రాష్ట్రంలో నేడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లను సైతం పూర్తిచేసింది. నిబంధనల ప్రకారం టెట్ నోటిఫికేషన్ ఏడాదికి రెండుసార్లు విడుదల చేయాలి. కానీ గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఏడాదికి ఒకేసారి టెట్ నిర్వహిస్తున్నారు. ఏడాదికి ఒకసారి కూడా టెట్ నిర్వహించని సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఏడాది మాత్రం ఇప్పటికే ఓసారి టెట్ నిర్వహించగా ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో నవంబర్ లో టెట్ నోటిఫికేష్ ఉంటుందని ప్రకటించారు.
అందులో పేర్కొన్న విధంగానే మరోసారి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఏడాది మే 20 నుండి జూన్ 2వరకు ఆన్లైన్ లో పరీక్ష నిర్వహించనున్నారు. డీఈడీ, బీఈడీ కోర్సు చేసిన వారు టెట్ రాసేందుకు అర్హులు. డీఈడీ అభ్యర్థులకు టెట్ పేపర్ 1 నిర్వహించగా, బీఈడీ అభ్యర్థులకు టెట్ పేపర్ 2 నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలకు గానూ 150 మార్కులు ఉంటాయి.
ఉత్తీర్ణత సాధించాలంటే ఓసీ అభ్యర్థులకు 90 మార్కులు, బీసీ అభ్యర్థులకు 75 మార్కులు, ఎస్సీఎస్టీ అభ్యర్థులకు 60 మార్కులు రావాలి. టెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులకే డీఎస్సీ రాసేందుకు అవకాశం ఉంటుంది. టెట్ పరీక్ష మార్కుల ఆధారంగా వెయిటేజీ సైతం ఉంటుంది. ఇక టెట్ పేపర్ 1 క్వాలిఫై అయిన విద్యార్థులు ఎస్జీటీకి అర్హులు కాగా, పేపర్ 2కు క్వాలిఫై అయిన విద్యార్థులు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికి అర్హులు అవుతారు. టెట్ పరీక్షకు ఎలా అప్లై చేసుకోవాలి? ఫీజు ఎంత చెల్లించాలి అనే పూర్తి వివరాలు నేడు నోటిఫికేషన్ లో వెలుబడనున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఇటీవలే టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసిన సంగతి తెలిసిందే.