iPhone Safety : యాపిల్ ఐఫోన్ 14 ప్రో (Apple iphone 14 Pro) ఛార్జింగ్ సమయంలో పేలిపోవటం (iphone Explodes)తో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన చైనాలోని షాంక్సీలో చోటుచేసుకుంది. అయితే ఐఫోన్స్ పేలటం ఇది మెుదటిసారి కాదు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరగటంతో సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. కాగా ఈ ఘటనపై యాపిల్ కంపెనీ సైతం స్పందించింది.
యాపిల్.. ఈ పేరు ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కంపెనీ నుంచి ఐపాడ్స్, మ్యాక్ బుక్, ఐపాడ్ మినీ లాంటి గ్యాడ్జెట్స్ ఎన్ని వచ్చినా ఐఫోన్స్ కు ఉండే డిమాండ్ వేరు. ప్రతీ ఒక్కరూ కొనాలనుకునే స్మార్ట్ ఫోన్ ఐఫోన్. భద్రతతో పాటు స్టైలిష్ లుక్ తో వచ్చే ఈ ఫోన్స్ ధర కాస్త ఎక్కువైనా కస్టమర్స్ నుంచి క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గదు. ఇక తాజాగా ఈ ఫోన్ భద్రతపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. కారణం.. చైనా లోని షాంక్సీలో ఓ మహిళ కొనుగోలు చేసిన ఐఫోన్ పేలిపోయింది. చైనాకు చెందిన షాంక్సీ టీవీ ఛానల్ తెలిపిన వివరాల ప్రకారం… ఇంట్లో ఐఫోన్ 14కు ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఒక్కసారిగా మంటలు రావటంతో ఏం చేయాలో తెలియని మహిళ మంటలు ఆర్పటానికి ఆ ఫోన్ ను పట్టుకోవటంతో ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బాధిత మహిళ చేతులతో పాటు శరీర భాగాలకి గాయాలయ్యాయి. కాగా ఈ ఐఫోన్ ను 2022లో కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.
ఫోన్ పేలటానికి కారణం –
ఐఫోన్ పేలటానికి అసలు కారణం బ్యాటరీగా తెలుస్తుంది. ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు జరిగినట్లు వెల్లడించింది షాంక్సీ టీవీ.
యాపిల్ స్పందన ఇదే –
ఈ ఘటనపై స్పందించిన యాపిల్ కంపెనీ ఫోన్ కు వారంటీ ఉంటుందని.. తప్పకుండా నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపింది. ఫోన్ బ్యాక్ సైడ్ ఉండే వారంటీ ఫోటో పంపాలని కోరింది. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని.. సేఫ్టీ మరింత మెరుగుపరుస్తామని తెలిపింది.
యాపిల్ సేఫ్టీ –
ఐఫోన్స్ పేలటం ఇది మొదటి సారి మాత్రమే కాదు. ఇలాంటి ఘటనలు గతంలో సైతం చాలా జరిగాయి. 2021 జులైలో ఓ మహిళ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి రాత్రంతా వదిలేయడంతో ఫోన్ పేలిపోయింది. ఈ ఘటనలో సైతం ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఇలాంటి ఘటనే 2022 జనవరి 28న జరిగింది. ఐఫోన్ చార్జింగ్ పెట్టిన సమయంలో పేలిపోవడంతో ఇంట్లో ఉన్న సోఫా తో పాటు బెడ్ సైతం కాలిపోయాయి.
కాస్త జాగ్రత్త తప్పనిసరి –
ఐఫోన్స్ తో పాటు ఎలాంటి ఫోన్స్ అయినా తేలికగా పేలే అవకాశం ఉంటుందన్న విషయాన్ని కచ్చితంగా గుర్తించాలి. ముఖ్యంగా ఛార్జింగ్ పెట్టిన సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాత్రంతా ఫోన్ కు ఛార్జింగ్ పెట్టి వదిలేయటం, ఫోన్ ను ఎండలో ఉంచటం, తడిచిన ఫోన్స్ కు వెంటనే ఛార్జింగ్ పెట్టటంవంటివి చేయకూడదు. ఫోన్ బ్యాటరీ పరిమితి, ఎక్స్పైరీ డేట్ వంటివి అప్పటికప్పుడు చెక్ చేసుకోవటం చేస్తే ఇలాంటి ప్రమాదాలు చాలా వరకూ తగ్గుతాయి.
Share