– నాదర్‌గుల్ భూముల దందా అంటూ వార్తలు
– అనధికారికంగా ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారని రాతలు
– ఆలూలేదు చూలులేదు అన్నట్టుగా గుమస్తా పత్రిక కథనాలు
– బీఆర్ఎస్ హయాంలో లెక్కలేనన్ని పాపాలు
– లావణి, అసైన్డ్, పోడు, డీ1 పట్టాలు.. ఇలా దేన్నీ వదలని గులాబీ నేతలు
– అయినా, ఒక్క వార్త రాశారా? కనీసం చిన్నగా అయినా ప్రచురించిరా?
– పదేళ్లపాటు బీఆర్ఎస్‌కు వంత పాడుతూ కథనాలు ఇచ్చి..
– పది నెలల కాంగ్రెస్ పాలనపై కావాలని విషం చిమ్ముతారా?
– బీఆర్ఎస్ గుమస్తా పత్రిక కథనాలపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం
– కేసీఆర్ పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు ‘స్వేచ్ఛ’ ఆహ్వానం
– గులాబీ లీడర్ల చేతిలో ఉన్న లావణి, పోడు, అసైన్డ్, డీ1 పట్టా భూముల సమస్యలపై సంప్రదించండి
– ఫోన్ చేయాల్సిన నెంబర్ 9848070809
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: పదేళ్లు తెలంగాణను పాలించింది బీఆర్ఎస్. గతంలో సైకిళ్లు, స్కూటర్ల మీద తిరిగిన గులాబీ నేతలు, ఈ పదేళ్లలో దండిగా సంపాదించారు. మనవళ్లు, ముని మనవళ్లు కూడా కూర్చుని తిన్నా తరగని ఆస్తిని వెనకేశారు. కానీ, ఇదంతా సక్రమమా అంటే కానేకాదు. ఇన్నేళ్లలో అనేక అక్రమాలు, స్కాములు చేశారు. అధికారికంగానే ప్రజల ధనాన్ని సైడ్ చేసేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ లెక్కలపై ఫోకస్ చేయడంతో ప్రభుత్వంపై అదే పనిగా బీఆర్ఎస్ తప్పుడు రాతలు రాయిస్తోందని హస్తం నేతలు అంటున్నారు. తన గుమస్తా పత్రికలో ఓవైపు ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతూ లేనిపోనివి రాయిస్తూ, ఇంకోవైపు ప్రభుత్వ పెద్దల కుటుంబసభ్యులను, సన్నిహితులపై కావాలనే బురద జల్లే ప్రయత్నం చేయిస్తోందని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లో లావణి పట్టాల దందా అంటూ లేనిపోనివి రాయించి, ప్రభుత్వ పెద్దలను బద్నాం చేసే కుట్ర చేయిస్తోందని అంటున్నారు.
కేసీఆర్ పాలనలో విచ్చలవిడిగా భూ కబ్జాలు
భూ సమస్యల పరిష్కారం అంటూ ధరణిని తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ, ఇది వచ్చాకే కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. చాలామంది ఉన్న భూమిని కోల్పోయి రోడ్డున పడ్డ పరిస్థితి ఏర్పడింది. అప్పటి ప్రభుత్వానికి అనేక వినతులు వచ్చినా, పట్టించుకున్న పాపాన పోలేదనే విమర్శలున్నాయి. పైగా, ధరణి సూపర్ అంటూ గులాబీ నేతలు చెప్పుకున్నారు. వారికి లబ్ధి జరుగుతుంది కాబట్టే సూపర్ అంటూ మాట్లాడారని సమాన్యులు మాత్రం దాని వల్ల ఇబ్బందులే పడ్డారనే విమర్శలున్నాయి. ఇక, భూముల ధరలకు రెక్కలొచ్చాక, రంగారెడ్డి జిల్లా పరిధిలో రియల్ ఎస్టేట్ సంస్థల పంట పండింది. గులాబీ నేతలతో కుమ్మక్కయి, వందల కోట్ల రూపాయల భూములను అప్పనంగా కొట్టేశారు. ఇంకొందరైతే లిటిగేషన్ భూముల్ని దర్జాగా కబ్జా చేసేసి బోర్డులు పాతేశారు. తర్వాత ఇష్టం వచ్చిన ధరలకు అమ్మేసుకున్నారు. మరి, గుమస్తా పత్రికకు ఈ పదేళ్లలో ఇవి కనిపించలేదా?
