Actress Kasturi: తెలుగువారిపై నోటికొచ్చినట్లు మాట్లాడింది సినీ నటి కస్తూరి. తన వర్గాన్ని పొగిడే క్రమంలో.. తెలుగువారిని తక్కువ చేసి.. దిగజారుడు వ్యాఖ్యలు చేసింది. నిత్యం వివాదాల్లో నిలిచే ఈవిడ.. ఈసారి తెలుగువారినే కించపరిచేలా చేసిన కామెంట్స్‌పై.. తీవ్ర దుమారం రేగుతోంది. తెలుగింటి కోడలై ఉండి.. తెలుగు వారినే తక్కువ చేసేలా మాట్లాడటంపై రచ్చ నడుస్తోంది. తమిళనాడులోని తెలుగువారిని ఉద్దేశిస్తూ.. అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేసింది కస్తూరి. బ్రాహ్మణ సమ్మేళనంలో పాల్గొన్న ఆమె.. వారి గుర్తింపుని పోల్చే క్రమంలో.. తెలుగువారి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడేసింది. రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వారే.. తెలుగు వాళ్లని.. నీచమైన వ్యాఖ్యలు చేసింది కస్తూరి. అలా వచ్చినోళ్లంతా.. ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు.. వివాదాస్పదంగా మారాయ్.
300 ఏళ్ల కిందట.. ఓ రాజు దగ్గర అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగువారే ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే.. మరి శతాబ్దాలకు పూర్వమే ఇక్కడికొచ్చిన బ్రాహ్మణులను.. తమిళులు కాదని చెప్పడానికి మీరెవరంటూ.. పరోక్షంగా ద్రవిడ వాదులను ప్రశ్నించారు కస్తూరి. ప్రస్తుత.. తమిళనాడు సీఎం క్యాబినెట్‌లో ఉన్న ఐదుగురు మంత్రులు కూడా తెలుగు మూలాలు ఉన్నవారేనని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే.. తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో తెలుగు మాట్లాడే వాళ్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కస్తూరి తన ఆక్రోశాన్నంతా వెళ్లగక్కింది.
కస్తూరి వ్యాఖ్యలపై తెలుగు సంఘాలు మండిపడుతున్నాయ్. తమిళనాడులో తెలుగు మాట్లాడే ప్రజల్ని బానిసలతో పోల్చడంపై.. ఆవిడ తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. తెలుగువారిని తక్కువ చేస్తూ కస్తూరి మాట్లాడిన మాటలు.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయ్. కస్తూరి దిగజారుడు వ్యాఖ్యలపై.. బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పందించారు. తెలుగువారిపై ఆవిడ చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండించడంతో పాటు వెంటనే ఆమె చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
Also Read: చై-శోభిత పెళ్లి వేదిక ఇదే… ఈ సెలబ్రిటీలకు మాత్రమే ఆహ్వానం
తమిళనాడులో తెలుగువారిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో.. కస్తూరి తనని తాను సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాను మరో ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని.. తన మాటల్ని వక్రీకరించారని చెబుతూ.. ఎక్స్ వేదికగా ట్వీట్స్ చేశారు. తాను తెలుగువారిని అవమానించలేదన్నారు. తన కామెంట్స్‌పై విమర్శలు ఎక్కువవడంతో.. క్లారిటీ ఇస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తెలుగు నా మెట్టినిల్లు. తెలుగువారంతా నా కుటుంబం. ఇది తెలియని వాళ్లంతా.. నా వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ.. కస్తూరి ట్వీట్స్ చేశారు. డీఎంకే పార్టీ తన కామెంట్స్‌ని వక్రీకరిస్తోందని.. వాటిని తెలుగు ప్రజలు నమ్మొద్దని కోరారు. తనపై నెగెటివిటీ తీసుకొచ్చి.. తనను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని.. తెలుగు వారికి వ్యతిరేకంగా మాట్లాడానంటూ.. విష ప్రచారం చేస్తున్నారని కస్తూరి తన పోస్టుల్లో పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ.. అటు తమిళనాడులోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ.. కస్తూరి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది.
ఇప్పటికే తమిళనాడులో స్థిరపడిన అరుంథతియార్ సామాజికవర్గానికి చెందిన ఆంధ్రులపై.. నామ్ తమిళర్ కట్చి చీఫ్ కో-ఆర్డినేటర్ సీమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. విమర్శలు ఎదుర్కొంటున్నారు. పారిశుద్ధ్య పనులు చేసే వీళ్లు.. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చారని తక్కువ చేసిన మాట్లాడారు. దీనిపై కేసు కూడా నమోదైంది. కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు.. తమిళనాడులోని తెలుగువారిని ఉద్దేశిస్తూ.. కస్తూరి చేసిన అనుచిత వ్యాఖ్యల మరింత దుమారం రేపుతున్నాయ్.