EPAPER

PCC Chief Mahesh Goud : అందరికీ అభివృద్ధి.. ఇదే రాహుల్ లక్ష్యం – పీసీసీ చీఫ్ మహేశ్

PCC Chief Mahesh Goud : అందరికీ అభివృద్ధి.. ఇదే రాహుల్ లక్ష్యం – పీసీసీ చీఫ్ మహేశ్

PCC Chief Mahesh Goud :


⦿ అదే మా నేత రాహుల్ గాంధీ లక్ష్యం
⦿ అందుకే రాష్ట్రవ్యాప్తంగా కులగణన
⦿ నవంబరు 5న రాహుల్ పర్యటన
⦿ కులగణనపై మేధావులతో చర్చించనున్న రాహుల్
⦿ సర్వేపై సందేహాలకు గాంధీభవన్‌లో కనెక్టింగ్ సెంటర్
⦿ అన్ని వర్గాలకూ న్యాయం చేస్తున్నాం
⦿ మహేశ్వర్ రెడ్డికి బీజేపీ ఆఫీసులో కుర్చీయే లేదు
⦿ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్, స్వేచ్ఛ: దేశంలో ఎవరు ఎంత జనాభా ఉంటే అంతే ఫలాలు అందాలని రాహుల్ గాంధీ భావించారని, అందుకే దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని డిమాండ్ చేస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. కులగణనపై శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కనెక్టింగ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. నవంబరు 5న కులగణనపై జరిగే పీసీసీ సమావేశంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పాల్గొని కుల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, మేధావులతో మాట్లాడతారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తమ ప్రాంతంలో జరిగే కులగణన సర్వేలో పాల్గొనాలని టీపీసీసీ చీఫ్ కోరారు.


ఇదీ కాంగ్రెస్ అంటే..
ప్రధాని మోదీ ఎప్పుడూ క్షేత్రస్థాయిలోని వాస్తవాలు తెలుసుకునేందుకు సాధారణ పార్టీ కార్యకర్తలతో మాట్లాడరని, అందుకు భిన్నంగా రాహుల్ గాంధీ సామాన్యుల విమర్శలను కూడా పాజిటివ్‌గా తీసుకుంటారని మహేశ్ కుమార్ గౌడ్ గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న ప్రజాస్వామిక స్వేఛ్ఛ.. ఏ ఇతర పార్టీలోనూ ఉండదని, బీజేపీలో అది మచ్చుకూ లేదన్నారు. పలు కులాలు, వర్గాలు, భాషలు, ప్రాంతాలకు కాంగ్రెస్ ప్రాతినిథ్యం కల్పించటంలో ఎప్పుడూ ముందుంటుందని, అదే కాంగ్రెస్ గొప్పతనం, బలమని అన్నారు. అంతర్గత ప్రజాస్వామ్యం లేని బీజేపీకి తమ పార్టీని విమర్శించే హక్కు ఎక్కడిదని ఆయన నిలదీశారు. కేంద్రంలో బీజేపీ ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.

కనెక్టింగ్ సెంటర్..
కులగణన మీది అనుమానాలను తీర్చేందుకు, సలహాలు, సూచనల కోసం గాంధీ భవన్‌లో ఒక కనెక్టింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు పీసీసీ చీఫ్ తెలిపారు. మరోవైపు, కులగణనపై రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కమిషన్ నాయకత్వంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోందని తెలిపారు. ఇది ఏ ఒక్క వర్గానికీ వ్యతిరేకం కాదని, వాస్తవ తెలంగాణ సామాజిక ముఖచిత్రాన్ని ఆవిష్కరించేందుకే ఈ గణన చేపట్టినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఏదైనా సలహాలు, సందేహాలు ఉంటే ఈ కనెక్టివిటీ సెంటర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. భవిష్యత్ అవసరాలు, కార్యక్రమాల కోసం కొంత మంది ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లను వారి జిల్లాల్లో కాకుండా ఇతర జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జులుగా పంపుతామని, సీనియర్ నేతలను కోఆర్డినేటర్లుగా నియమిస్తామన్నారు.

రాహుల్ పర్యటనపై..
కులగణన విషయంలో రాహుల్‌గాంధీ చిత్తశుద్ధితో ఉన్నారని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. ఈ నెల 5న బోయినపల్లి ఐడియాలజీ సెంటర్‌లో సాయంత్రం 4 గంటలకు కుల గణనపై రాహుల్ గాంధీ సమావేశం అవుతారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి మల్లికార్జున ఖర్గేను సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించామని, సమయం దొరికితే ఆయన కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందన్నారు. దీనికి కొనసాగింపుగా, టీపీసీసీ ఆధ్వర్యంలో ఈనెల 6 లేదా 7వ తేదీన అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి కులగణనతో పాటు అనేక అంశాలపై అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుంటామన్నారు. కేసీఆర్ హయాంలోని నియంతృత్వ పోకడలకు భిన్నంగా, తమ ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామికంగా పాలన చేస్తోందని, ప్రభుత్వంలోని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలంతా స్వేచ్ఛగా పనిచేస్తున్నారన్నారు.

ఆయనకు కుర్చీయే లేదు..
ప్రభుత్వం మీద బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేస్తున్న విమర్శలు చూస్తుంటే నవ్వు వస్తోందని పీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు. ఆయనకి బీజేపీలో కనీస గౌరవం లేదని, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయనకంటూ ఒక ప్రత్యేక కుర్చీ కూడా లేదని ఎద్దేవా చేశారు. వాస్తవానికి ఆయన తనకు మంచి మిత్రుడేనని, కానీ, కాంగ్రెస్ పార్టీలోని వాస్తవిక పరిస్థితులను తెలుసుకోకుండా ఏదిబడితే అది మాట్లాడటం సరికాదన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, మహేశ్వర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయని బీజేపీ నేతలే చెబుతున్నారని, కనుక ఆయన కాంగ్రెస్ గురించి మాట్లాడటం మాని, సీఎల్పీ నాయకుడిగా బీజేపీలో తనకు దక్కుతున్న గౌరవం గురించి ఆలోచించుకోవాలన్నారు.

Related News

Caste Census Survey: బుధవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా కులగణన సర్వే

Formula E Race Scam: ఫార్ములా రేస్ స్కామ్.. ఏసీబీ దర్యాప్తు వేగవంతం, రేపో మాపో నోటీసులు

Rahul Gandhi: హైదరాబాద్‌కు రాహుల్‌గాంధీ.. కులగణనపై చర్చ, ఆపై

CM Revanth Reddy: బర్త్ డే రోజున పాదయాత్ర.. మూసీ పునరుజ్జీవంపై దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth : విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొస్తాం – విద్యార్ధులకు సీఎం రేవంత్ హామీ

Congress : ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా.. సాఫీగా జరగాల్సిందే – సీఎం రేవంత్

BC Commission : రిజర్వేషన్స్ కమిషన్ ఏర్పాటు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన బీసీ నేతలు

Big Stories

×