Google Phones Ban| గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్స్‌పై ఇండోనేషియా ప్రభుత్వం నిషేధం విధించింది. కొన్ని రోజుల క్రితమే ఆపిల్ ఐఫోన్ 16 ఫోన్స్ ని కూడా నిషేధించిన ఇండోనేషియా అదే కారణాల చూపుతూ గూగుల్ కంపెనీ ఫోన్స్ కూడా తమ దేశంలో విక్రయించడానికి వీల్లేదని తెలిపింది.
ఇండోనేషియా లో ప్రభుత్వ నియమా ప్రకారం.. దేశంలో విక్రయించబడే విదేశీ ఫోన్లలో 40 శాతం విడిభాగాల తయారీ ఇండోనేషియాలోనే జరగాలి. ఈ నియమాన్ని ఆపిల్ కంపెనీ, గూగుల్ పాటించలేదని కారణం చూపుతూ ఆ కంపెనీ ఫోన్లను ఇండోనేషియా మార్కెట్లో నిషేధించింది.
ఈ విషయంపై ఇండోనేషియా పారిశ్రామిక మంత్రిత్వశాఖ ప్రతినిధి ఫెబ్రి హెండ్రి ఆంటోని స్పందించారు. “ఇండోనేషియాలో విదేశీ పెట్టుబడుల కోసం ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. అయినా కొందరు పెట్టుబడిదారులు నియమాలను పాటించడం లేదు. గూగుల్ కంపెనీ కూడా తమ ఉత్పత్తుల విషయంలో ప్రభుత్వ నియమాలను పాటించలేదు. అందుకే మా దేశంలో వారి ఉత్పత్తులు విక్రయించడానికి వీల్లేదు. కానీ గూగుల్ పిక్సిల్ ఫోన్స్ కావాలనుకున్న వారు బయటి దేశాల నుంచి కొనుగోలు చేయవచ్చు. అయితే అందుకుగాను ప్రభుత్వం వారిపై తగిన పన్ను విధిస్తుంది. ఒక వేళ దొంగచాటుగా అటువంటి ఫోన్ల విక్రయాలు జరిగితే వాటిని డియాక్టివేట్ చేస్తాం.” అని హెచ్చరించారు. ఇండోనేషియాలో లోకల్ డిస్ట్రిబ్యూటర్లతో జతకట్టి విడిభాగాల తయారీ చేపట్టాలని విదేశీ కంపెనీలకు ఆయన సూచించారు.
Also Read: బాబోయ్.. హ్యాకర్స్ లో ఎన్ని రంగులో.. ఒకరు చేసిన పని మరొకరు చేయరా.. దిమ్మతిరిగే నిజాలివే!
లోకల్ విడిభాగాల తయారీ నియమాన్ని గూగుల్ తో పాటు ఐఫోన్ తయారీ కంపెనీ యాపిల్ కూడా పాటించడం లేదని కారణం చూపుతూ.. వారం రోజుల క్రితమే ఐఫోన్ 16 మోడల్స్‌ని కూడా ఇండోనేషియా ప్రభుత్వం నిషేధించింది. గూగుల్ కంపెనీ.. ఇండోనేషియా నిషేధంపై స్పందించింది. తమ కంపెనీ పిక్సెల్ ఫోన్స్ అధికారికంగా ఇండోనేషియాలో పంపిణీ జరగలేదని.. త్వరలోనే దీనిపై ప్రభుత్వంలో చర్చిస్తామని గుగుల్ ప్రతినిధులు తెలిపారు.
ఇండోనేషియాలో స్మార్ట్ ఫోన్స్ , ఇతర టెక్నాలజీ గ్యాడ్జెట్స్ ఉపయోగించే వారి సంఖ్య చాలా ఎక్కువ. దీంతో ఇండోనేషియా మార్కెట్ కోసం చాలా కంపెనీలు పోటీపడుతున్నాయి. అయితే ఇండోనేషియా మార్కెట్‌లో యాపిల్ ఐఫోన్స్, గూగుల్ పిక్సెల్ ఫోన్స్ కు అంతగా డిమాండ్ లేదు. మే 2024లో విడుదలైన మొదటి త్రైమాసికం రిపోర్ట్ ప్రకారం.. చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో, సౌత్ కొరియన్ కంపెనీ శామ్ సంగ్.. టాప్ పొజిషన్ లో ఉన్నాయి.
అయితే ఇండోనేషియా కఠిన నియమాలు పెట్టుబడిదారులకు అడ్డంకిగా మారాయని.. దీని వల్ల వినియోగదారులకు నష్టమే జరుగుతుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు ఆపిల్ కంపెనీ ఇటీవలే ఐఫోన్ 16, ఐఫోన్ 15 ప్రో ఫోన్ల కోసం ఆపిల్ ఇంటెలిజెన్స్ అప్డేట్స్ రిలీజ్ చేసింది. యూజర్లకు అడ్వాన్స్‌డ్ రైటింగ్ టూల్స్, సిరి ఏఐలో మెరుగైన ఫీచర్స్ కూడా డిసెంబర్ లోగా అందుబాటులోకి వస్తాయని ఆపిల్ కంపెనీ తెలిపింది. రైటింగ్ టూల్స్ లోనే ఓపెన్ ఏఐ చాట్‌జిపిటి ఇంటిగ్రేషన్ చేస్తామని వెల్లడించింది.