Elephants Die in MP : మధ్యప్రదేశ్ లోని బాంధవ్ గర్హ్ టైగర్ రిజర్వ్ లో వరుస ఏనుగు మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒకే వారంలో ఇప్పటి వరకు ఏడు ఏనుగులు చనిపోగా.. తాజాగా మరో మూడు ఏనుగులు మరణించినట్లు ఫారెస్ట్ సిబ్బంది గుర్తించారు. దాంతో.. అసలు అక్కడేం జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భారత్ లో ఇప్పటి వరకు ఒకే వారంలో పది ఏనుగులు మరణించిన దాఖలాలు లేవు. దాంతో.. ఏనుగుల మరణాల వెనుక కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు.
పెద్ద సంఖ్యలో ఏనుగులు మరణించడంతో వీటిని చంపేందుకు ఎవరైనా కుట్రలు చేశారా.? అని మీడియా ప్రశ్నించగా.. ఏనుగులు చనిపోయిన ప్రాంతంతో పాటు చుట్టు పక్కలా తమ సిబ్బంది పరిశీలించారని, ఇప్పటి వరకు తమకు అనుమానాస్పదంగా ఏమీ కనిపించ లేదని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి వెల్లడించారు. చనిపోయిన ఏనుగులకు పోస్టుమార్టం నిర్వహించామన్న అధికారులు.. మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నామని ప్రకటించారు.
వరుస ఏనుగుల మరణాలతో ఉలిక్కిపడ్డ ఫారెస్ట్ అధికారులు.. అన్ని రకాల ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే.. రాష్ట్ర టైగర్ స్ట్రైక్ ఫోర్స్ బృందం స్నిఫర్ డాగ్స్‌తో అటవీ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టింది. సమీప వ్యవసాయ క్షేత్రాలు, వరి పొలాలు, నీటి కాలువల్లో ఏవైనా విషపూరిత రసాయనాలు.. ఏనుగులు తిన్నాయా అన్న విషయమై పరిశీలిస్తున్నారు. చనిపోయిన ఏనుగులకు శవపరీక్షలు నిర్వహించగా.. ఏనుగుల కడుపులో విషపూరిత పదార్థాలను గుర్తించినట్లు వెటర్నరీ వైద్యులు తెలిపారు. అలాగే.. చనిపోయిన ఏడు ఏనుగులు కోడో మిల్లెట్ అధిక మోతాదులో తిన్నట్లు వైద్యుల రిపోర్టులో వెల్లడైంది. దాంతో కోడో మిల్లెట్ల పొలాల నుంచి నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించినట్లు అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వన్యప్రాణి) అధికారి వెల్లడించారు.
వెటర్నరీ వైద్యుల అనుమానాల నేపథ్యంలో చనిపోయిన ఏనుగుల నుంచి సేకరించిన ఆహార పదార్థాల నమూనాలను జబల్‌పూర్‌లోని స్కూల్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ ఫోరెన్సిక్ అండ్ హెల్త్ (SWFH)కి పంపినట్లు అధికారులు వెల్లడించారు. ఫోరెన్సిక్ పరీక్ష మాత్రమే ఏనుగులు తిన్న ఆహారంలో విషయం ఉందో.? లేదో.? తెలపగలవని స్పష్టం చేశారు.
ఏనుగులు అన్నీ ఒకే మందలోవి.. ఇప్పుడు మూడో మిగిలాయి
ప్రస్తుతం చనిపోయిన 10 ఏనుగులు ఒకే మందలోవి కావడం గమనార్హం. కాగా.. ఈ మందకు నేతృత్వం వహించే మగ జంబో ఏనుగు కూడా చనిపోయింది. దీంతో మందలో కేవలం మూడే ఏనుగులు మిగిలాయి. అవి ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నాయని, వాటిని అడవిలో నిరంతర పర్యవేక్షణలో ఉంచారు. ఈ ఘటనలను సీరియస్ గా తీసుకున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే.. ఓ నిపుణుల కమిటీని నియమించగా, ఇప్పుడు.. ప్రత్యేక దర్యాప్తు బృందం – సిట్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
Also Read : లడఖ్ లో కీలక ప్రయోగం చేపట్టిన ఇస్రో.. సరికొత్త లక్ష్యాలకు సిద్ధమేనా.?
ఈ ఘటనలపై దర్యాప్తు చేసేందుకు ఢిల్లీకి చెందిన వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అధికారులతో ఓ కమిటీని నియమించగా.. వారితో పాటు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ – నాగ్‌పూర్‌కు చెందిన ప్రాంతీయ అధికారి, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ అధికారులు బాంధవ్ గర్హ్ ఫారెస్ట్ కు చేరుకున్నారు. కొన్ని రోజులుగా వారు అక్కడే క్యాంప్ చేస్తున్నారు.