Bowenpally Incident: ఆకతాయి పనులకు కూడా ఓ హద్దు ఉంటుంది. ఆ హద్దులు దాటితే, ఏనాటికైనా తిప్పలు తప్పవు. అందుకే నేటి యువత కొంత ఆకతాయి పనులకు దూరంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తించాలి. మనం చేసే కొన్ని ఆకతాయి పనులు, సభ్యసమాజం ఛీ కొట్టేలా కూడా ఉండకూడదు. సేమ్ టు సేమ్ ఇలాంటి ఘటనే సికింద్రాబాద్ పరిధిలో జరిగింది. అది కూడా దీపావళి పండుగ రోజు. ఇంతకు ఏమి జరిగిందంటే?
సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో గల బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన దీపావళి రోజు జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోయిన్ పల్లి పరిధిలో మహాత్మా గాంధీజీ విగ్రహాన్ని కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. అయితే దీపావళి రోజు కొందరు యువకులు, మహాత్ముని విగ్రహం సమీపంలో క్రాకర్స్ కాల్చేందుకు వచ్చారు. అక్కడ క్రాకర్స్ కాల్చడం వరకు ఓకే గానీ, ఇక్కడే వారు చేసిన నిర్వాకం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వారిలో కొందరు ఆకతాయిలు, లక్ష్మీ బాంబును మహాత్ముని నోటిలో ఉంచి పేల్చారు. అలా పేల్చి నవ్వుతూ కేకలు కూడా వేయడం ఆ వీడియోలలో స్పష్టంగా వినిపిస్తోంది. అయితే ఈ దృశ్యాలను ఎవరో చిత్రీకరించగా, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు అనే నీతి బోధ చేసిన మహాత్ముని విగ్రహం పట్ల ఆకతాయిలు వ్యవహరించిన తీరుతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్వాతంత్ర్య సంగ్రామంలో శాంతి, అహింస అనే ఆయుధాలతో పోరాడి, నేటి మన స్వేచ్ఛ జీవితానికి కారకులైన మహనీయుడి విగ్రహం పట్ల ఆకతాయిలు ప్రవర్తించిన తీరుపై పలు పార్టీల నాయకులు మండిపడుతున్నారు. ఈ దారుణానికి పాల్పడిన, కారకులను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
గాంధీ విగ్రహానికి ఘోర అవమానం.
కంటోన్మెంట్లోని బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఆకతాయిలు రెచ్చిపోయారు. గాంధీ విగ్రహం నోట్లో టపాసులు పెట్టి పేల్చారు. ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. @Hydcitypolice @CPHydCity #Hyderabad #Telangana #TeluguNews… pic.twitter.com/enmvcXF5Hx
— Swetcha Daily epaper (@swetchadaily) November 3, 2024
ఇప్పటికే స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించి బాధ్యులు ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా, చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. అలాగే సీపీ సివి ఆనంద్ సుమోటోగా ఈ కేసును స్వీకరించి, చట్టప్రకారం వారిని శిక్షించాలని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ డిమాండ్ చేశారు.
ఏదిఏమైనా తమ బాల్యంలో గురువులు చెప్పిన మహనీయుని చరిత్ర పాఠాలు మరచిపోయారో ఏమో గానీ, సాక్షాత్తు బాపూజీ విగ్రహం పట్ల ఆకతాయిలు ప్రవర్తించిన తీరు సభ్యసమాజం సిగ్గుపడేలా ఉందని చెప్పవచ్చు. ఇలాంటి వారిని వదిలిపెట్టకుండా, చట్టరీత్యా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.