కేవలం ఇంట్లో వాడే స్పాంజీ లేదా క్లీనింగ్ వస్త్రమే కాదు మీ ఇంట్లోని పరుపు కూడా మీకు రోగాల బారిన పడేలా చేస్తుంది. ప్రతిరోజూ పరుపుపై పడుకుంటే… ఆ పడుకున్న వ్యక్తి శరీరంలోని మృతకణాలు అక్కడే ఉండిపోతాయి. పరుపుల పైన దాదాపు ముప్పై శాతం చర్మ మృత కణాలే ఉంటాయని అధ్యయనం చెబుతోంది. అలాగే ఎన్నో రకాల సూక్ష్మక్రిములు కూడా ఉంటాయి. దుమ్ము, ధూళి, చెమట, సూక్ష్మ క్రిములు పరుపుకూ లేదా పరుపుపై ఉన్న దుప్పటికి అతుక్కుని ఉంటాయి. కానీ పరుపును సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే శుభ్రం చేస్తారు. నిజానికి వారానికి రెండు మూడు సార్లు పరుపును ఎండలో పెట్టి వ్యాక్యూమ్ క్లీనర్ తో శుభ్రపరచవలసి ఉంటుంది. అలాగే పరుపుపై వాడే దుప్పట్లను ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి మార్చాలి.
గిన్నెలు తోమే స్పాంజ్ పై కూడా విపరీతమైన బ్యాక్టీరియా ఉంటుంది. గిన్నెలు తోమాకా దాన్ని కూడా పరిశుభ్రంగా కడిగి ఎర్రటి ఎండలో ఆరబెట్టాలి. జర్మనీలో చేసిన ఒక అధ్యయనంలో సింకుపై ఉన్న బ్యాక్టీరియాల కన్నా స్పాంజీలపై ఉన్న క్రిములు, బ్యాక్టీరియాల సంఖ్య ఎక్కువ. దాదాపు 362 రకాల బ్యాక్టీరియాలు ఈ గిన్నెలతోమే బ్రష్ పై ఉంటాయని అధ్యయనం చెబుతోంది. కాబట్టి ప్రతిరోజూ గిన్నెలతో పాటు గిన్నెల తోమే స్పాంజీ లేదా బ్రష్ ను కూడా ఎర్రటి ఎండలో ఆరబెట్టాలి. అప్పుడే ఆ బాక్టీరియాలు వదులుతాయి.
మీ ఇంట్లో మీ పిల్లలు, పెద్దలు తరచూ వ్యాధుల బారిన పడుతున్న జలుబు, జ్వరం, దగ్గు వంటి వాటికి గురవుతున్నా మీ ఇంట్లో పరిశుభ్రత లోపించిందేమో అని ఒకసారి చెక్ చేసుకోండి. వాటి వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఎక్కువగా వాడే వస్తువులను తరచూ మారుస్తూ ఉండండి. అప్పుడే ఎలాంటి రోగాలు మీకు రాకుండా ఉంటాయి.