బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో గులాబీ మాజీలకు గడ్డుకాలం నడుస్తోందట. పదేళ్లు ఎమ్మెల్యే గిరితో ప్రజల్లో తిరిగిన ఆ నాయకులు ఇప్పుడు ఇల్లు విడిచి బయటకు రావాలంటే నామోషీగా ఫీల్ అవుతున్నారట. వెంట తిరిగే అనుచరులు దూరం కావడంతో, తమ నియోజకవర్గాల్లోకి వెళ్లాలంటే నై.. నై అంటున్నారట. దీంతో బీఆర్ఎస్ లో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ప్రజల్లోకి వెళ్లలేక మదన పడుతున్నారట.
బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల్లో.. అప్పటి ఎమ్మెల్యేలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో కార్యక్రమం పేరుతో నిత్యం ప్రజల్లోనే తిరిగేవారు. భారీగా అనుచరగణాన్ని వెంటేసుకుని నియోజకవర్గంలో బర్త్ డే వేడుకలు మొదలుకొని అన్నిటికీ అటెండ్ అయ్యేవారు. కానీ ఇప్పుడు మాత్రం అసలు నియోజకవర్గంలో ఆ మాజీలు ఉన్నారా అనే పరిస్థితి దాపురించిందనే చర్చ జరుగుతుంది. అధిష్టానం సీరియస్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ నియోజకవర్గంలోకి వెళ్లడానికి నామోషీగా ఫీల్ అవుతున్నారని గులాబీ సెకండ్ క్యాడర్ చర్చించుకుంటోంది. అధికారంలో ఉన్నప్పుడు సామాన్యులను దగ్గరకు రానివ్వకపోవడంతో, ఇప్పుడు బయటకు వెళ్తే వాళ్లంతా ఎదురు ప్రశ్నిస్తారని వెనుకడుగువేస్తున్నారని చర్చ కూడా జరుగుతుంది.
Also Read: అది కూడా తెలీదా.? ఓవైసీకి బండి సంజయ్ కౌంటర్!
అయిదేళ్లపాటు అభివృద్ధి పనుల విషయంలో వాయిదాలు వేస్తూ వచ్చి, ఎన్నికల ముందు హడావిడిగా శంకుస్థాపనలు చేశారు అప్పటి ఎమ్మెల్యేలు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధి పనులకు సాంక్షన్లు తెచ్చి, అగ్రిమెంట్లు చేసి పనులను పూర్తి చేసే పనిలో ఉంది. ఇదే అదనుగా తమ ప్రభుత్వ హాయంలోనే పనులు మొదలు పెట్టామని ఆ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తున్నారట గులాబీ నేతలు. అందుకోసం తమ అనుచర గణాన్ని నిరసనల పేరుతో ముందుగా ప్రజల్లోకి వెళ్లాలని, స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి ప్రజల్లో తమపై సానుభూతి కలిగితే అప్పుడు జనాల్లో తిరుగుతామని అనుచరులకు హితబోధ చేస్తున్నారట. పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, భూపాలపల్లి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ క్యాడర్ తమ నాయకులు వేసిన శిలాఫలకాలను చూపిస్తూ ఇప్పుడు జరిగే పనులన్నీ తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి రికార్డు టైం లో పూర్తిచేసిన నయీమ్ నగర్ బ్రిడ్జి, కాళోజి కళాక్షేత్రం విషయంలో బీఆర్ఎస్ చేసిన క్రెడిట్ వార్ పరస్పర దాడుల వరకూ వెళ్ళింది. ప్రస్తుతం పరకాల నియోజకవర్గంలోని గ్రామాల్లోని అంతర్గత రోడ్ల విషయంలో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టి పూర్తి చేస్తుండగా, ఆ క్రెడిట్ సైతం తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ క్రమంలోనే పరకాల నియోజకవర్గంలో టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ శంకుస్థాపనల పంచాయతీ నడుస్తోంది.
ఎన్నికల కోడ్ ముందు ఓట్ల కోసం హడావిడిగా శిలాఫలకాలకు శంకుస్థాపనలు చేసి, ఓటర్లను మభ్య పెట్టే ప్రయత్నం చేశారని, నిజంగా అభివృద్ధి పనులు చేయాలనుకుంటే ఐదేళ్లు ఏం చేశారని కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ మాజీల వ్యూహాలను తిప్పికొడుతున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో వినయ్ భాస్కర్ ప్రయత్నాలు బూమారాంగ్ అయ్యి, ఇప్పుడు పూర్తిగా ప్రజల్లోకి రాలేని పరిస్థితి డాపురించింది. అదే పరిస్థితి పరకాల, వర్ధన్నపేట, భూపాలపల్లి నియోజకవర్గాల్లోని గులాబీ మాజీలకు సైతం రాక తప్పదనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. ఏది ఏమైనా.. అభివృద్ధి పనులు చేసి చూపిస్తేనే ప్రజలు నమ్ముతారు తప్ప, మావల్లె అభివృద్ధి జరిగిందని ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు చేస్తే మరోసారి గుణపాఠం తప్పదనే చర్చ మేధావి వర్గంలో సాగుతోంది.