Minister Uttam with Food Secretary Sanjeev: ధాన్యం, ప్రజా పంపిణీ విధానంలో తెలంగాణ రోల్ మోడల్ కావాలని ఆకాంక్షించారు కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా. కొన్ని విషయాల్లో ప్రభుత్వం తీసుకొస్తున్న నిర్ణయాలు బాగున్నాయని కితాబు ఇచ్చారు.
శుక్రవారం హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఆహారశాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా, మంత్రి ఉత్తమ్ కుమార్‌తో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన సమావేశంలో కీలక విషయాలను వెల్లడించారాయన. ధాన్యం సేకరణ, మిల్లింగ్ విధానంలో తీసుకొచ్చిన కొత్త సంస్కరణలు బాగుందన్నారు.
అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థలో కొత్త కొత్త సంస్కరణలు తీసుకొస్తే బాగుంటుందన్నారు. వాటిని ఇతర రాష్ట్రాలు అనుసరించేలా ఉండాలన్నారు. ఏజీ కాలనీలో చౌక ధరల దుకాణాన్ని సందర్శించారాయన. ముఖ్యంగా బియ్యం, గోదుముల నాణ్యత పరిశీలించి రేషన్ డీలర్‌తో మాట్లాడారు.
అంతకు ముందు సివిల్ సప్లై కార్యాలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. సంస్కరణల విషయంలో కేంద్రం నుంచి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పుకొచ్చారు సంజీవ్ చోప్రా.
ALSO READ: హైదరాబాద్.. పార్కు చేసిన కారులో మంటలు, చేయించారా? అనుకోకుండా..
ఈ క్రమంలో కార్యదర్శి సంజీవ్ చోప్రా దృష్టికి కొన్ని అంశాలు తీసుకెళ్లారు మంత్రి ఉత్తమ్. ధాన్యం కొనుగోళ్లు విధానం, మిల్లర్లకు బ్యాంక్ గ్యారెంటీ, బకాయిదారుల ఆస్తులు సీజ్ చేయడం, వారికి ధాన్యం కేటాయింపు నిలిపివేయడం వాటిని వివరించారు. వాటిని క్షుణ్నంగా విన్న ఆయన, పరిశీలిస్తామని చెప్పినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.