BC Commission :
⦿ బీసీ రిజర్వేషన్లకై కమిషన్ ఏర్పాటు
⦿ సీఎం రేవంత్‌ను కలిసిన బీసీ సంఘాల నేతలు
⦿ ధన్యవాదాలు చెప్పి సన్మానించిన ఆర్ కృష్ణయ్య
⦿ సచివాలయంలో శ్రీధర్ బాబు చాంభర్‌లో కులగణన సమావేశం
హైదరాబాద్, స్వేచ్ఛ : జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఫిషర్ మెన్ కమిషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, బీసీ సంఘాల నేతలు కలిశారు. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపి, శాలువా కప్పి సన్మానించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు బీసీ సంఘాల నేతలు. అంతకుముందు, సచివాలయంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఛాంబర్‌లో కులగణన సమావేశం జరిగింది. కులగణనపై డెడికేటెడ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కమిషన్ సభ్యులను ప్రకటించనుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ఆర్ కృష్ణయ్య, మంత్రి శ్రీధర్ బాబును, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను సన్మానించారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆదివారం మంత్రులు, ముఖ్య అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డెడికేటెడ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. కులగణనపై ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే బీసీ సంఘాల నేతలు సీఎం, ప్రభుత్వ పెద్దలను కలిసి ధన్యావాదాలు చెప్పారు.
ALSO READ : అఘోరీ నాగ సాధువు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? వందల సంఖ్యలో అఘోరాలు రానున్నారా?