రాష్ట్రంలో ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఈనెల 6వ తేదీ నుండి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. 6వ తేదీ నుండి ప్రభుత్వం సమగ్ర కులగణన ప్రారంభిస్తుండగా ఈనెల30వ తేదీ వరకు కొనసాగనుంది. దీని కోసం 36వేల 559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, 3 వేల 414 ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లు అదే విధంగా మరో 8వేల మంది ఇతర సిబ్బంది అవసరం కావడంతో వారిని సర్వే కోసం కేటాయించారు. ప్రతి 150 ఇండ్లకు ఒక పర్యవేక్షణాధికారి ఉంటారు. ఈ నేపథ్యంలోనే సర్వే పూర్తయ్యే వరకు ప్రైమరీ స్కూళ్లకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కాబట్టి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు స్కూల్ తెరిచి ఉండగా ఆ తరవాత మిగితా సమయంలో ఉపాధ్యాయులు కులగణన కోసం ఇంటింటికి వెళ్లాలి. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కులగణను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. ఇచ్చిన హామీలు అన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న ప్రభుత్వం ఇప్పుడు కులగణనపై ఫోకస్ పెట్టింది. పూర్తి పారదర్శంగా సర్వే చేయాలని నిర్ణయించింది. దీంతో ఈనెల 13వరకు బీసీ కమిషన్ అభిప్రాయాలను సైతం సేకరిస్తోంది.
అభిప్రాయాల సేకరణ తరవాత రిపోర్టును కూడా బహిర్గతం చేస్తామని కమిషన్ ప్రకటించింది. ఇక కులగణనలో మొత్తం 75 ప్రశ్నలను అడగనున్నారు. కుటుంబ సభ్యుల పేర్లు, కులం, మతంతో పాటూ ఇతర ప్రశ్నలను అడుగుతారు. అదేవిధంగా కులగణన కోసం ప్రత్యేకమైన కిట్లను ఉపయోగిస్తారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఓ సభలో మాట్లాడుతూ…దేశానికి తెలంగాణ కులగణన విషయంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ కావాలని చెప్పారు. సామాజిక న్యాయం ప్రకారం రాష్ట్ర ఆదాయాన్ని పంచడమే తమ విధానం అని అన్నారు. దీంతో ప్రభుత్వం కులగణన విషయంలో ఎంత శ్రద్ధతో ఉందో అర్థం చేసుకోవచ్చు.