EPAPER

US Presidential Elections 2024: సర్వేల్లో తేలిందేంటి? గెలుపు ఎవర్ని వరించబోతుంది?

US Presidential Elections 2024: సర్వేల్లో తేలిందేంటి? గెలుపు ఎవర్ని వరించబోతుంది?

జాతీయ సర్వేల సగటును బట్టి ట్రంప్ కంటే కమల ముందంజ

ఇంత హీట్ రేపుతున్న అమెరికా ఎన్నికల్లో ఓటర్లు, తొలి మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకుంటారా? లేదంటే, రెండోసారి ట్రంప్‌కు అవకాశమిస్తారా? అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ప్రధాన ఎన్నికలు మరికొన్ని గంటల్లో జరగనుండగా.. వైట్‌హౌస్ రేసులో భాగంగా, ఇద్దరు అభ్యర్థులు ఇప్పటి వరకూ చేసిన ప్రచారం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అనే ఆసక్తి పెరిగింది. జాతీయ సర్వేల సగటును గమనిస్తే ట్రంప్ కంటే కమలా హారిస్ కాస్త ముందంజలో ఉన్నమాట వాస్తవం. జూలై చివర్లో అధ్యక్ష పదవి రేసులో హారిస్ అడుగుపెట్టినప్పటి నుంచి ఆమెదే పైచేయిగా ఉంది.


అయితే, తాజా గణాంకాల్లో కాస్త మార్పు కనిపించకపోలేదు. అయినప్పటికీ చాలా తక్కువ మార్జిన్‌తో హారిస్‌‌కు అనుకూలంగానే కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన తొలి వారాల్లో హారిస్ ప్రచారంలో గట్టి ప్రభావమే చూపించారు. ఆగస్టు చివరి నాటికి దాదాపు 4 శాతం పాయింట్ల ఆధిక్యతను సాధించారు. ఇక, సెప్టెంబర్ 10న ట్రంప్, హారిస్ మధ్య డిబేట్ తర్వాత కూడా ఈ నంబర్లలో పెద్ద తేడా కనిపించలేదు. అయితే, చివరి దఫా పోలింగ్‌ సమీపించే కొద్దీ వీరిద్దరి మధ్య మార్చిన్ కూడా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు, ఎవరు గెలుస్తారా అన్నది అంతుబట్టకుండా ఉంది.

2007లో ప్రారంభమైన అమెరికా గ్రేట్ రిసెషన్

స్వింగ్ స్టేట్స్‌లో ఎవరు ఎక్కువ ప్రభావం చూపగలిగితే వారిదే పైచేయి అనడంలో సందేహం లేదు. అయితే, ఏయే ఓటర్లకు ఏయే అంశాలు ప్రధానం అనేదానిపైన గెలుపోటములు ఆధారపడతాయని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. 2007లో ప్రారంభమైన అమెరికా గ్రేట్ రిసెషన్ తర్వాత ప్రతి అధ్యక్ష ఎన్నికల్లో ఆర్థిక సమస్యలు అధిక ప్రాధాన్యత పొందాయి. దీనికి తోడు, గత ఎన్నికల ఫలితాల తర్వాత వైట్ హౌస్ దగ్గర ట్రంప్ మద్దతుదారులు చేసిన రచ్చ కారణంగా.. ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదలైన పోల్‌లో ‘ప్రజాస్వామ్యం’ గురించిన ఆందోళనలు కూడా అధిక ప్రభావాన్ని చూపుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: మరికొద్ది గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఎలక్షన్ ప్రక్రియ ఎలా సాగుతుందంటే?

అయితే, ఒక సమస్య ముఖ్యమైనంత మాత్రాన అది మాత్రమే ఓటు వేయడానికి కారణం కాదన్నది కొందరి వాదన. వివిధ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు, వాటిని ప్రస్తావించే ప్రచార విధానం పోలింగ్‌లో ఎక్కువ ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. దీని ప్రకారం, అమెరికా వ్యాప్తంగా చూసుకుంటే, ఐదు ప్రధాన సమస్యలు ఈ ఓటింగ్‌పై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ, ఇమ్మిగ్రేషన్, తీవ్రవాదం-జాతీయ భద్రత, నేరాలు, పన్నులు.

