Love Cheating: ఆధునిక కాలంలో ప్రేమికుల సంఖ్య పెరిగిపోతుంది. ప్రేమ వివాహాలు కూడా అధికంగానే జరుగుతున్నాయి. అయితే ప్రేమించే కాలంలో నిజాయితీగా ఉన్న వారి సంఖ్య తగ్గిపోతుంది. బాయ్ ఫ్రెండ్ చేతిలో మోసపోతున్న అమ్మాయిల సంఖ్య కూడా అధికంగానే ఉంది. ప్రేమలో మోసం చేయడం అనేది నమ్మకద్రోహంతో సమానం. ఇది హృదయాన్ని బద్దలు చేస్తుంది. ఏదో కోల్పోయిన అనుభూతిని ఇస్తుంది. అప్పటివరకు ఒకరికొకరులా ఉన్నవారు అభద్రతాభావంలోకి వెళ్లి పోతారు. మీ బాయ్‌ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేస్తున్నాడా? లేక మీతో నిజాయితీగా ఉంటున్నాడా? తెలుసుకోవడం కోసం మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. మీ బాయ్ ఫ్రెండ్ లో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే అతను మిమ్మల్ని మోసం చేస్తున్నాడేమో అని అనుమానించాల్సిందే. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకోండి.
ఫోన్ రహస్యంగా వాడితే
మీ బాయ్ ఫ్రెండ్ తన ఫోను, లాప్టాప్ వంటి వాటిని మిమ్మల్ని చూడనివ్వకుండా రహస్యంగా ఉంచితే అతడు ఏదో దాస్తున్నట్టే లెక్క. మీరు చూడకూడనిది వాటిలో ఏదో ఉందని అర్థం. అతను మీ నుండి ఏదీ దాచడానికి ప్రయత్నించకూడదు. అప్పుడే అతను నిజాయితీగా ఉన్నట్టు. దాస్తున్నట్టు ప్రయత్నిస్తే అతని ప్రేమను శంకింల్సిందే.
లోపాలు మాట్లాడుతూ
మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశంలో ఉంటే అతను మీలోని లోపాలను తరచూ ఎత్తిచూపుతూ ఉంటాడు. మీరు చేసిన చిన్న తప్పులను కూడా పెద్దవిగా చేసి వాదిస్తూ ఉంటాడు. మీరేదో నేరం చేసినట్టు మాట్లాడతాడు. మీ నుంచి దూరంగా ఉండడానికి ఇష్టపడుతున్నట్టు కనిపిస్తాడు. ఇలా చేస్తూ ఉంటే మాత్రం అతని మనసులోని విషయాన్ని నేరుగా అడిగి తెలుసుకోవడం మంచిది.
మీ ప్రేమికుడు అకస్మాత్తుగా మీ నుంచి దూరంగా ఉంటున్నట్టు మిమ్మల్ని కలవడానికి ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తే అతని గురించి ఆరా తీయాల్సిందే. మిమ్మల్ని కలవకుండా ఏవైనా సాకులు చెప్పి తప్పించుకుంటున్నా కూడా అతను మిమ్మల్ని మోసం చేస్తున్నాడేమో ,వేరొకరికి దగ్గర అయ్యాడేమోనని అనుమానించాల్సిందే.
మీ బాయ్ ఫ్రెండ్ ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు వచ్చినా, అతను కొత్త కొత్త ఆలోచనలను, కొత్త అభిరుచులను చూపిస్తున్నా కూడా మీరు కొంచెం అనుమానించాల్సిందే. అంతవరకు నచ్చని సంగీతం లేదా డాన్యు వంటివి అతనికి హఠాత్తుగా నచ్చేస్తుంటే… అతని జీవితంలో ఎవరో ఉన్నారేమోనని ఆలోచించాలి. కొత్తవారిని ఆకట్టుకోవడానికి కొత్త కొత్త పనులను నేర్చుకుంటూ ఉంటారు కొంతమంది మగవారు.
అబద్ధాలో కాదో తెల్చేయండి
అతను మీతో మాట్లాడే విషయాలు అబద్దాలో, నిజాలో ఎప్పటికప్పుడు తేల్చుకోవాలి. అబద్ధాలు చెప్పే వాడిని అయితే దూరంగా పెట్టడమే మంచిది. నిజాయితీగా ఉండి మీ ప్రేమను అర్థం చేసుకొని పెళ్లి వరకు తీసుకెళ్లాలనుకునే వ్యక్తి అబద్ధాలు చెప్పడు.కానీ మీ దగ్గర అతని కుటుంబ విషయాలు దాస్తుంటే మాత్రం అతడి ప్రేమను అనుమానించాలి. కాబట్టి అతని గురించి మొదట పూర్తిస్థాయిలో నిజాలు తెలుసుకోవడం ఉత్తమం.
Also Read: ఏ వ్యక్తి అయినా మిమ్మల్ని నిశ్శబ్దంగా ప్రేమిస్తే అతడిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి
మీరు తప్ప మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు మీ బాయ్ ఫ్రెండ్ ప్రవర్తన పట్ల సంతృప్తిగా లేకపోతే మీరు ఒకసారి అతని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొందరిలోని లోపాలను మీరొక్కరూ గమనించలేకపోవచ్చు. మిగతావారు అతడిలోని లోపాలను గమనించే అవకాశం ఉంది. మీరు మీ బాయ్ ఫ్రెండ్ లోపాలు కనిపెట్టలేకపోవచ్చు, కానీ ఇతరులు ఆ పని చేయగలరు. కాబట్టి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు మీ బాయ్ ఫ్రెండ్ ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తే దాన్ని మీరు కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే అతను ఎలాంటి వాడో తెలుసుకునే ప్రయత్నాన్ని చేయాలి.