Prashant Kishor Election Fee | భారతదేశంలోనే టాప్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఆయన గురించి తెలియని వారుండరు. 2014 లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఆ తరువాత ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ, బెంగాల్ లో టిఎంసీ, తమిళానాడు డిఎంకె లాంటి ఎన్నో పార్టీల కోసం ఎన్నికల్లో సలహాదారునిగా ఉండి వారికి విజయాలను అందించారు. అయితే ఆయన ప్రస్తుతం ఈ పనికి కాస్త బ్రేక్ ఇచ్చి స్వయంగా జన్ సురాజ్ అనే రాజకీయ పార్టీ స్థాపించారు. బిహార్ లో ఈ నెలలో జరుగబోయే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తన సొంత పార్టీతో పోటీ చేయబోతున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రచారం నిర్వహిస్తూ.. తన వద్ద బాగా డబ్బు ఉందని చెప్పడంతో ఇప్పుడు అందరి చూపు ఆయనవైపే ఉంది.
బిహార్ రాష్ట్రంలో బేలాగంజ్, ఇమాంగంజ్, రామ్ గడ్, తరారీ లాంటి మొత్తం నాలుగు నియోజకవర్గాలలో నవంబర్ 13న ఉపఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం వేడివేడిగా సాగుతోంది. అధికారంలో ఉన్న జెడియు, బిజేపీ కూటమి పార్టీలు, ప్రధాన ప్రతిపక్షం ఆర్జెడి పార్టీతోపాటు ప్రశాంత్ కిషోర్ సొంత పార్టీ జన్ సురాజ్ కూడా ఎన్నికల బరిలో దిగింది. ఇన్ని రోజులు ఇతర పార్టీలకు సలహాదారునిగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు స్వతహాగా ఎన్నికల బరిలో దూకి తన సత్తా చాటే పనిలో పడ్డారు. అందుకే తానేంటో నిరూపించుకునేందుకు ఎన్నికల ప్రచారంలో వాడి-వేడి ఉన్న వ్యాఖ్యలు చేస్తున్నారు.
Also Read: ‘పక్షపాతంగా వ్యవహరించడంలో ఎన్నికల కమిషన్ సూపర్’.. ఈసీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
తాజాగా బేలాగంజ్ నియోజకవర్గంలో ఆయన ప్రచారం చేస్తూ.. “లా మంది నా పార్టీ ఎక్కువ రోజులు ఉండదని ఎద్దేవా చేస్తున్నారు. నా దెగ్గర పార్టీ ప్రచారానికి కూడా డబ్బు లేదని అనుకుంటున్నారు. కానీ అందరికీ ఇదే చెబుతున్నా.. ఇలాంటి ప్రచారాల కోసం నా దెగ్గర డబ్బు లేదని అనుకుంటున్నారా?.. ఈ మాత్రం కార్లు, టెంట్లు, పోస్టర్ల ఖర్చు నేను భరించలేనని అనుకుంటున్నారా? మరి నేనంత బలహీనుడనని భావిస్తున్నారా? అయితే వినండి.. బిహార్ లో నేను తీసుకున్నంత ఫీజు ఎవరూ తీసుకొని ఉండరు. ఒక ఎన్నికలో సలహాలు మాత్రమే ఇచ్చేందుకు నేను కనీసం రూ.100 కోట్లు తీసుకుంటా. అంతకంటే ఎక్కువే తీసకుంటా. మరో రెండు సంవత్సరాలపాటు నా పార్టీ ప్రచారం కోసం అయ్యే ఖర్చుని నేను ఇతరులకు ఒక ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి సంపాదించేస్తా. దేశంలోని 10 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నా సలహాలతోనే నడుస్తున్నాయి.” అని చెప్పారు.
ప్రచారంలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. జాతి, కులం, మతం పేరిట ఓట్లు వేయడం మానుకోవాలని, ఉచితంగా బియ్యం వస్తుందని ఆశించడంతోనే రాష్ట్రం వెనుకబడిపోయిందని అన్నారు.
ప్రశాంత్ కిషోర్ బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేయడం బీహార్ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ప్రశాంత్ కిషోర్ ఉద్దేశమేంటి? ఇది కూడా ఆయన ఎన్నికల వ్యూహంలో భాగమేనా? అని చర్చ జరుగుతోంది. ఈ నెలల చివర్లో జరిగే బిహార్ ఉపఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ తరపున బేలాగంజ్ నియోజకవర్గంలో మొహమ్మద్ అంజద్, ఇమాంగంజ్ నియోజకవర్గం నుంచి జీతేంద్ర పాస్వాన్, రామ్ గడ్ నియోజకవర్గంలో సుశీల్ కుమార్ సింగ్ కుశ్వాహా, తరారీ నియోజకవర్గంలో కిరన్ సింగ్ పోటీ చేయబోతున్నారు.
అక్టోబర్ 2, 2024న ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ రాజకీయ పార్టీని బిహార్ రాజధాని పట్నాలో స్థాపించారు. పార్టీ స్థాపించే ముందు ఆయన సంవత్సరకాలం ప్రజల్లో పాదయాత్ర చేసి సేవా కార్యక్రమాలు చేశారు. 2025 అక్టోబర్ – నవంబర్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ రాష్ట్రంలోని అన్ని 243 సీట్లలో పోటీ చేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి కూడా లభించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున మొత్తం 40 మంది మహిళలు పోటీ చేస్తారని ప్రశాంత్ కిషోర్ ముందుగానే ప్రకటించారు.