US Halloween Gunfire| పాశ్చాత్య దేశాల్లో జరిగే హాలోవీన్ పండుగ అమెరికాలో విషాదంగా మారింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఆర్లోండో నగరంలో ఒక ఉన్మాది పండుగ జరుపుకుంటున్న ప్రజలపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో సంతోషంగా ఉన్న పండుగ వాతావరణంలో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, ఆరుగురికి తీవ్రగాయాలైనట్లు ఆర్లోండో నగర పోలీసులు శుక్రవారం తెలిపారు.
కాల్పులు జరిపిన ఉన్మాదిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు 17 ఏళ్ల టీనేజర్ అని, అతడు ఎందుకు కాల్పులు జరిపాడో ఇంత వరకు స్పష్టమైన కారణాలు తెలియేలేదని ఆర్లోండో నగర పోలీస్ చీఫ్ ఎరిక్ స్మిత్ తెలిపారు. చనిపోయిన పూర్వీకులు, మతగురువుల జ్ఞాపకార్థంగా అమెరికా సహా 35 దేశాల్లో హాలోవీన్ పండుగ ప్రతి సంవత్సరం అక్టోబర్ 31 రాత్రి జరుపుకుంటారు.
ఈ క్రమంలో రాత్రి 1 గంటకు (నవంబర్ 1)కు ఆర్లాండో నగరంలోని డౌన్ టౌన్ బార్ అండ్ రెస్టారెంట్‌లో కొందరు నగరవాసులు హాలోవీన్ వేడుకలు జరుపుకుంటూ ఉండగా.. నిందితుడు కూడా హాలోవిన్ విచిత్ర వేషధారణలో అక్కడికి వచ్చాడు. ఆ తరువాత వేడుకల్లో బిజీగా ఉన్న వారిపై ఇష్టారీతిన తుపాకీతో కాల్పులు జరిపాడని సమాచారం. ఈ ఘటనలో గాయపడిన వారంతా 19 నుంచి 39 ఏళ్ల వయసు వారేనని పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారందరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించామని.. అక్కడ వారి చికిత్స పొందుతూ స్థిరంగానే ఉన్నారని చెప్పారు.
ఘటనాస్థలంలో నిందితుడు కాల్పులు జరుపుతుండా సిసిటీవి కెమెరాల్లో వీడియో రికార్డ్ అయింది. ఆ వీడియోని పోలీసులు మీడియా ప్రతినిధులకు చూపించారు. అయితే కాల్పులు జరిపిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అతను ముందుగానే అక్కడికి కాలినడకన వచ్చాడు. అతడి కోసం గాలిస్తున్న పోలీసులకు కొంతదూరంలో నిందితుడు మళ్లీ కాల్పులు జరిపినట్లు శబ్దాలు వినిపించాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని అతడిని పట్టుకున్నారు. “పోలీసులపై కూడా నిందితుడు కాల్పులు జరిపినట్లు తెలిపారు. అతను ఓ సైకో లాగా వ్యవహరించాడు. హాలోవీన్ రాత్రి కనిపించిన వారందరిపై కాల్పులు చేస్తూ వెళ్లిపోయాడు. అతను ఎందుకిలా చేశాడో ఇంతవరకు స్పష్టం కాలేదు” అని పోలీస్ చీఫ్ ఎరిక్ స్మీత్ చెప్పారు.
Also Read: కాళ్లు మొక్కి మరీ కాల్చేశాడు.. ఢిల్లీలో దిపావళి రోజు దారుణం, ఇద్దరు మృతి
నిందితుడిని అరెస్ట్ చేశాక.. అతడి వద్ద నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నామని, ఘటనా స్థలంలో నిందితుడు ఒక్కడే ఉన్నాడని.. అతనితో ఇతరులు లేరని.. పోలీసులు తెలిపారు. 17 ఏళ్ల నిందితుడిపై రెండు ఫస్ట్ డిగ్రీ మర్డర్ చార్జీలు (ఉద్దేశపూర్వకంగా హత్యలు), ఆరు హత్యయత్నం కౌంట్లు, చట్టవ్యతిరేకంగా తుపాకీ కలిగి ఉండడం లాంటి నేరారోపణలు నమోదు చేశామని చెప్పారు. అయితే నిందితుడు టీనేజర్ కావడంతో అతడిని మేజర్ గానే విచారణ చేయాలా? లేదా? అనే విషయం ఫ్లోరిడా స్టేట్ అటార్నీ(పబ్లిక్ ప్రాసిక్యూటర్) నిర్ణయిస్తారని అన్నారు.
అక్టోబర్ 31 రాత్రి దాదాపు 50000 నుంచి లక్ష మంది రోడ్లపై వచ్చి పండుగ చేసుకున్నారని, వారి భద్రత కోసం 100 మంది ఆఫీసర్లు శుక్రవారం నవంబర్ 1 వరకు పాట్రోలింగ్ చేశారని ఎరిక్ స్మీత్ అన్నారు.
ఆర్లాండో నగరంలో ప్రతి సంవత్సరం హాలోవీన్ పండుగ ఘనంగా జరుపుకుంటారు. నగర పరిసరాల్లో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన పర్యాటకులు హాలోవీన్ జరుపుకుంటారు. వీరి సంఖ్య 10000 కంటే ఎక్కువగా ఉంటుందని, హాలోవీన్ పండుగ తరువాత కూడా వారం రోజుల వరకు వారంతా వేడుకలు జరుపుకుంటూ ఉంటారని.. అయితే ఈ క్రమంలో మద్యం సేవించిన కొన్ని అల్లరి మూకలు నేరాలకు పాల్పడే ఘటనలు ప్రతీ సంవతసరం నమోదు అవుతుంటాయని స్మీత్ అన్నారు. పండుగవేళ భద్రతా సమస్య రాకుండా ఉండేందుకు అర్ధరాత్రి 1 గంట తరువాత మద్య విక్రయాలపై ఆర్లాండో మేయర్ నిషేధం విధించినట్లు సమాచారం.