– ప్రభుత్వంపై కావాలని తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం
– ఎవర్నీ వదలం.. చట్టప్రకారం ముందుకెళ్తాం
– నాదర్గుల్ భూములపై అబద్ధపు వార్తలు
– నమస్తే తెలంగాణ చేస్తోంది జర్నలిజమేనా?
– ప్రభుత్వ వ్యతిరేక కథనాలపై సామ రామ్మోహన్ ఆగ్రహం
హైదరాబాద్, స్వేచ్ఛ: మీడియా ముసుగులో ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, సమాజంలో ఏ అన్యాయం జరిగినా ప్రజల పక్షాన మీడియా గళం విప్పుతుందన్నారు. కానీ, కొందరు మాత్రం మీడియా ఖ్యాతిని తగ్గించే విధంగా చేస్తున్నారని అన్నారు. నమస్తే తెలంగాణ నుంచి తెలంగాణ పదం తొలగిస్తే బాగుంటుందని, అది గుమస్తా కరపత్రం అంటూ ఫైరయ్యారు. నాదర్గుల్లో 300 ఎకరాలకు ఎసరు అంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, పిచ్చిపిచ్చి రాతలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకమైన పాలన అందిస్తోందన్న రామ్మోహన్ రెడ్డి, ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా విచారణ చేసి బాధ్యతగా ప్రజలకు ప్రభుత్వం చెబుతుందన్నారు. అసైన్డ్ భూములు అమ్ముకునే హక్కు ఎవరికీ ఉండదని స్పష్టం చేశారు. సిగ్గు లేకుండా నమస్తే తెలంగాణ పత్రిక అబద్ధపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ పత్రిక అబద్ధపు రాతలు చూసి ఆ భూముల రైతులే న్యూస్ పేపర్లను కాల్చి వేశారని చెప్పారు. జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేయొద్దని సూచించారు. రుణమాఫీ విషయంలోనూ ఇలాగే తప్పుడు ప్రచారం చేస్తారని గుర్తు చేశారు రామ్మోహన్ రెడ్డి. అబద్ధపు ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరి పైనా చట్ట పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Also Read: అప్పులు తేవడంలో మీది ప్రపంచ రికార్డు..బండిపై పొన్నం ఫైర్!
అసలు, నమస్తే తెలంగాణను బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చదవడం లేదని ఎద్దేవ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకం వార్తలు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే ఇంకో రకం వార్తలు రాస్తున్నారని ఫైరయ్యారు. ప్రభుత్వం మీద కావాలని బురద జల్లే కుట్ర చేస్తే ఊరుకునేది లేదన్నారు. అన్యాయం జరిగితే ఎదిరించండి, నిజాలు రాయండి స్వాగతిస్తామని సూచించారు సామ రామ్మోహన్ రెడ్డి. ఇక, పోలీసులను కీలుబొమ్మలు అంటే ప్రజలు మీ కీళ్లు విరగ్గొడతారని నమస్తే తెలంగాణలో వచ్చిన మరో కథనంపైనా స్పందిస్తూ మండిపడ్డారు.
పూర్తి కథనం…