Asaduddin Owaisi :
⦿ బీఆర్ఎస్ను టార్గెట్ చేసిన అసదుద్దీన్
⦿ అహంకారం వల్లే ఓడిపోయిందంటూ విమర్శలు
⦿ తమ వల్లే గ్రేటర్లో గెలిచారని సెటైర్లు
⦿ బీఆర్ఎస్ నేతల జాతకాలు తమ దగ్గర ఉన్నాయంటూ ఫైర్
⦿ మూసీ సుందరీకరణను అడ్డుకుంటే ఊరుకోమని వార్నింగ్
హైదరాబాద్, స్వేచ్ఛ : పదేళ్లు బీఆర్ఎస్, ఎంఐఎం నేతలు ఎలా ఉన్నారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ముస్తఫా ముస్తఫా అంటూ సాంగులు పాడుకున్నారు. విజయాలను చూసి ఒకరికొకరు ప్రశంసలు చేసుకున్నారు. కానీ, మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఎంఐఎంలో మార్పు వచ్చింది. ఇన్నాళ్లూ దోస్త్ మేరా దోస్త్ అనుకున్న నేతలు, సై అంటే సై అనుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పైగా, త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వార్‌కు సిద్ధమౌతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకుని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గ్రేటర్లో బీఆర్ఎస్.. మా పుణ్యమే!
2020 డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. 2025 డిసెంబర్‌తో పదవీకాలం ముగుస్తోంది. ఈ లెక్కన ఇంకో 14 నెలల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. గత ఎన్నికల్లో రెండు సీట్లే గెలిచిన కాంగ్రెస్, ఈమధ్య రాష్ట్రంలో అధికారం చేపట్టాక రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ మద్దతున్న కార్పొరేటర్ల సంఖ్య 19కి చేరింది. అటు బీఆర్ఎస్, బీజేపీ తమకున్న స్థానాలను పదిలం చేసుకునేందుకు వ్యూహాలు మొదలుపెట్టాయి. ఇలాంటి సమయంలో ఇన్నాళ్లూ మిత్రపక్షంగా ఉన్న బీఆర్ఎస్ను టార్గెట్ చేసుకుని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఫైరవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో తమ మద్దతు వల్లే గ్రేటర్లో గెలిచారని, లేకుండా బీఆర్ఎస్ పరువు పోయేదని అన్నారు. ఆపార్టీ నేతల జాతకాలన్నీ తమ దగ్గర ఉన్నాయని స్పష్టం చేశారు. అహంకారం వల్లే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిందని అన్నారు. మూసీ సుందరీకరణను అడ్డుకుంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో మూసీ సుందరీకరణ పేరుతో చేసిందేమీలేదన్నారు. కాంగ్రెస్‌తో ఎంఐఎం జత కట్టిందని అంటున్నారని, గత ఎన్నికల్లో తమ మద్దతుతోనే గెలిచారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ గురించి తాము చెప్పడం మొదలుపెడితే తట్టుకోలేరని హెచ్చరించారు అసదుద్దీన్. ప్రజల్లో అపోహలు రేకెత్తించొద్దని సూచించారు.
ALSO READ : కులగణన సర్వేకు బీజేపీ మద్ధతు.. ఎంపీ ధర్మపురి ఆసక్తికర కామెంట్స్