ట్రంప్ కంటే 50 పాయింట్లకు పైగా హారిస్‌కు మద్దతు

ఇటీవల విడుదల చేసిన ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం, అమెరికన్ సమాజంలో పెరుగుతున్న తుపాకుల పాత్ర, జాతి, బానిసత్వ వారసత్వం వంటివి దశాబ్దాలుగా అమెరికన్ల మధ్య విభిన్న వాదనలకు దారితీస్తున్న అంశాలు. అమెరికాలోని నల్లజాతీయులపై బానిసత్వ వారసత్వం భారీ ప్రభావాన్ని చూపుతూనే ఉందని, అలాగే, ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన ప్రజల పట్ల అమెరికా సమానత్వ పోకడ అత్యవసరమని.. ట్రంప్ మద్దతుదారుల కంటే 50 పాయింట్లకు పైగా హారిస్ మద్దతుదారులు అనుకూలంగా ఉన్నారు. మరోవైపు, తుపాకీ భద్రతను పెంచుతుందని, దేశంలో నేర న్యాయ వ్యవస్థ తగినంత కఠినంగా లేదని హారిస్ మద్దతుదారుల కంటే 40 పాయింట్లకు పైగా ట్రంప్ మద్దతుదారులు సపోర్ట్ చేస్తున్నారు.

ప్రజల గురించి ఎవరు ఎక్కువ పట్టించుకుంటారంటే..

ఇక, ఈ ఎన్నికల ప్రచారానికి సంబంధించి.. ఇటీవల చివరి రోజుల్లో.. కమల హారిస్ మీడియా ప్రచారాలు, ట్రంప్ విలక్షణమైన ర్యాలీలు చాలా మంది దృష్టిని ఆకర్షించాయి. అయితే, ట్రంప్ బహిరంగ వ్యాఖ్యల్లో ‘అబద్ధాలు’ అనే పదం స్థిరంగా వినిపించింది. ముఖ్యంగా, ఈ ఎన్నికల్లో కీలకంగా మారిన వలసలు, అబార్షన్ హక్కులపై ట్రంప్ బైడెన్ ప్రభుత్వాన్ని నిందిస్తూ వచ్చారు. కట్ చేస్తే.. ట్రంప్‌ కంటే హారిస్‌ ప్రజల గురించి పట్టించుకుంటారని 43% శాతం మంది అంటుంటే.. ఈ విషయంలో ట్రంప్‌ను 37% మంది మాత్రమే నమ్ముతున్నారు.

ఇక, వీళ్లద్దరిలో.. నిజాయితీపరులు, నమ్మదగినవాళ్లు ఎవరు అనే ప్రశ్నకు.. 41% మంది హారిస్‌‌కు మద్దతు ఇస్తుంటే.. 29% మాత్రమే ట్రంప్‌‌ను నిజాయితీపరుడని నమ్ముతున్నారు. ఇక, దేశ ప్రయోజనాలను కాపాడే విషయంలో కూడా 45% హారిస్‌‌ను ఎంచుకుంటే.. 39% ట్రంప్‌‌కు మద్దతు తెలుపుతున్నాయి. అలాగే, దేశానికి అవసరమైన మార్పును తీసుకురావడంలో 44% మంది ట్రంప్ కావాలని అంటుంటే.. 38% హారిస్ అవసరం అంటున్నారు. తాజాగా నమోదిత ఓటర్లతో సీఎన్‌ఎన్ చేసిన సర్వేలో.. హారిస్‌కు అనుకూలంగా 41% మంది ఉండగా ఆమెకు అననుకూలంగా 52% ఉన్నట్లు తెలిసింది. అదే ట్రంప్ విషయంలో అనుకూలంగా 41% ఉంటే అననుకూలంగా 54% మంది ఉన్నారు. ఇక్కడ కూడా ఫైట్ టైట్‌గానే కనిపించింది.

అరిజోనాలో హారిస్ కంటే ట్రంప్ 2 శాతం ఆధిక్యం

ప్రస్తుతానికైతే, స్వింగ్ స్టేట్స్‌లో కేవలం 2-3 శాతం పాయింట్ల తేడాతో కమల హారిస్, డొనాల్డ్ ట్రంప్‌లు ఆయా రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నారు. దీనిని బట్టే పోటీ ఎంత రసవత్తరంగా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఎవరు గెలుస్తారు అన్నది అంచనా వేయడం కష్టం కూడా. ఇప్పటికున్న అంచనాలను బట్టి చూస్తే.. కీలకమైన స్వీగ్ స్టేట్స్ నుండి అరిజోనాలో హారిస్ కంటే ట్రంప్ 2 శాతం ఆధిక్యంలో ఉన్నారు.

అయినప్పటికీ.. ఇక్కడ ఈసారి లాటిన్ ఓటర్లు పెరగడం, కాలిఫోర్నియా నుండి డెమొక్రాటిక్ పార్టీ మద్దతుదారులు వలస రావడంతో అక్కడి పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక, 1092 నుండి ఒక్కసారి కూడా డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయని జార్జియా గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో బైడెన్ వైపు మగ్గు చూపారు. ఇక్కడ 33 శాతం అమెరికన్ నల్లజాతీ ఓటర్లు ఉండటంతో హారిస్‌కు కలిసొస్తుందని భావిస్తున్నారు. అయితే, మిషిగన్‌ ఓటర్లు గతంలో బైడెన్‌కు మద్దతు పలికినప్పటికీ.. ఇజ్రాయెల్-గాజా యుద్ధంలో బైడెన్ ఎక్కువగా కలుగజేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం ఇక్కడ ట్రంప్‌కు కలిసొస్తుంది.