Also Read: జెండా ఎత్తేసిన కేసీఆర్.. మహా యుద్ధంలో వెనక్కు తగ్గడానికి కారణమిదే!
లావణి, అసైన్డ్, డీ1, పోడు.. కాదేది గులాబీ కబ్జాకు అనర్హం
ఇప్పుడు నాదర్‌గుల్‌లో ఏదైతే ప్రైవేట్ దందా అని వార్తలు ఇస్తున్నారో, అదంతా అబద్ధమనేది కాంగ్రెస్ నేతల వాదన. పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది వాస్తవం కాదా? అసలు, అగ్రిమెంట్ జరిగిందని చెబుతున్న దాంట్లో ఎక్కడైనా పేర్లు ఉన్నాయా? అంటూ మండిపడుతున్నారు. నిజానికి ఈ భూముల్ని తమకు ఇష్టం వచ్చినట్టు హెచ్ఎండీఏ లే అవుట్ చేసి, దర్జాగా అమ్మేసుకుందామనే స్థానికులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పాస్ పుస్తకాలు ఇవ్వలేదని చెబుతున్నారు. నిజానికి, గత పదేళ్లలో మెదక్, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్ జిల్లాల్లో లక్ష ఎకరాల దాకా లావణి, అసైన్డ్, ఇంకా ఇతర భూములు గుంజుకున్నారు గులాబీ నేతలు.
కొన్ని జిల్లాల్లో డీ1 పట్టా భూముల్ని సైతం వదలలేదు. పద్మాదేవేందర్ రెడ్డి, హరీష్ రావు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే ఉంది. వీటన్నింటిపై గుమస్తా తెలంగాణ ఏనాడైనా వార్తలు రాసిందా? అనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. అసలు, గుమస్తా పత్రిక ఓనర్ మియాపూర్ ల్యాండ్ స్కామ్‌లో అడ్డంగా దొరికింది వాస్తవం కాదా? ఆఖరికి ఆదివాసీలకు దక్కాల్సిన పోడు భూములను సైతం గులాబీ లీడర్లు దోచేసింది నిజం కాదా? ఐకియా దగ్గర 42 ఎకరాల అసైన్డ్ భూమిని ఫినిక్స్‌కు అప్పగించిందెవరు? నారాయణరావు లే అవుట్‌లోని పదివేల ఎకరాల అసైన్డ్ భూముల పరిష్కరానికి బీఆర్ఎస్ లీడర్లకు ముట్టింది ఎంత? ఇలా ఒకటా రెండా? లక్ష ఎకరాలకు పైగా పదేళ్లలో దర్జాగా దోచేసి, పది నెలల కాంగ్రెస్ పాలనపై విషం చిమ్ముతారా? అంటూ ఫైరవుతున్నారు హస్తం నేతలు.
బీఆర్ఎస్ బాధితులకు ‘స్వేచ్ఛ’ ఆహ్వానం
బీఆర్ఎస్ పాలనలో జరిగిన అసైన్డ్, లావణి, పోడు, డీ1 పట్టా భూముల సమస్యలను వెలుగులోకి తెస్తాం. బాధితులు ‘స్వేచ్ఛ’ను సంప్రదించవచ్చు. భూమి మీదై గులాబీ లీడర్ల చేతిలో ఉంటే 9848070809 ఫోన్ నెంబర్‌కు కాల్ చేయండి. పొజిషన్‌లో ఎవరున్నారు, లీజుల లెక్కలు, భూములు ఎవరివి ఇలా అన్నీ బట్టబయలు చేస్తాం. పదేళ్లలో జరిగిన భూ పందేరంలో వేల మంది దళిత, గిరిజనుల భూములు ఎలా దొరల భూ దాహానికి బలయ్యాయో గుట్టంతా బయటపెడుతాం. బీఆర్ఎస్ బాధితులకు ఇదే మా ఆహ్వానం.
పూర్తి కథనం…