Salman Khan Receives another Threat.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ను చంపేస్తామని మరోసారి బెదిరింపులు రావడం కలకలం సృష్టిస్తోంది. లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi)గ్యాంగ్ నుంచి ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఈ బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది. సల్మాన్ ఖాన్ కు వారు రెండు ఆప్షన్ లు కూడా ఇచ్చినట్లు సమాచారం. ఏదైనా ఒక గుడికి వెళ్లి దేవుడిని క్షమాపణలు కోరడం లేదా రూ.5 కోట్లు ఇవ్వడం. ఈ రెండింటిలో ఏదో ఒకటి కచ్చితంగా చేయాలని డిమాండ్ చేశారట. ఇకపోతే ఈ వారంలో సల్మాన్ ఖాన్ బెదిరింపులు ఎదుర్కోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ విషయం తెలిసి అభిమానులు సైతం రకరకాల కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.
మళ్లీ బెదిరింపులు ఎదుర్కొన్న సల్మాన్ ఖాన్..
అసలు విషయంలోకెళితే సల్మాన్ ఖాన్ కు దుండగులు ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కి చెందిన వాట్సప్ నెంబర్ కి సోమవారం అర్ధరాత్రి తర్వాత ఒక మెసేజ్ పంపించారు.. ఆ మెసేజ్ లో ఉన్న సారాంశం విషయానికి వస్తే.. ” నేను లారెన్స్ బిష్ణోయ్ సోదరుడిని. సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలి అంటే అతడు కచ్చితంగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. లేదంటే రూ .5కోట్లు ఇవ్వాలి. ఈ రెండు జరగని పక్షంలో మేము అతడిని చంపేస్తాం. మా గ్యాంగ్ ఇంకా క్రియాశీలకంగానే ఉంది ” అంటూ ఆ మెసేజ్ లో పేర్కొన్నట్లు పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గతంలో కూడా బెదిరింపులు..
ఇకపోతే మరోవైపు అక్టోబర్ 30వ తేదీన కూడా సల్మాన్ ఖాన్ ను బెదిరిస్తూ ఇలాంటి మెసేజ్ వచ్చింది. రూ .2కోట్లు చెల్లించకపోతే నటుడిని చంపేస్తామని బెదిరించినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఇకపోతే ఈ కేస్ కు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇదిలా ఉండగా ఇంతకుముందు కూడా ఇదే తరహా బెదిరింపులు వచ్చాయి. “లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో శత్రుత్వాన్ని ముగించుకోవాలి అంటే సల్మాన్ ఖాన్ రూ .5కోట్లు ఇవ్వాలి.. లేదంటే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ హత్య కంటే దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది” అంటూ కిరాతకులు మెసేజ్ పంపారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ లో కూడా సల్మాన్ ఖాన్ ఇలాంటి బెదిరింపులు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా ఆయన నివాసం ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.అంతకుముందు పన్వేల్ ఫామ్ హౌస్ లోకి చొరబడేందుకు కూడా ప్రయత్నించారు. ఇకపోతే సల్మాన్ ఖాన్ భద్రత రీత్యా మహారాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది భద్రతను కూడా పెంచింది. అటు సల్మాన్ ఖాన్ కూడా లైసెన్స్డ్ రివాల్వర్ తో పాటు రూ .2కోట్లు విలువైన బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా కొనుగోలు చేశారు. అంతేకాదు బిగ్ బాస్ హిందీ సీజన్ 18 కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్ ఏకంగా 16 మంది భద్రత బలగాల మధ్య హోస్ట్ గా కార్యక్రమాన్ని నడుపుతున్నారు. ఏది ఏమైనా సల్మాన్ ఖాన్ దినదినం గండంగా గడుపుతున్నారని చెప్పవచ్చు.