నెవాడాపై నమ్మకంగా ఉన్న రిపబ్లికన్లు

ఇక, ఈ ఎన్నికల్లో కీలకంగా మారిన నెవాడా 2004 నుండి రిపబ్లికన్లకు మద్దతు ఇవ్వలేదు. అయితే, ఈసారి హిస్పానిక్ ఓటర్ల మద్దతుతో ఆ రికార్డును తిరగరాయాలని రిబ్లికన్లు భావిస్తున్నారు. నిరుద్యోగం అధికంగా ఉన్న ఈ రాష్ట్రంలో ట్రంప్ పాపులర్ స్లోగన్ ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ పనిచేస్తుందని అనుకుంటున్నారు. మరోవైపు, గత రెండు ఎన్నికల్లో ట్రంప్ వైపు నిలిచిన నార్త్ కరోలినాలో ఈసారి గాలి మారిందనే వాదన ఉంది. ఇక్కడ ఆఫ్రో-అమెరికన్లు దాదాపు 22 శాతం ఉండగా.. వీరంతా కమల హారిస్‌కు మద్దతు ఇస్తారని డెమోక్రాట్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇటీవల నార్త్ కరోలినా తుఫాను ప్రభావం ఓటర్లను ప్రభావితం చేస్తుందనే భయం కూడా అధికార డెమొక్రాటిక్ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. ఇక, అత్యంత కీలకమైన పెన్సిల్వేనియాలో ఓటర్ల నాడి పట్టడం ఎవరి వల్లా కావట్లేదు. గ్రామీణ, పట్టణ శివారు ఓటర్లపై ట్రంప్ ఆశ పెట్టుకోగా.. పట్టణ ఓటర్లను హారిస్ ఆకర్షించే పనిలో ఉన్నారు. మరో కీలక రాష్ట్రం విస్కాన్సిన్ కూడా పరిస్థితి కూడా అంతే. నెక్ అండ్ నెక్ ఫైట్‌లో గెలుపు టైట్‌గా కనిపిస్తుంది.

22 శాతం ఉన్నఆఫ్రో-అమెరికన్లపై హారిస్‌ విశ్వాసం

అయితే, ఒక అభ్యర్థికి దేశవ్యాప్తంగా ఎంత ప్రజాదరణ ఉందో తెలుసుకోవడానికి జాతీయ సర్వేలు ఒక గైడ్‌లా ఉపయోగపడతాయి తప్ప.. ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి ఈ సర్వే ఫలితాలే ప్రామాణికంగా తీసుకోలేము. సర్వేల సగటు ఆధారంగా చూస్తే.. ఈ ఎన్నికల్లో స్వింగ్ స్టేట్స్‌గా పరిగణిస్తున్న 7 రాష్ట్రాల్లో పోటీ రసవత్తరంగా ఉంది. ఏ ఒక్క అభ్యర్థికి కూడా నిర్ణయాత్మక ఆధిక్యత కనిపించట్లేదు. అందులోనూ.. ఇప్పటి వరకూ అమెరికన్లు ఒక్కో అభ్యర్థిని రెండుసార్లు ఎన్నుకున్నారు. దీన్ని బట్టి, టంప్ర్‌ను మరోసారి ఎన్నుకుంటారా..? లేదంటే, కమలకు ఛాన్స్ ఇస్తారా? అనేది ఉత్కంఠను రేపుతోంది. ఏది ఏమైనప్పటికీ, ఈ ఉత్కంఠ తీరడానికి మరి కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. అప్పటి వరకూ వేచి చూస్తే.. అమెరికా ఎవరిదనేదీ తేలిపోతుంది.

 

Related News

BRS Leaders on KTR: నువ్వు చెప్తే వినాలా? కేటీఆర్‌కి మాజీ ఎమ్మెల్యేల ఝలక్

Penukonda Politics: చంద్రబాబుకి తలనొప్పిగా మామా కోడళ్ల పంచాయితీ

Vemireddy Prabhakar Reddy: నన్నే అవమానిస్తారా.. వేమిరెడ్డి టీటీపీకి హ్యాండ్ ఇస్తాడా..?

Alleti Maheshwar Reddy: సీఎం మార్పు.. ఏలేటి మాటల వెనుక ఆ మంత్రి స్కెచ్?

Caste Census: దేశవ్యాప్తంగా ఎంత మంది బీసీలు ఉన్నారు.. లెక్కలు నష్టమా? లాభమా?

Chandrababu Naidu: చంద్రబాబు సీరియస్.. ఆ మంత్రి పోస్ట్ ఊస్టేనా..?

Big Stories

×