రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR ), రామ్ చరణ్ (Ram Charan) సంయుక్తంగా నటించిన చిత్రం ఆర్.ఆర్.ఆర్. 2022లో విడుదలైన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు సినిమాగా విడుదలై.. ప్రపంచ స్థాయి గుర్తింపును అందుకుంది. దీనికి తోడు ఆస్కార్ అవార్డులు కూడా అందుకుంది ఈ చిత్రం. ఇకపోతే తాజాగా బాహుబలి2 సినిమా తర్వాత అరుదైన గౌరవాన్ని అందుకుంది. అసలు విషయంలోకెళితే.. ప్రతిష్టాత్మక లండన్ రాయల్ ఆల్బర్ట్ థియేటర్లో ఒక సినిమాని ప్రదర్శించడం అంటే అది ఖచ్చితంగా ఎంతో గొప్ప సినిమా అయితేనే అది సాధ్యమవుతుంది. కానీ అలాంటి అవకాశం మన రాజమౌళి సినిమాకి లభించింది .
148 ఏళ్ల తర్వాత రికార్డ్ సృష్టించిన బాహుబలి..
ఐదు సంవత్సరాల క్రితం 19 అక్టోబర్ 2019న దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి: ది కంక్లూజన్ చిత్రం.. 148 సంవత్సరాల సినీ చరిత్రలో లండన్ లోని ఐకానిక్ రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించబడిన ఆంగ్లేతర చిత్రంగా రికార్డు సృష్టించింది. ఐదు సంవత్సరాల తర్వాత రాజమౌళి ఈసారి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న యాక్షన్ డ్రామా ఆర్ ఆర్ ఆర్ తో మరోసారి ఈ ఫీట్ ని రిపీట్ చేస్తున్నాడు అని చెప్పవచ్చు. వచ్చే ఏడాది అనగా 2025 మే 11వ తేదీన రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రదర్శితం అవుతుంది అని టీం ప్రకటించింది.
ఆర్ఆర్ఆర్ కు అలాంటి ఘనత..
ఆస్కార్ విజేత, సంగీత స్వరకర్త ఎం.ఎం.కీరవాణి (M.M.keeravani ) ఈ లైవ్ ఫిలిం ఇన్ కాన్సర్ట్ ప్రదర్శన కోసం ప్రతిష్టాత్మక రాయల్ ఫిలిం హార్మోనిక్ ఆర్కెస్ట్రా ద్వారా ప్రదర్శన ఇవ్వనున్నట్లు, అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేశారు. ఏది ఏమైనా ఇంతటి ఘనత మళ్లీ రాజమౌళి మూవీ కే లభించడంతో ఆయనకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సంచలన చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అలాగే అజయ్ దేవగన్ , శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
ఆర్.ఆర్. ఆర్ మూవీ విశేషాలు..
2022 మార్చి 25వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమాని డీ.వీ.వీ.దానయ్య నిర్మించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఘనవిజయం అందుకుంది. సుమారు రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి, రికార్డు సృష్టించింది. ఈ సినిమాతో రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించారు. ముఖ్యంగా గ్లోబల్ చార్ట్ బస్టర్ నాటు నాటు పాట 95వ అకాడమీ అవార్డ్స్ లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా అకాడమీ అవార్డును కూడా గెలుచుకుంది. అలాగే హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ , గోల్డెన్ గ్లోబ్స్ తో సహా పలు అంతర్జాతీయ పురస్కారాలు కూడా అందుకోవడం విశేషం.
ఎస్.ఎస్.ఎం.బి – 29 మూవీ..
ఇక రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో ఎస్.ఎస్.ఎం.బి – 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు శరవేగంగా మొదలయ్యాయని, దీనికి తోడు లోకేషన్ కూడా ఆయనే స్వయంగా వెతుకుతున్నట్లు సమాచారం. కెన్యాలో ఇటీవల లొకేషన్ వెతుకుతూ అందుకు సంబంధించిన ఫోటోలు కూడా రాజమౌళి షేర్ చేశారు. సరైన లొకేషన్ దొరికితే షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.