ఇంకెంత మంది ఆడబిడ్డలు మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి బలవ్వాలి @ncbn, హోం మంత్రి… pic.twitter.com/Pz1oMUwEH9
— YSR Congress Party (@YSRCParty) November 4, 2024
ఇక అంతే అక్కడికి గుమికూడిన వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా ఈ విషయంలో సైలెంట్ గా జారుకున్నారని స్థానికులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున నెట్టేయడంలో ఉన్న శ్రద్ధ, ప్రజలపై వైసీపీ నేతలకు చీమంత భాధ్యత లేదని, అసలు అత్యాచారమంటూ ఎలా నిర్ధారించారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నిన్నటి నుండి వైసీపీ అత్యాచారమంటూ ముమ్మర ప్రచారం చేసిందని, ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లు ఈ విషయాన్ని రాద్దాంతం చేయాలని ప్రయత్నించి చివరికి నాలుక కరుచుకున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. ఏదిఏమైనా ఒక మైనర్ బాలికపై జరిగిన దాడిని, అదే పనిగా అత్యాచారం జరిగిందంటూ వైసీపీ సోషల్ మీడియా విస్తృత ప్రచారం చేసి, ఆ కుటుంబ పరువును బజారుకు ఈడ్చిందని, వైసీపీ కాస్త వై చీప్.. అయిందంటూ టీడీపీ ఎదురుదాడికి దిగింది.