Indiramma Illu :
⦿ లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక యాప్
⦿ గ్రామ సభల ద్వారా ప్రక్రియ వేగవంతం
⦿ నాలుగు దశల్లో ఇళ్ల కేటాయింపు
⦿ ఈ నెల 20 కల్లా లబ్ధిదారుల ఎంపిక పూర్తి
⦿ ఎలాంటి ప్రలోభాలు ఉండవన్న మంత్రి పొంగులేటి
⦿ గత ప్రభుత్వంలో మధ్యలో వదిలేసిన ఇళ్లపైనా కీలక ప్రకటన
హైదరాబాద్, స్వేచ్ఛ : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. లబ్ధిదారుల ఎంపికకు ఇప్పటికే ఒక యాప్‌ని డిజైన్ చేశామని, గ్రామసభల్లో పేదలను సెలెక్ట్ చేస్తామని, ఎలాంటి ప్రలోభాలు ఉండవని స్పష్టం చేశారు. నాలుగు దశల్లో ఇండ్ల కేటాయింపు ఉంటుందన్న ఆయన, కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. కేంద్ర నిబంధనలు ప్రకారం 400 స్క్వేర్ ఫీట్‌లో ఇల్లు ఉంటుందని, మొదటి దశలో సొంత స్థలం ఉన్న వారికి దశల వారీగా 5 లక్షలు అందిస్తామని చెప్పారు. అదనపు నిర్మాణం అవసరం అనుకుంటే యజమాని తన సొంత ఖర్చుతో నిర్మించుకోవచ్చని స్పష్టం చేశారు.
ఇంటి యజమానిగా మహిళను ఎంపిక చేస్తున్నామని, గతంలో సగం నిర్మించి వదిలేసిన ఇండ్లను పూర్తి చేసే ప్రయత్నం చేస్తామన్నారు. ‘‘ఇందిరమ్మ కమిటీలు గ్రామ సభలు ఏర్పాటు చేసి సమన్వయం చేస్తాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగి పర్యవేక్షణలో సభలు నడుస్తాయి. లబ్ధిదారుల ఎంపిక ఈ నెలాఖరుకు పూర్తి చేస్తాం. మొదటి దశలో నియోజకవర్గానికి 3,500 ఇల్లు కేటాయిస్తాం. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనట్టుగా తెలంగాణలో 5 లక్షలు ఇస్తున్నాం. నాలుగు దశల్లో ఫౌండేషన్‌కి లక్ష, రెండో దశలో 1.25 లక్షలు, మూడో దశలో స్లాబ్‌కి 1.75 లక్షలు, ఫినిషింగ్ దశలో ఇంకో లక్ష ఇస్తాం’’ అని వివరించారు పొంగులేటి. లబ్ధిదారులకు అకౌంట్ ఓపెన్ చేసి అందులో జమ చేస్తామని, ఎక్కడా క్యాష్ ట్రాన్సాక్షన్ జరగదన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు లేకుండా చూస్తామని, వచ్చే 4 ఏళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలు బాగాలేకున్నా తమ టాప్ 5 ప్రయారిటీలలో ఇందిరమ్మ ఇళ్లు ఉంటుందని, ఈ నెల 20 కల్లా లబ్ధిదారులు ఎంపిక పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. డిసెంబర్‌లో సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేస్తామని, సంక్రాంతి కల్లా సర్పంచులు, వార్డ్ మెంబర్ల ఎన్నిక పూర్తి అవుతుందని తెలిపారు. ఇక, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ, వచ్చే నాలుగేళ్ల వరకు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారన్నారు.
ALSO READ : మెట్రో రెండో దళ పనుల్లో కీలక పురోగతి.. ఈ మార్గాల్లో పనులు ప్రారంభం..