బ్రోకోలి క్రూసిఫెరస్ జాతికి చెందిన ఆకుకూర. కాలీఫ్లవర్, క్యాబేజీ కూడా ఇదే జాతికి చెందినది. ఆకుపచ్చగా ఉండే కాలీఫ్లవర్ లా కనిపిస్తుంది బ్రోకోలి. దీన్ని తినడం వల్ల క్యాన్సర్‌ను అడ్డుకునే సత్తా వస్తుందని ఒక అధ్యయనం చెబుతోంది.
ఓరేగాన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అధ్యయనాన్ని నిర్వహించారు. రోజువారీ ఆహారంలో ఎంతో కొంత బ్రకోలీని తీసుకుంటే భవిష్యత్తులో క్యాన్సర్‌ను అడ్డుకునే శక్తి శరీరానికి వస్తుందని చెబుతున్నారు. బ్రోకోలీలో సల్ఫోరాఫేన్ అనే పదార్థం ఉంటుంది. ఇది యాంటీ క్యాన్సర్ కారకంగా పనిచేస్తుందని ఈ అధ్యయనంలో తెలిసింది. ముఖ్యంగా మహిళలు బ్రకోలీని తినడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఎవరైతే ఒక కప్పు బ్రొకోలీ మొలకలు ప్రతిరోజూ తింటారో వారిలో క్యాన్సర్ కణాల పెరుగుదల ఉండదని వివరిస్తున్నారు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన మహిళలు బ్రకోలీని ప్రతిరోజూ తినడం వల్ల వారిలో అదనంగా క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికట్టినట్టు గుర్తించారు.
సల్ఫోరాఫేన్ అనేది బ్రకోలీ వంటి ఆకుకూరల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఇది డిఎన్ఏ లో మ్యుటేషన్‌ను అడ్డుకుంటుంది. దీనివల్ల క్యాన్సర్ రాకుండా అడ్డుకట్ట వేస్తుంది. బ్రకోలీ తినని వారితో పోలిస్తే బ్రకోలీ తినేవారిలో క్యాన్సర్లు వచ్చే ప్రమాదం చాలా తగ్గినట్టు అధ్యయనం నిరూపించండి. అయితే బ్రకోలీ క్యాన్సర్ పై ఎంతగా ప్రభావంతంగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు మరింత లోతైన అధ్యయనం అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. ఈ బ్రకోలీని తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు అలాగే జన్యుపరంగా వచ్చే వ్యాధులను కూడా అడ్డుకోవచ్చని అధ్యయనం వివరిస్తుంది.
బ్రకోలీ రోమన్ సామ్రాజ్యంలో అధికంగా తినేవారని చెప్పుకుంటారు. తరువాత అమెరికాలోని రైతులు 1920 నుంచి పండించడం మొదలుపెట్టారు. ఇది క్యాబేజీలాంటి రుచిని అందిస్తుంది. బ్రోకలీలో కేలరీలు చాలా తక్కువ. కాబట్టి దీన్ని అధికంగా తిన్నా కూడా బరువు పెరగరు. ఇందులో కొవ్వు శాతం సున్నా. అంటే బ్రోకోలీ వల్ల శరీరంలో కొవ్వు చేరదు. ప్రొటీన్ ఒక గ్రాము వరకు లభిస్తుంది. అన్నట్టు బ్రోకలీలో నారింజ పండులో ఉన్నంత విటమిన్ సి ఉంటుంది. కాబట్టి ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.