హిందూ సాంప్రదాయంలో బొట్టు పెట్టడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కచ్చితంగా బొట్టు పెట్టుకునే ఇంటి నుంచి అడుగుపెట్టే వారు ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారు. ఇది సానుకూలతను, రక్షణను, ధైర్యాన్ని ఇస్తుందని అంటారు. అలాగే కొత్త ప్రారంభానికి చిహ్నంగా కూడా బొట్టును భావిస్తారు. అయితే ఇప్పటికీ ఏ వేలితో బొట్టు పెట్టాలో కూడా తెలియని వారు ఎంతోమంది. సందర్భాన్ని బట్టి మీరు ఏ వేలితో బొట్టు పెట్టాలన్నది మారిపోతూ ఉంటుందని చెబుతున్నారు హిందూ పండితులు. కాబట్టి మీరు బొట్టు పెట్టుకునేటప్పుడు ఏ వేలితో పెట్టుకోవాలి? ఎదుటివారికి బొట్టు పెట్టినప్పుడు ఏ వేలిని ఉపయోగించాలో తెలుసుకోండి.
బొటనవేలితో బొట్టు ఎప్పుడు పెట్టాలి?
బొట్టును పెట్టే వేలును బట్టి మీ ఉద్దేశాలు మారిపోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక పనిలో విజయం సాధించాలని, వృత్తిపరంగా ఎదగాలని, అతను అనుకున్న పనులు పూర్తి చేయాలని మీరు కోరుకుంటే బొటనివేలితో ఆయనకి బొట్టును పెట్టాలి. బొటనవేలతో తిలకం దుద్దడం వల్ల వారికి అధికారం, విజయం వంటివి వరిస్తాయని చెబుతారు. పురాతన కాలంలో సైనికులు యుద్ధానికి వెళ్ళినప్పుడు వారి భార్యలు బొటనవేలుతోనే నుదుటిపై తిలకాన్ని దిద్ది పంపించేవారు. ఇది విజయ దీవెనగా చెప్పుకుంటారు. పూర్వం మగవారు బయటికి వెళ్లేటప్పుడు మహిళలు కచ్చితంగా బొటనవేలితో నిలువుగా బొట్టు పెట్టాకే బయటికి పంపించేవారు.
దేవతా విగ్రహాలకు
ఇంట్లోని పూజ సమయంలో దేవత విగ్రహాలకు బొట్టు పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉంగరపు వేలినే ఉపయోగించాలి. ఉంగరపు వేలు భక్తి , నిబద్ధతకు చిహ్నం వంటిది. దైవిక శక్తులకు బొట్టు పెట్టడానికి కచ్చితంగా ఉంగరపు వేలిని మాత్రమే వినియోగించాలి. ఉంగరపు వేలిని చాలా పవిత్రంగా భావిస్తారు. కాబట్టి గుడిలో కూడా కచ్చితంగా ఉంగరపు వేలితోనే బొట్టు తీసి పెట్టుకోవడం వంటివి చేయండి.
ఇక మీరు సొంతంగా నుదుటిపై తిలకాన్ని దిద్దుకోవాలనుకుంటే ఏ వేలిని వాడాలో తెలుసుకోండి. ప్రార్థనా సమయంలో మీరు నుదుటిపై కుంకుమ బొట్టును పెట్టుకోవాలనుకుంటే మళ్లీ ఉంగరపు వేలునే ఉపయోగించండి. అలాగే పూజ సమయంలో ఇతరులకు మీరు బొట్టు పెట్టాలన్నా కూడా ఉంగరపు వేలితోనే బొట్టును పెట్టాలి. ఇలా చేయడం వల్ల వారికి మేధస్సు, మానసిక ఆరోగ్యం, జ్ఞానం వంటివి కలుగుతాయని చెబుతారు. దీర్ఘాయువు కోసం ఇతరులకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకుంటే మాత్రం మధ్య వేలితో (అన్నింటికన్నా పెద్దవేలు) బొట్టు పెట్టడం చేయండి. ఇది వారికి శాంతిని, సంపూర్ణత్వాన్ని, తెలివితేటలను అందించేందుకు ఉపయోగపడుతుంది.
మరణించిన వారి ఫోటోలకు
ఇక మరణించిన వ్యక్తుల ఫోటోలకు ఇంట్లో బొట్టు పెడుతూ ఉంటారు. ఇలా మరణించిన వారి వ్యక్తికి లేదా వారి చిత్రపటానికి తిలకాన్ని దిద్దేటప్పుడు కచ్చితంగా చూపుడువేలును వాడాలి. చూపుడువేలు మోక్షానికి సంబంధించినది. బతికున్న ఏ వ్యక్తికీ చూపుడు వేలుతో బొట్టును పెట్టకూడదు. మరణించిన వ్యక్తికి మీరు చూపుడు వేలితో బొట్టును పెట్టడం వల్ల అది వారికి సరైన మోక్షమార్గంలో ప్రయాణించేలా సహాయపడుతుందని చెప్పుకుంటారు.
ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని బట్టి మీరు బొట్టు ను పెట్టడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడూ ఒకేలాగా ఒకే వేలితో బొట్టు పెట్టడం మంచిది కాదు. సందర్భాన్ని బట్టి బొట్టు పెట్టే వేలిని ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది.
గమనిక: పండితులు, పెద్దలు చెప్పిన.. గ్రంథాలు, శాస్త్రాల్లో పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను యథావిధిగా మీకు అందించాం. ఈ అంశాలకు ‘బిగ్ టీవీ లైవ్’ బాధ్యత వహించదని గమనించగలరు.